'పిల్లల్లో పోషకాహార లోపం దేశ ప్రగతికే ప్రతిబంధకం' (malnutrition in children)అని పదిహేనో ఆర్థిక సంఘం నివేదిక హెచ్చరించింది. ఆ లోపాన్ని రూపుమాపడానికి ఉద్దేశించిన కార్యక్రమాలకు 2020-21లో రూ.7,735 కోట్ల అదనపు నిధులను కేటాయించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. బలవర్ధకమైన తిండికి నోచుకోని సర్కారీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారాన్నీ అందించాలని కేంద్ర విద్యాశాఖ ఇటీవల తలపోసింది. నాలుగు వేల కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిపాదనలూ సిద్ధంచేసింది. దీంతో పాటు ఆర్థిక సంఘం మేలిమి సూచనకూ మన్నన దక్కని దుస్థితిలో- దేశీయంగా ఎందరో బాలల బంగరు భవిష్యత్తు గిడసబారిపోతోంది!
ఆహార ధాన్యాలు సద్వినియోగం కావాలి..
దేశవ్యాప్తంగా 33 లక్షల చిన్నారులు పోషకాహార లోపంతో(malnutrition in children) బాధపడుతున్నారంటూ కేంద్ర మహిళా సంక్షేమ శాఖాధికారులు తాజాగా వివరాలు వెల్లడించారు. సమాచార హక్కు చట్టం కింద దాఖలైన ఒక దరఖాస్తుకు స్పందనగా- 'పోషణ్' యాప్‌లోని వివరాలను ఉటంకిస్తూ ఆ మేరకు వారు గణాంకాలు(malnutrition in india) గుదిగుచ్చారు. ఆసేతుహిమాచలం అయిదేళ్ల లోపు బాలల్లో 4.6 కోట్ల మంది వయసుకు తగిన ఎత్తు లేరన్న విషాద వాస్తవాన్ని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) గతంలోనే వెలుగులోకి తెచ్చింది. 2015-16 నాటితో పోలిస్తే- మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ్ బెంగాల్, త్రిపుర వంటి 13 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో బరువు తక్కువ పిల్లల సంఖ్య అధికమైనట్లు 2019-20 సర్వే స్పష్టీకరించింది. అసోం, బిహార్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, తెలంగాణ తదితర తొమ్మిది రాష్ట్రాల్లో ఎత్తుకు తగిన బరువు లేని చిన్నారుల సంఖ్యా పెరిగింది. పసివారి మానసిక, శారీరక ఎదుగుదలను దెబ్బతీస్తూ; వారి ప్రాణాలను అర్ధాంతరంగా పొట్టన పెట్టుకుంటున్న పోషకాహార లోపం సమసిపోవాలంటే- సమీకృత శిశు అభివృద్ధి పథకం అమలులోని లోపాలను పరిహరించాలి. బాలల్లో ఎదుగుదల లోపాలు, కౌమార బాలికలు, గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత నివారణకు ఉద్దేశించిన పోషణ్ అభియాన్‌ను ఉరకలెత్తించాలి. ప్రపంచ క్షుద్బాధా సూచీలో దిగువన నిలిచిన దుష్కీర్తి దేశానికి తప్పిపోవాలంటే- ఏటా విరగపండుతున్న ఆహార ధాన్యాలు సద్వినియోగం కావాలి!
బహుముఖ కృషే కీలకం..
దేశం స్వాతంత్య్రం పొందినప్పటితో పోలిస్తే- జనసంఖ్య ఇప్పుడు నాలుగు రెట్లు ఎగబాకింది. అదే సమయంలో దేశీయంగా వరి, గోధుమ దిగుబడులు 5.9, 15.5 రెట్ల చొప్పున ఇతోధికమయ్యాయి. 6.49 కోట్ల మెట్రిక్ టన్నుల తిండిగింజలతో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) గోదాములు తులతూగుతున్నాయి. అయినా ఆకలి చావులు ఆగడం లేదంటే- సమస్య ఎక్కడ ఉంది? భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఆహారంలో 40శాతం వృథాగా మట్టిపాలవుతోందని, దాని విలువ ఏడాదికి దాదాపు లక్ష కోట్ల రూపాయలని ఐరాస ఆహార వ్యవసాయ సంస్థ లోగడే లెక్కగట్టింది! చెమట చిందించి ధాన్యపు సిరులను పండిస్తున్న రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఆహార భద్రతా చట్టం అమలులో ఉన్నా, అభాగ్యుల ఆకలి వెతలు తీరడం లేదు. అన్నదాతల శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతున్న వాతావరణంలో- ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తాజాగా పిలుపిచ్చినట్లు వ్యవసాయాధారిత పరిశ్రమలు విరివిగా ఏర్పాటు కావాలి. రైతులకు అధికాదాయం సమకూర్చడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికల్పనను జోరెత్తించే విధానాలకు ప్రభుత్వాలు పెద్దపీట వేయాలి. ధాన్యం సేకరణ దశ నుంచి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సమాజంలోని అట్టడుగు వర్గాలకు తిండిగింజలు అందించడం వరకు మేటవేసిన సమస్యలకు సత్వరం పరిష్కార మార్గాలు అన్వేషించాలి. డొక్కలెండిపోయిన దీనులతో ఈసురోమంటున్న దేశం శ్రేష్ఠభారతంగా అవతరించడానికి- పాలకుల బహుముఖ కృషే కీలకం!
ఇదీ చూడండి: '33 లక్షల మంది చిన్నారుల్లో తీవ్ర పౌష్టికాహార లోపం'