ఆర్థిక ప్రగతికి సాంకేతిక ఆవిష్కరణ ప్రధాన వనరు. మానవ జీవితాన్ని మార్చేయగల సాంకేతిక భావనలకు ఒక రూపం ఇచ్చి వాణిజ్య స్థాయిలో వాటిని విపణిలో ప్రవేశపెట్టినప్పడు అవి నూతన ఆవిష్కరణలు అవుతాయి. వాటి ఫలితంగా వ్యాపారాల్లో కార్మికుల ఉత్పాదకత పెరిగి వస్తుసేవల ధరలు దిగివస్తాయి, వారి వేతనాలు ఇనుమడిస్తాయి. అంతిమంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. మెకెన్సీ సర్వే ప్రకారం, ఆవిష్కరణల మీదే తమ వ్యాపార విజయం ఆధారపడి ఉందని 84శాతం వ్యాపార అధినేతలు భావిస్తున్నారు. పారిశ్రామిక సంస్థలు విపణిలో దూసుకుపోవాలన్నా, దేశం ఆర్థిక పటుత్వం సంతరించుకోవాలన్నా ఆవిష్కరణలు కీలకం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం తాజా నివేదిక ప్రకారం, 2022నాటికి 13.3 కోట్ల కొత్త ఉద్యోగాల కల్పనకు వీలుంది. అలాగే, కార్యస్థలంలోకి ఏఐ (కృత్రిమ మేధ), ఆటోమేషన్, రోబోటిక్స్ ప్రవేశించి 7.5 కోట్ల ఉద్యోగాలను కైవసం చేసుకుంటాయి. ఆవిష్కరణల్లో భారత్ అగ్రశ్రేణి 50 ప్రపంచ దేశాల సరసన చోటు చేసుకుంది. ప్రపంచ మేధా సంపత్తి సంస్థ (డబ్ల్యూఐపీఓ), కార్నెల్ యూనివర్సిటీ, 'ఇన్‌సీడ్' బిజినెస్ స్కూల్ సంయుక్తంగా విడుదల చేసిన ప్రపంచ ఆవిష్కరణల సూచీ(జీఐఐ)లో భారత్ 2019లో 52వ స్థానంలో ఉండగా- 2020లో 48వ స్థానానికి ఎగబాకింది. స్విట్జర్లాండ్, స్వీడన్, యూఎస్, యూకే మొదటి నాలుగు దేశాలుగా నిలిచాయి. విద్యుత్ వాహనాలు, జీవసాంకేతికత, నానోసాంకేతికత, అంతరిక్షం, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వంటి క్షేత్రాల్లో నీతి ఆయోగ్ చేపట్టిన చర్యలు, ఇటీవలి 'ఆత్మనిర్భర్ భారత్' సహా ప్రధాని మోది పథకాలు- సూచీలో భారత్ పైకెగబాకడానికి తోడ్పడ్డాయని ఆ సంస్థలు గుర్తించాయి.
అనుసంధానమే జీవనాడి
గ్లోబల్ కాంపిటీటివ్‌నెస్ ఇండెక్స్ (జీసీఐ) ప్రకారం, దక్షిణ ఆసియా విపణిలో పోటీపరంగా భారత్‌ది అగ్రస్థానం. ఐటీ సేవలు, ఔషధ తయారీ, జీవసాంకేతికత, వైద్య పర్యాటకం వంటి పలు రంగాల్లో భారత్ సంస్థలు అనేక ప్రపంచస్థాయి అవకాశాలు అందుకోగల సానుకూల స్థితిలో ఉన్నాయి. దాదాపు 50వేల అంకుర సంస్థలతో- అమెరికా, బ్రిటన్‌ల తరవాత నేడు ప్రపంచంలోనే అతి పెద్ద అంకుర ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించింది. డిజిటల్ వస్తుసేవల వినియోగ విపణిలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. 2018లో దేశ అంతర్జాల వాడకందారుల సంఖ్య 56కోట్లు. చైనా తరవాత ప్రపంచంలో మరెక్కడా ఈ స్థాయి వినియోగదారులు లేరు. దేశంలో మొబైల్ ఖాతాదారుల నెలసరి సగటు డేటా వినియోగం 8.3 జీబీ కాగా, ఇది చైనాలో 5.5 జీబీ, దక్షిణ కొరియాలో 8-8.5 జీబీ. భారతీయుల మొబైల్ చందాలు (సబ్‌స్క్రిప్షన్‌లు) 120కోట్లు. యాప్ డౌన్‌లోడ్‌లు 1200 కోట్లు. డిజిటల్ సాంకేతికతను స్వీకరిస్తున్న వారు రోజురోజుకూ వృద్ధి చెందుతూ- ఆర్థిక సేవలు, బ్యాంకింగు, రీటెయిల్, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి రంగాల్లో అపారమైన అవకాశాలకు వీలు కల్పిస్తున్నారు.
