వలసపాలన నుంచి భారత్ విముక్తి పొందిన తీరుపై రకరకాల అభిప్రాయాలున్నాయి. బ్రిటిషర్లపై నేతాజీ సుభాష్ చంద్రబోస్ సాగించిన ఉద్యమాన్ని, భారతీయుల స్వాతంత్య్ర కాంక్షను నెరవేర్చడంలో ఆ పోరాట ప్రభావాన్ని నిశితంగా చర్చిస్తూ కల్యాణ్ కుమార్ డె రాసిన పుస్తకం ఉప రాష్ట్రపతి వెెంకయ్యనాయుడు చేతుల మీదుగా కిందటి నెల ఆవిష్కృతమైంది. స్వాతంత్య్ర ఉద్యమ తుది దశ పరిణామాలపై ఆ పుస్తకం కొత్త గవాక్షాలను తెరచింది. 1947 ఆగస్టులో ఇండియాను వదిలేసి వెళ్ళిపోవాలని బ్రిటిషర్లు ఎందుకు అంత హడావుడిగా నిర్ణయం తీసుకున్నారు, వారిని ఆ వైపు ప్రేరేపించిన పరిస్థితులేమిటన్న ప్రశ్నలకు చరిత్రకారులు ఎవరి కోణంలో వారు విశ్లేషణలు అందించారు. నేతాజీపై తాజా పుస్తకంలో ఈ పరిణామాలను లోతుగా చర్చించడంతోపాటు- ఆనాటి ప్రముఖుల ఉల్లేఖనలను, బ్రిటిష్ పాలన విభాగాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను ఆధారాలుగా ప్రస్తావించారు.
విప్లవ తరంగ ప్రకంపనలు
బ్రిటిష్ జమానాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మోగించిన యుద్ధ భేరి వలస పాలకులను ఏ స్థాయిలో కలవరపెట్టిందో భిన్న ప్రావిన్సులకు చెందిన గవర్నర్లు తమ అధిష్ఠానానికి సమర్పించిన నివేదికలు, అధినాయకులతో సాగించిన ఉత్తరప్రత్యుత్తరాలను పరిశీలిస్తే తేటపడుతుంది. ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్‌ఏ)ని ఏర్పాటు చేసి బ్రిటిష్‌వారితో సైనికంగా తలపడి తాడోపేడో తేల్చుకొనేందుకు సిద్ధపడిన సుభాష్ చంద్రబోస్ తెగువ 1940ల మధ్యకాలంలో వలసవాదుల ఆలోచనాసరళిని ఒక్కపెట్టున మార్చివేసింది. ప్రజాబాహుళ్యంలో బోస్‌పట్ల అంతకంతకూ ఇనుమడిస్తున్న మద్దతును గమనించిన బ్రిటిషర్లు ఎటూ పాలుపోని స్థితిలో పడ్డారు. నేతాజీ ప్రభావం అన్ని ప్రాంతాలకూ ప్రసరించింది. అప్పటి బాంబేలో నావికా తిరుగుబాటు రగిలింది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తిరుగుబాట్లు తలెత్తాయి. మద్రాస్, పుణె సైనిక క్యాంపుల్లో అసంతృప్తి ప్రబలి తిరుగుబాట్లు విస్తరించాయి.
నాలుగో దశాబ్దం మధ్యకాలంలో వలసవాదుల వైఖరి ఎందుకు మారిందన్న ప్రశ్నకు జవాబు సులభంగా దొరక్కపోవడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి: ఆనాటి పరిణామాలను పూసగుచ్చినట్లు ఏకరువు పెట్టే చారిత్రక ప్రతులు అందుబాటులో లేకపోవడం. రెండు: నేతాజీ గొప్పతనాన్ని, ఆయన స్థాపించిన ఐఎన్‌ఏ ప్రాముఖ్యాన్ని తగ్గించి చూపేందుకు అయిదో దశకంనుంచీ కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా ప్రయత్నించడం. నేతాజీ నిబద్ధత, శక్తి సామర్థ్యాలు, దార్శనికతపట్ల ఆకర్షితులై ఆయన పిలుపును అందుకొని, భరతమాత దాస్యవిముక్తే ధ్యేయంగా వేల సంఖ్యలో ప్రజలు భారత్‌లోనూ, ఆగ్నేయాసియా ప్రాంతాల్లోనూ ఐఎన్‌ఏలో చేరారు. కల్యాణ్ కుమార్ డె రాసిన పుస్తకంలో 1945 నవంబరులో బ్రిటిష్ నిఘా