అమెరికా సేనలు మూటాముల్లే సర్దుకొని ఇంటి ముఖం పట్టడంతో ఇక అఫ్గానిస్థాన్(Afghanistan Taliban) నల్లమందు క్షేత్రంగా మారిపోనుందని మాదకద్రవ్యాలు, నేరాలపై పోరు సాగించే ఐక్యరాజ్యసమితి సంస్థ (యుఎన్‌ఓడీసీ) ఆందోళన చెందుతోంది. ప్రపంచంలో అతిపెద్ద నల్లమందు(opium afghanistan) తయారీదారు అయిన అఫ్గానిస్థాన్‌ను మాదకద్రవ్య ఉత్పత్తి, అక్రమ రవాణాకు కేంద్రం కానివ్వబోమని తాలిబన్లు ప్రకటించినా, వారి మాటలు నీటిపై రాతలేనని పలుమార్లు నిరూపితమైంది. మానవ హక్కులను, మహిళా, పత్రికా స్వేచ్ఛలను కాపాడతామని తాలిబన్లు ఇచ్చిన హామీలు నెరవేరతాయనే నమ్మకం ఎవరికీ లేదు.
ప్రపంచంలో అత్యధికంగా నల్లమందును సాగుచేసి, దాని నుంచి హెరాయిన్, మార్ఫిన్లను తయారు చేసి, ఇతర దేశాలకు అక్రమ రవాణా(Illegal drug trade) చేసే దేశంగా అఫ్గానిస్థాన్‌కు పేరు రావడానికి కారణం తాలిబన్లే. ప్రపంచ నల్లమందు, హెరాయిన్ ఉత్పత్తిలో 80 నుంచి 90శాతం అఫ్గానిస్థాన్ నుంచే వస్తోంది. గడచిన నాలుగేళ్లలో ఆ దేశంలో నల్లమందు సాగు విస్తీర్ణం 2,50,000 హెక్టార్లకు పెరిగిందని ఐరాస అధికారులు తెలిపారు. ప్రపంచమంతటా మూడు లక్షల హెక్టార్లలో అక్రమ నల్లమందు సేద్యం నడుస్తుంటే, అందులో మూడువంతులకు పైన అఫ్గాన్‌లోనే సాగవుతోంది. కొవిడ్ మహమ్మారి(coronavirus) వల్ల పెరిగిన మానసిక ఒత్తిడినుంచి ఉపశమనానికి మాదక ద్రవ్యాలు వాడేవాళ్లు ఎక్కువ కావడంతో మత్తుమందుల అక్రమ ఉత్పత్తి, రవాణా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. 2030నాటికి మాదక ద్రవ్య బానిసల సంఖ్య 11శాతం పెరుగుతుందని ఐరాస వర్గాల అంచనా.
రకరకాలుగా ఆదాయం
మెథాంఫెటమిన్ అనే రసాయన మత్తుమందు తయారీకి అవసరమైన ఒక ముడిపదార్థం, అఫ్గాన్‌లో పెరిగే ఎఫెడ్రా మొక్కల నుంచి లభిస్తోంది. ఇప్పుడు ఆ దేశం పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయినందున ఇక నల్లమందు, హెరాయిన్, మెథాంఫెటమిన్ తయారీకి(Drug Trafficking) అడ్డూఆపూ ఉండదు. ప్రభుత్వ యంత్రాంగం, బ్యాంకులు, విమానాల ద్వారా మాదక ద్రవ్య అక్రమ రవాణా, నగదు లావాదేవీలు మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళలను మతం పేరిట అణగదొక్కే తాలిబన్లు మాదక ద్రవ్య రవాణాకు మాత్రం వారిని యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. భారతదేశానికి ఈ తాకిడి ఎక్కువ. అఫ్గాన్‌లో నల్లమందు సాగు చేసే రైతులు, దాని నుంచి మార్ఫిన్, హెరాయిన్లను తయారుచేసే ప్రయోగశాలల నిర్వాహకులు, వాటిని అక్రమంగా రవాణాచేసే స్మగ్లర్లు, మాఫియా ముఠాలు తమ వ్యాపారానికి అడ్డురాకుండా తాలిబన్లకు ముడుపులు సమర్పించుకుంటాయి. నల్లమందు సాగు నుంచి ప్రయోగశాలలో శుద్ధి, అక్రమ రవాణా వరకు ప్రతి దశలో 10శాతం పన్ను చెల్లించుకుంటాయి.
