ETV Bharat / opinion

గాలిలో కలుస్తున్న జీవనహక్కు - గాలి కాలుష్యం వల్ల నష్టాలు

కరోనా కంటే ముందే దేశాన్ని పీడిస్తున్న సమస్య వాయు కాలుష్యం. విషతుల్యమైన గాలితో ఏడాది వ్యవధిలోనే 17 లక్షల మంది చనిపోతున్నారు. గాలికాలుష్యం వల్ల భారత్​లో గర్భస్రావాల ముప్పు కూడా అధికంగా ఉందని ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడైంది. సిబ్బందిలో చురుకుతనం తగ్గి ఉత్పాదకత మందగించి వాణిజ్య సంస్థలు నష్టపోతున్నాయి. అయితే దీనికి దీర్ఘకాల పరిష్కార మార్గాలు చూపితే.. జనజీవనం కుదుటపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Air pollution in India
గాలి కాలుష్యం
author img

By

Published : Apr 23, 2021, 8:01 AM IST

దేశంలో కరోనా వైరస్‌ కసిగా కోరసాచకముందే, సంక్షోభ స్థాయికి చేరిన తీవ్ర సమస్య- వాయు కాలుష్యం. గాలి నాణ్యతకు తూట్లు పడుతున్న పర్యవసానంగా భారత్‌లో వ్యాపార కార్యకలాపాలకు ఏటా వాటిల్లుతున్న నష్టం, ఎకాయెకి ఏడు లక్షల కోట్ల రూపాయలన్నది తాజా అధ్యయన సారాంశం. డాల్బర్గ్‌ అడ్వైజర్స్‌, శుద్ధవాయు నిధి (సీఏఎఫ్‌), భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)ల ఉమ్మడి విశ్లేషణలో నిగ్గుతేలిన 'వ్యాపార నష్టం'- స్థూల దేశీయోత్పత్తిలో మూడు శాతానికి, మొత్తం వార్షిక పన్ను వసూళ్లలో 50 శాతానికి, దేశ స్వస్థ సంరక్షణ బడ్జెట్‌లో 150 శాతానికి సమానమనడం దిగ్భ్రాంతపరుస్తోంది. వాయుకాలుష్యం వల్ల ఆరోగ్యం గుల్లబారి దేశ కార్మిక శ్రేణి ఏటా 130 కోట్ల పనిదినాలకు దూరమై కోల్పోతున్న రాబడే సుమారు రూ.44 వేల కోట్లుగా అధ్యయన నివేదిక లెక్కకట్టింది.

గాలికాలుష్యానికి 30శాతం మంది బలి

సిబ్బందిలో చురుకుతనం తగ్గి ఉత్పాదకత మందగించి వాణిజ్య సంస్థలు నష్టపోతున్నది అంతకు నాలుగింతలు! ఐటీ రంగం వంటివీ వాయు కాలుష్య దుష్ప్రభావాల బారినుంచి తప్పించుకోలేకపోతున్నాయి! విషకలుషితమైన గాలి సంవత్సరం వ్యవధిలోనే 17 లక్షల నిండుప్రాణాల్ని తోడేస్తున్న దేశం మనది. విపరీత ప్రాణనష్టాన్ని నివారించేందుకంటూ వారంక్రితమే జాతీయ కార్యాచరణ దళాన్ని హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) కొలువు తీర్చింది. వాయుకాలుష్యం ముమ్మరించిన ఇండియాలో గర్భస్రావాల ముప్పు అధికమని లాన్సెట్‌ అధ్యయనం ఇటీవలే ధ్రువీకరించింది. దేశంలో అర్ధాంతర మరణాల్లో 30శాతం దాకా వాయుకాలుష్యం మూలాన దాపురిస్తున్నవేనని లోగడే వెల్లడైంది. ఇంతలా ఆర్థికంగా పెనుభారం మోపుతూ, ప్రజారోగ్యాన్నీ ఖర్చు రాసేస్తున్న వాయుకశ్మలాన్ని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం- ఇటీవలి కేంద్ర బడ్జెట్లో గాలి నాణ్యత మెరుగుదల కోసం నిధుల కేటాయింపుల్ని తగ్గించింది. బతుకుల్ని, వ్యాపారాల్ని, ఉత్పాదకతను, దేశార్థికాన్ని కుంగదీస్తున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి దిద్దుబాటు చర్యలు ఇకనైనా సత్వరం పట్టాలకు ఎక్కాలి!

మరోవైపు కరోనా

అగ్నికి వాయువు తోడైనట్లు సుమారు ఏడాదిగా అటు కరోనా విజృంభణ, ఇటు వాయు కాలుష్య ఉద్ధృతి- దేశాన్ని ఎడాపెడా చెండుకు తింటున్నాయి. కొవిడ్‌ కేసుల ఉరవడిని విశ్లేషించి వైద్యులు, శాస్త్రవేత్తలు హెచ్చరించిన ప్రకారం- వేసవి ఉష్ణోగ్రతల్ని తట్టుకుని చలి వాతావరణంలో వైరస్‌ భీకర దాడికి తెగబడింది; వాయు కాలుష్యం అధికంగా ఉన్నచోట్ల మృత్యుకోరలు చాస్తోంది. గాలిలోని సూక్ష్మ రేణువుల స్థాయి ఒక్క మైక్రోగ్రామ్‌ పెరిగినా కొవిడ్‌ మరణాలు ఎనిమిది శాతం మేర వృద్ధి చెందే ప్రమాదం ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గాలి ద్వారా కరోనా వ్యాపిస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్‌ శాస్త్రవేత్తల పరిశోధన చాటుతోంది.

ధూళిలో కరోనా వైరస్‌ నెల్లాళ్లదాకా మనుగడ సాగించగలదన్న మరో అధ్యయన ఫలితం, వాయు కాలుష్య నియంత్రణలో నిర్లక్ష్యమెంత ఆత్మహత్యాసదృశమో స్పష్టీకరిస్తోంది. ప్రతి ఘనపు మీటరు వాయువులో అతి సూక్ష్మ ధూళికణాలు పది మైక్రోగ్రాములకు మించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణిక సూత్రావళి నిర్దేశిస్తోంది. దేశంలోని మూడొంతులకు పైగా నగరాలూ పట్టణాలు 'గ్యాస్‌ ఛాంబర్లు'గా భ్రష్టుపడుతున్నా- ఎంపిక చేసిన 122 నగరాల్లోనైనా జాతీయ వాయుశుద్ధి కార్యక్రమం (ఎన్‌క్యాప్‌) చురుకందుకోనేలేదు. వాటన్నింటా, పీఎం 2.5గా వ్యవహరించే సూక్ష్మధూళి కణరాశి కంటికి కనిపించని మృత్యువై విహరిస్తోంది. అటవీ ప్రాంతాల సంరక్షణకు, కాలుష్యకారక పరిశ్రమల కట్టడికి, బొగ్గు స్థానే ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగానికి పకడ్బందీ ప్రణాళిక అమలుకు నోచుకున్నప్పుడే- వాయు నాణ్యత మెరుగుపడుతుంది. జనజీవనం కుదుటపడి, దేశార్థికమూ తెప్పరిల్లుతుంది!

ఇదీ చూడండి: 'లంగ్స్​పై భారీ స్థాయిలో కరోనా 2.0 దెబ్బ!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.