చేతికి అందివచ్చిన పంట నోటికి దక్కకుండా పోవడంకన్నా దురవస్థ రైతాంగానికి ఇంకేముంటుంది? కొండంత ఆశతో విపణి కేంద్రానికి సరకు తరలించి సకాలంలో కొనుగోళ్లు సాధ్యపడక, వర్షాలకు తడిసిన ధాన్యరాశులు రంగుమారి మొలకలు వస్తున్న ఉదంతాలు శ్రమజీవుల్ని కలచివేస్తున్నాయి. ఊహించినదానికన్నా మిన్నగా ఈసారి పంటసిరులు పోగుపడ్డాయన్న ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించక ముందే- బస్తాలకు బస్తాలు తడిసిపోవడం, కొన్నిచోట్ల ఆరుబయట కుప్పపోసిన రాశులు వర్షానికి కొట్టుకుపోవడం అన్నదాతల్ని కుంగదీస్తున్నాయి. పంట దిగుబడుల సక్రమ సేకరణకు సరైన ఏర్పాట్లు, మౌలిక వసతులు కొరవడ్డ కారణంగా తరతమ భేదాలతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు ఏటా ఇటువంటి విషాదఘట్టాలు పునరావృతమవుతున్నాయి. శ్రమకోర్చి పండించిన పంటను కొనుగోళ్లు ముగిసేదాకా భద్రపరచే నిమిత్తం కనీస ఏర్పాట్లూ కొరవడటం ఎందరో రైతులకు గుండె కోత మిగులుస్తోంది.
ఏ కారణంగానైనా సరే- పండిన పంట నేలపాలు కాకుండా, సాగుదారులకు నష్టం దాపురించకుండా ఏం చేయగల వీలుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లోతుగా ఆలోచించాల్సి ఉంది! దేశవ్యాప్తంగా కొత్తగా వెయ్యి ఈ-మార్కెట్లు నెలకొల్పాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది. ఆ పథకం అమలులో భాగంగా పంటల్ని నిల్వ ఉంచే గోదాములనే విపణులుగా మార్చాలని తెలంగాణ మార్కెటింగ్ శాఖ కసరత్తు చేస్తోంది. దేశమంతటా ఈ చొరవ విస్తరించేలోగా, పంట నష్టపోయిన రైతులకు తగిన పరిహారం చెల్లించే అంశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉదారంగా పరిశీలించాలి!
అప్పో సప్పో చేసి పెట్టుబడులు సమకూర్చుకుని, ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకుంటూ కన్నబిడ్డలా పైరును సాకి పండించిన పంటకు తానే ధర నిర్ణయించే అవకాశం, అధికారం రైతుకు లేవు. మంచి ధర వచ్చేదాకా పంటను నిల్వచేద్దామన్నా చాలాచోట్ల ఆసరాయే కరవు. మరోవైపు, సాగుఫలం కళ్లజూడగానే అత్యవసరంగా తీర్చాల్సిన అప్పులు తరుముతుంటాయి. ఆ స్థితిలో వీలైన ప్రదేశంలో ఆరబెట్టి, వచ్చిన ధరకు పంటను ఇచ్చేయడానికి సిద్ధపడుతున్న రైతుల్లో కొందరిని వానల రూపేణా దురదృష్టం వెక్కిరిస్తోంది. తడిసిన పంటలో అధికారులు కొంత తరుగు తీసేస్తున్నారన్న ఆరోపణలు ఆనవాయితీగా వినవస్తున్నాయి. పనలు కోస్తూనే- నిర్ణీత తేమశాతం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ, యాంత్రికంగా ఆరబెట్టే సాంకేతిక మెలకువలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ఆ ధాన్యోత్పత్తుల్ని అటునుంచి అటే గోదాములకు తరలించి అక్కడే కొనుగోళ్ల ప్రక్రియను మార్కెటింగ్ శాఖ చేపడితే- చాలావరకు పంట నష్టాన్ని నివారించగలుగుతాం.
పంట నూర్పిళ్ల దశనుంచి మార్కెటింగ్ దాకా ఉపయుక్తమయ్యే సరఫరా గొలుసు సేవలు, ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాలు, గోదాములు, శీతల నిల్వ సదుపాయాలు తదితరాలు కల్పించే నిమిత్తం లక్ష కోట్ల రూపాయల మౌలిక వసతుల నిధిని కేంద్రం నిరుడు ప్రారంభించింది. ఆధునిక సదుపాయాలు కలిగిన గోదాముల్లో రైతులు తాము పండించినదాన్ని ఆరు నెలల వరకు నిల్వ ఉంచుకొని, పంట విలువలో 75 శాతం మేర గరిష్ఠంగా మూడు లక్షల రూపాయల రుణం పొందగల వెసులుబాటును తమిళనాడు ప్రభుత్వం కల్పిస్తోంది. మధ్యప్రదేశ్ వంటిచోట్లా ఈ తరహా ప్రయోగం రైతుల ఆదరణ చూరగొంది. ఊరూరా సేద్య ఉత్పత్తుల నిల్వ గోదాముల నిర్మాణం సాకారమైతే, తనకు ఆమోదయోగ్యమైన ధర లభించే వరకు రైతు ధీమాగా నిరీక్షించగల వీలుంటుంది. ఏదో ఒక రేటుకు తెగనమ్ముకునే దుర్గతి, నష్టాలతో కుమిలే దుర్దశ తొలగిపోయి అన్నదాతల బతుకులు తేటపడతాయి!
ఇదీ చదవండి:Viral Video: వరదలో కొట్టుకుపోయిన కూలీలు