తాలిబన్లు మాదక ద్రవ్యాలతోపాటు గనులు, స్థిరాస్తి వ్యాపారం, దేశ ఎగుమతులపై పన్నులు, విదేశీ విరాళాలు, అపహరణలు, వ్యాపారులకు రక్షణ కల్పించడం ద్వారానూ డబ్బు సంపాదించేవారు. అఫ్గానిస్థాన్ నుంచి పాకిస్థాన్, ఇరాన్, తజికిస్థాన్‌లకు సరకుల ఎగుమతి 10 రహదారుల ద్వారా జరుగుతుంది. ప్రధానంగా సరిహద్దు పట్టణాల ద్వారా సాగే ఈ రోడ్లు ఎప్పటి నుంచో తాలిబన్ల అధీనంలో ఉండి అనధికారికంగా పన్నులు పిండుకోవడానికి వనరులుగా నిలిచాయి. అఫ్గాన్ ప్రభుత్వానికి దక్కాల్సిన ఈ పన్నులు తాలిబన్ల చేతికి చిక్కి వారు బలపడగా, సర్కారు ఆర్థికంగా బలహీనపడింది. 2020లో అఫ్గాన్ ప్రభుత్వ బడ్జెట్ 550కోట్ల డాలర్లు; తాలిబన్ల బడ్జెట్ 160కోట్ల డాలర్లని ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి (నాటో) రహస్య నివేదిక లెక్కగట్టింది.
తాలిబన్లు(Afghanistan Taliban) 2020లో మాదక ద్రవ్య అక్రమ రవాణా ద్వారా 41.6కోట్ల డాలర్లు, గనుల ద్వారా46.4 కోట్లు, విదేశీ విరాళాల ద్వారా24 కోట్లు, ఎగుమతులపై అక్రమ పన్నుల ద్వారా 24కోట్లు, రౌడీ మామూళ్లు, అపహరణల ద్వారా16 కోట్లు, స్థిరాస్తి వ్యాపారం ద్వారా ఎనిమిది కోట్ల డాలర్లు ఆర్జించారని నాటో నివేదిక వెల్లడించింది. ఈ ధనంతోనే తాలిబన్లు ఆయుధాలు కొని, సైనికులను సమకూర్చుకొని అఫ్గాన్ ప్రభుత్వాన్ని కూలదోయగలిగారు. ఇప్పుడు వారిదే అధికారం కనుక ఆదాయం మరింత వృద్ధి కానుంది. దీన్ని నివారించడానికి అమెరికా తనవద్దనున్న అఫ్గాన్ ప్రభుత్వ నిధులను బిగపట్టింది. ఈ తరుణంలో తాలిబన్ సర్కారుకు చైనా నుంచి దండిగా ఆదాయం లభించవచ్చు.
మరోసారి ఉగ్రసంస్థల పాగా?
