'యాస్' తుపాను కల్లోలానికి ఒడిశా, పశ్చిమ్ బంగ రాష్ట్రాలు విలవిల్లాడిపోయి నాలుగు నెలలు కాలేదు- బంగాళాఖాతం మీదుగా మరో ఉపద్రవం తీరప్రాంతాన్ని ముంచెత్తింది. ప్రచండ గాలులు, మహోద్ధృత వర్షధారలతో ఉత్తరాంధ్ర, ఒడిశాల్లో 'గులాబ్' తుపాను విధ్వంసం సృష్టించింది. శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు ఆరు జిల్లాల్లో 1.64 లక్షల ఎకరాల్లో పంటలను పొట్టనపెట్టుకొంది. ముందస్తు హెచ్చరికల పుణ్యమా అని ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగినా.. ఒక్క విద్యుత్తు శాఖకే రూ.800 కోట్ల రూపాయల దాకా ఆస్తినష్టం సంభవించింది. ఏడేళ్ల క్రితం విలయ తాండవం చేసిన హుద్‌హుద్ తుపాను తరవాత అంతటి కుంభవృష్టితో విశాఖ నగరం నిలువెల్లా వణికిపోయింది. అతి భారీ వర్షాలతో హైదరాబాద్ సహా తెలంగాణలో పలు ప్రాంతాలు కన్నీటి సంద్రాలయ్యాయి. కొట్టుకుపోయిన కల్వర్టులు, కోసుకుపోయిన రహదారులు, నీటమునిగిన పైరులతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హృదయవిదారక పరిస్థితులు నెలకొన్నాయి. బాధితులు తెప్పరిల్లేలా తక్షణ సాయం అందించడం ఎంత కీలకమో.. ప్రకృతి విపత్తులను మరింత మెరుగ్గా ఎదుర్కొనేలా దీర్ఘకాలిక వ్యూహాలపైనా ప్రభుత్వాలు శ్రద్ధపెట్టడం అంతే అవసరం.
ఐదేళ్లలో 30 తుపానులు
గడచిన అయిదేళ్లలో భారత ద్వీపకల్పంపై 30 తుపానులు విరుచుకుపడ్డాయి. 720 నిండు ప్రాణాలను బలితీసుకొన్న ఈ వైపరీత్యాలు- 29.70 లక్షల ఇళ్లను, 1.45 కోట్ల ఎకరాల్లో పంటలను తుడిచిపెట్టేశాయి. వాతావరణ మార్పుల మూలంగా ఆందోళనకర స్థాయిలో ఎగబాకుతున్న హిందూ మహాసముద్ర ఉష్ణోగ్రతలతో తీరప్రాంతాలకు పెనుముప్పు పొంచి ఉందని ఐరాస అంతర ప్రభుత్వాల సంఘం(ఐపీసీసీ) ఇటీవలే హెచ్చరించింది. జాతీయ స్థాయి నుంచి జిల్లాల వరకు సువ్యవస్థితమైన ఏర్పాట్లతో ఉత్పాతాలను సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నామని గత నెలలో కేంద్రం పార్లమెంటులో సెలవిచ్చింది. పూర్వ విపత్తుల విశ్లేషణ, భవితకు సన్నద్ధత, ప్రమాద తీవ్రత తగ్గింపు ప్రణాళికల అమలులో ఎక్కడికక్కడ మేటవేసిన సమస్యలు- జనావళికి ఏటా కడగండ్లనే మిగుల్చుతున్నాయన్నది నిష్ఠుర సత్యం!
'ముందస్తు హెచ్చరికల వ్యవస్థలో సాధించిన ప్రగతి ద్వారా ప్రాణనష్టాన్ని నివారించగలుగుతున్నాం. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను ప్రభావితం చేసే ఆస్తినష్టాన్ని సాధ్యమైనంత తక్కువకు పరిమితం చేయాలి' అని భారత వాతావరణ విభాగం డైరక్టర్ జనరల్ లోగడే స్పష్టంచేశారు. ఆ దిశగా సత్ఫలితాలను ఆశిస్తూ ఆరంభించిన 'జాతీయ తుపాను ప్రమాద తీవ్రత తగ్గింపు కార్యక్రమం'(ఎన్‌సీఆర్‌ఎంపీ) రెండో దశ లక్ష్యాలు పలు రాష్ట్రాల్లో కొల్లబోతున్నాయి. బహుళ ప్రయోజనకర తుపాను షెల్టర్ల నిర్మాణంతో పాటు ఇతర పనుల్లో అలవిమాలిన జాప్యం చోటుచేసుకుంటోంది. తుపాను తీవ్రతను తగ్గించడంలో కీలకపాత్ర వహించే మడ అడవుల హననంతో పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి జారిపోతోంది!
పాఠశాల స్థాయి నుంచే విపత్తు నిర్వహణపై అవగాహన, సంసిద్ధత పరంగా పటిష్ఠ ప్రణాళికలతో జపాన్- ప్రపంచ దేశాలకు విలువైన పాఠాలు బోధిస్తోంది. ముప్పు ముంచుకొచ్చినప్పుడు మారుమూల ప్రాంతవాసులనూ ఆగమేఘాలపై ఆదుకొనే ఏర్పాట్లతో దేశీయంగా ఒడిశా ఆదర్శంగా నిలుస్తోంది. వైపరీత్యాల వేళ నాయకుల మొక్కుబడి ప్రకటనలు, పర్యటనలతో బాధితులకు పెద్దగా ఒనగూడేది ఏమీ ఉండదు. సహాయ, పునరావాస కార్యక్రమాల నిర్వహణ, మౌలిక సదుపాయాల పునరుద్ధరణలో రాష్ట్రాలకు కేంద్రం ఇతోధికంగా తోడ్పడాలి. పోనుపోను ఇంతలంతలవుతున్న తుపాను నష్టాల నుంచి ప్రజలకు సత్వరం సాంత్వన కలిగించడానికి పెద్దయెత్తున విపత్తు నిర్వహణ నిధులను కేటాయించాలి. మహాసాగరాల్లో చోటుచేసుకొంటున్న మార్పులను నిశితంగా గమనిస్తూ, భూతాపానికి కారణమవుతున్న కాలుష్య భూతానికి కళ్లాలు బిగిస్తూ, విపత్తులను తట్టుకొని నిలిచే ప్రాథమిక వసతులను అభివృద్ధి పరస్తూ ప్రభుత్వాలు క్రియాశీలకంగా వ్యవహరిస్తేనే తీరప్రాంతాలు తెప్పరిల్లగలుగుతాయి!
ఇదీ చూడండి: కేరళలో 11వేల కరోనా కేసులు- ఆంక్షలు పొడిగింపు