మానవ చరిత్రలోనే అత్యద్భుత సాంకేతిక పరిణామాల్లో ఒకటిగా పేర్కొనదగిన కృత్రిమ మేధ (ఏఐ) భారత్‌కు ఒక గొప్ప అవకాశం. 2025నాటికి ఏఐ 19వేల కోట్ల డాలర్ల అంతర్జాతీయ పరిశ్రమగా అవిర్భవించనుంది. ఒక ఏడాదిలోనే కాగ్నిటివ్, ఏఐ పరికరాల ప్రపంచవ్యాప్త కొనుగోళ్లు 5700 కోట్ల డాలర్లకు చేరబోతున్నాయి. అదీఇదీ అని కాకుండా ప్రతి రంగాన్నీ ఏఐ తన రెక్కల కిందకు తెచ్చుకుంటోంది. సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, ప్రోగ్రామింగ్, టెస్టింగ్, మద్దతు, నిర్వహణ... ఇలా ఎన్నో క్షేత్రాల్లో కొత్త ఉద్యోగాలు సృష్టి కానున్నాయి. అంతేకాదు, ఈ రంగంలో వేతనాలు విశేషంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే మెషీన్ లెర్నింగ్ ఇంజినీర్ వార్షిక వేతనం 1,25,000 డాలర్లు. ఏఐ ఆర్కిటెక్ట్‌కు 1,45,000 డాలర్లు లభిస్తోంది. మెషీన్ లెర్నింగ్‌లోనూ నిపుణులకు గిరాకీ భారీగా పెరుగుతుంది. ‘ఫారెస్టర్’ అంచనాల ప్రకారం, 2025నాటికి కొత్త ఉద్యోగాల్లో తొమ్మిది శాతం ఏఐ, మెషీన్ లెర్నింగ్, ఆటోమేషన్ రంగాలు కల్పించనున్నాయి. రోబో పర్యవేక్షణ వృత్తి నిపుణులు, డేటా సైంటిస్టులు, అటోమేషన్ ప్రత్యేక నిపుణులు, కంటెంట్ క్యూరేటర్లు- ఇలా ఎందరో కొత్తగా అవసరమయ్యే వారిలో ఉంటారు. వినియోగదారులు ఇప్పటి స్థాయిలో ఏనాడూ తమ పరిసరాలతో సాంకేతికంగా అనుసంధానమై లేరు. ఒక్కొక్కరు అంతర్జాలం లేదా ‘క్లౌడ్’తో నేరుగా సమాచారం పంచుకోగల ఐఓటీ (ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్) సాధనాలను కనీసం నాలుగింటిని కలిగిఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా సగటున ప్రతి సెకనుకూ 127 కొత్త సాధనాలు అంతర్జాలానికి అనుసంధానం అవుతున్నాయి. భారత్‌లోనూ అనుసంధాన సాధనాల దిశగా మళ్లుతున్నవారి సంఖ్య శరవేగంతో పెరుగుతోంది. ఏ సెకనులో మనం అంతర్జాలంలోకి ప్రవేశిస్తామో అప్పుడిక మనకు భౌగోళిక పరిధి ఉండదు. అంతర్జాల పౌరులం అయిపోతాం.