అఫ్గానిస్థాన్‌లో లక్ష కోట్ల డాలర్ల విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. వాటిలో ఇనుప ఖనిజం, చలువ రాయి, రాగి, బంగారం, జింకుతోపాటు లిథియం, నికెల్, కోబాల్ట్, నియోడైమియం వంటి అరుదైన లోహ నిక్షేపాలూ ఉన్నాయి. బహుశా ప్రపంచంలోకెల్లా అత్యధిక లిథియం నిక్షేపాలు అఫ్గాన్‌లోనే ఉన్నాయి. ఈ అరుదైన లోహాలు లేనిదే ఎలక్ట్రిక్ కార్లు నడవలేవు. కంప్యూటర్లు, డీవీడీ ప్లేయర్లు, గాలి మరలు, టెలివిజన్లు, సూపర్ కండక్టర్లు, లేజర్లు, ఫైబర్ ఆప్టిక్స్‌కూ ఈ లోహాలే ఊపిరి. తాలిబన్ పాలనలో అవి చైనా పరమవుతాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి. 2019లోనే అఫ్గాన్-చైనాల మధ్య గనుల రంగంలో ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా ఒక రాగి గని తవ్వకం, ప్రాసెసింగ్ ప్రారంభమయ్యాయి.
6,000కోట్ల డాలర్ల చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవా (సిపెక్) ప్రాజెక్టును అఫ్గానిస్థాన్ వరకు పొడిగించే ప్రతిపాదన ఉంది. తాలిబన్ల ఏలుబడిలో అది కార్యరూపం దాల్చవచ్చు. తొలుత మహిళల హక్కులను గౌరవిస్తామని ప్రకటించిన తాలిబన్లు వెనువెంటనే ఆడా మగా కలిసి చదువుకోకూడదని హుకుం జారీ చేశారు. చాలా ప్రాంతాల్లో మహిళలపై దాడులకు తెగబడుతున్నారు. రాబోయే రోజుల్లో వారి ఏలుబడి మరెంత దారుణంగా ఉంటుందోనన్న ఆందోళన అఫ్గాన్ ప్రజల్లో నెలకొంది. తాలిబన్ల హయాములో ఇస్లామిక్ స్టేట్, అల్‌ఖైదా గ్రూపులు అఫ్గాన్‌లో మళ్ళీ పాగా వేయవచ్చు. అఫ్గాన్‌లో(Afghanistan Taliban) మరోసారి అరాచకం ప్రబలి, అది చైనాలోని ముస్లిం జనాధిక్య రాష్ట్రమైన షింజియాంగ్‌కు, పొరుగున పాకిస్థాన్‌కు పాకవచ్చు. ఇప్పటికే పాక్‌లో చైనా కార్మికులు, నిపుణులపై దాడులు జరుగుతున్నాయి. అవి అలాగే కొనసాగితే అఫ్గాన్, పాక్‌లలో చైనా పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరవుతాయి. మొత్తం మీద తాలిబన్ల పునరాగమనం అన్ని దేశాలకూ ఏదో ఒక రూపంలో కలవరం కలిగిస్తోంది.
అమెరికా యత్నాలు విఫలం
నల్లమందు అక్రమ వ్యాపారంపై పన్నుల ద్వారా 2020లో తాలిబన్లు 41.60కోట్ల డాలర్లు రాబట్టినట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. అఫ్గాన్‌లో 400 నుంచి 500 వరకు నల్లమందు ప్రాసెసింగ్ ప్రయోగశాలలు ఉన్నాయని, వాటిలో 200 ల్యాబ్‌లపై విమానాల ద్వారా బాంబులు కురిపించి ధ్వంసం చేశామని అమెరికా 2018లో ప్రకటించింది. నల్లమందు పొలాలపై విష పదార్థాలను విరజిమ్మి నాశనం చేశామని చెప్పుకొంది. ఈ దాడుల నిర్వహణకు అమెరికా దాదాపు 900కోట్ల డాలర్లు వెచ్చించినా, అవేవీ ఫలించినట్లులేవు. 2020నాటికి నల్లమందు వ్యాపారం షరా మామూలుగానే కొనసాగుతోంది.
- కైజర్ అడపా
ఇదీ చదవండి:అఫ్గాన్‌లో స్వేచ్ఛకు సంకెళ్లు.. మహిళల మెడపై 'షరియా' కత్తి