విభాగం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెలువరించిన నివేదిక ప్రతిని ముద్రించారు. ఐఎన్‌ఏకు నలుదిక్కులా పెరుగుతున్న ఆదరణను, సేనావాహినిలో విస్తరిస్తున్న అసంతృప్తిని గుదిగుచ్చిన ఆ నివేదిక- ప్రజల్లో పెల్లుబుకుతున్న భావోద్వేగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే దేశవ్యాప్త తిరుగుబాటు తలెత్తడంతోపాటు రక్తపాతం జరుగుతుందనీ హెచ్చరించింది. దేశంలోని అనేక ప్రాంతాలనుంచి గవర్నర్లు నాటి వైస్రాయ్ లార్డ్ వేవెల్‌కు 1945 చివర్లో, 1946 తొలి భాగంలో దాదాపు ఇదే కోణంలో నివేదికలు అందించారు. చాపచుట్టేసి వచ్చినదారిన మరలిపోవడం తప్ప మరో మార్గాంతరం లేని పరిస్థితుల్లో బ్రిటిషర్లు చిక్కుకున్న సందర్భమది. ఐఎన్‌ఏకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే దేశవ్యాప్తంగా అసంతృప్తి భగ్గుమంటుందని, భారతీయ సైన్యంలో తిరుగుబాటుకు అది కారణమవుతుందని లార్డ్ వేవెల్‌కు గవర్నర్లు తేల్చిచెప్పారు. భారత్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల తీవ్రతను కింగ్ జార్జి-4 కు, ప్రధాని క్లెమెంట్ అట్లీకి వైస్రాయ్ ఎప్పటికప్పుడు వివరిస్తూ వచ్చారు. భారత్ అంతటా విస్తరిస్తున్న అసంతృప్తి జ్వాలలకు జడిసిన బ్రిటిషర్లు- ఐఎన్‌ఏకు చెందిన ముగ్గురు విఖ్యాత యోధులు ప్రేమ్ కుమార్ సెహగల్, గుర్బక్ష్ సింగ్ దిల్లన్, షా నవాజ్ ఖాన్‌లకు విధించిన దేశ బహిష్కార శిక్షను తగ్గిస్తూ దాన్ని యావజ్జీవానికి మార్చారు. జనరల్ సి.జె.అచిన్‌లెక్ 1946, ఫిబ్రవరి 12న ఆర్మీ కమాండర్లకు రాసిన 'రహస్య లేఖ'లో- ఐఎన్‌ఏ పట్ల పెరుగుతున్న సానుభూతిని ఇందుకు కారణాలుగా ఉటంకించారు. ఈ నేపథ్యంలోనే 1946, మార్చిలో బ్రిటిష్ ప్రభుత్వం వలసపాలనకు ముగింపు పలకాలని అధికారికంగా ఓ నిర్ణయం తీసుకుంది.
మరుగున పడిన చరిత్ర
వైస్రాయ్ లార్డ్ వేవెల్‌కు 1946, నవంబరు 26న సెంట్రల్ ప్రావిన్సెస్, బెరార్‌కు చెందిన గవర్నర్ సర్ టినమ్ రాసిన లేఖ నాడు బ్రిటిషర్ల అశక్త స్థితిని బయటపెట్టింది. తన పరిధిలోని సుమారు లక్ష చదరపు మైళ్ల భూభాగంలో, కోటి 80 లక్షలమంది ప్రజలను నియంత్రించేందుకు తమ వద్ద కేవలం 17మంది ఐరోపా అధికారులు, ముగ్గురు న్యాయాధికారులు, భారతీయ పోలీసు విభాగానికి చెందిన 19మంది ఐరోపా సభ్యులు (మొత్తంగా 39 మంది) మాత్రమే ఉన్నారని వెల్లడించారు. కేవలం కొన్ని వేల సంఖ్యలోని ఐరోపా అధికారుల సాయంతో- 40 కోట్ల ప్రజలున్న భారతావనిని ఆనాడు బ్రిటిషర్లు శాసించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. కల్యాణ్ కుమార్ డె వంటివారు రాసిన ఇలాంటి చారిత్రక గ్రంథాలు మరుగునపడిన ఎన్నో కోణాలను వెలికితీసుకువస్తాయి. కొందరి అవసరాలకు అనుగుణంగా గడచిన ఏడు దశాబ్దాలుగా వాస్తవాలను తొక్కిపట్టి, పరిమిత కోణంలో ప్రచారం చేసిన చరిత్రను ప్రశ్నించాల్సిన అవసరాన్ని ఈ తరహా గ్రంథాలు గుర్తుచేస్తాయి.
---ఏ. సూర్యప్రకాశ్, రచయిత, ప్రసార భారతి మాజీ ఛైర్మన్