ముందున్న మార్గం!
ప్రపంచంలో ఎక్కడ ఉన్నాసరే- ఒక సాధనాన్ని వినియోగిస్తున్నామంటే మనం సమాచార భద్రత ముప్పు ఎదుర్కొంటున్నట్లే! సైబర్ దాడులు లేదా సైబర్ నేరాలు మనల్ని వెన్నాడుతూ ఉంటాయి. అందువల్లే, ఆన్‌లైన్ పౌరుల డేటా భద్రత, వ్యక్తిగత గోప్యతలను కాపాడే కొత్త ఆవిష్కరణలకు అవకాశాలు అనంతం. వ్యక్తిగత గోప్యతను పెంచే సాంకేతికతలు, స్వయంచాలిత భద్రత, జీరో-ట్రస్ట్ సెక్యూరిటీ, ఎండ్-టు-ఎండ్ కమ్యూనికేషన్ సెక్యూరిటీ, బ్లాక్‌చైన్... ఇంకా అనేక రకాలైన ఉద్యోగాలకు దేశంలో అపరిమిత గిరాకీ ఏర్పడుతుంది. సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాల సంఖ్య ఇతర టెక్ జాబ్స్ కంటే మూడు రెట్లు అధికంగా పెరుగుతూ ఉండటం గుర్తించాల్సిన అంశం. ప్రపంచవ్యాప్తంగా వచ్చే అయిదేళ్లలో ఆరు లక్షల కోట్ల డాలర్లు సైబర్ భద్రత కోసం వెచ్చిస్తారని అంచనా. సైన్సు, ఇంజినీరింగు, టెక్నాలజీలకు చెందిన దాదాపు అన్ని క్షేత్రాల్లో నూతన ఆవిష్కరణలకు 5-జి నెట్‌వర్క్ కీలకం. అయితే 5-జి వినియోగం వల్ల సంబంధిత సాధనాలు, డేటా ప్లాన్ల వ్యయాలు భారీగా పెరుగుతాయి. నూతన ఆవిష్కరణలతో ఇలాంటి సమస్యలను పరిష్కరించుకుంటేనే ప్రపంచ పోటీ విపణిలో దేశం మనగలుగుతుంది. కొవిడ్ మహమ్మారి పర్యవసానంగా దేశీయ, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలు విచ్ఛిన్నమయ్యాయి. అనేక కర్మాగారాలు మూతపడ్డాయి. వీలైనంత తక్కువ వ్యయంతో సరఫరా గొలుసుల పునరనుసంధానం తక్షణ అవసరం. సాంకేతికతలో కొత్త ఆవిష్కరణలే దీన్ని సుసాధ్యం చేయగలవు.
విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ప్రాథమిక చోదకశక్తి నూతన ఆవిష్కరణే. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కొత్త భావనలకు ప్రోత్సాహం, అవి సాకారమై విపణిని చేరేందుకు నిధులు సమకూర్చాలి. పెనుమార్పులకు దారితీయగల అద్భుత భావనలు సైతం పెట్టుబడి లేకపోతే పురిట్లోనే సంధికొట్టి పోతాయి. వినూత్న భావనలకు 'ఇంక్యుబేషన్', వాటిని ఆవిష్కరణలుగా మలచగలిగిన 'వెంచర్ ఫండింగ్' ఇప్పుడు కావాలి. ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఇలాంటి పర్యావరణాన్ని సృష్టించాలి. అప్పుడే అంకురాలు మొగ్గ తొడుగుతాయి. నూతన ఆవిష్కరణలు వికసిస్తాయి.
---డా. కే బాలాజీరెడ్డి, సాంకేతిక విద్యారంగ నిపుణులు