పొట్ట నింపుకోవడానికి రెక్కలు ముక్కలు చేసుకునే శ్రమజీవులకు ఉన్న ఊళ్లోనే ఏడాదికి వందరోజులపాటు పని కల్పించే లక్ష్యంతో పద్నాలుగేళ్లక్రితం దేశంలో ఆరంభమైందే- జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. కరోనా వైరస్ విజృంభించాక లాక్‌డౌన్లు, కర్ఫ్యూలతో పనులు దొరక్క పస్తులకు తాళలేక సొంత ఊరిబాట పట్టిన వలసకూలీలెందరికో అదిప్పుడు... ఏకైక ఆశాదీపం! చేతిలో వంద రూపాయలైనా లేని అభాగ్యుల సంఖ్య మొత్తం వలస కార్మికుల్లో ఎకాయెకి 64శాతం. జనజీవనం స్తంభించిపోవడానికి మునుపు చేసిన పనికీ జీతాలు, కూలిడబ్బులు దక్కనివారు వలసకూలీల్లో 90శాతానికిపైగానే ఉన్నారు. అందుకే స్వస్థలాలకు చేరి ఉపాధి హామీ దన్నుతో తిరిగి బతుకుదీపాలు వెలిగించుకోవాలని ఆరాటపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది! ఈ పథకం ద్వారా తొమ్మిది కోట్లమంది పని కోరుతున్నా, రమారమి ఏడున్నర కోట్లమందికే- అదీ సగటున ఏడాదికి 46 రోజులే ఉపాధి కల్పించగలిగినట్లు ఆమధ్య కేంద్రమే వెల్లడించింది. ఈ నెలలో పని కోరిన 4.33కోట్ల మందిలో సగానికే ఉపాధి లభించిందని తాజా గణాంకాలు స్పష్టీకరిస్తున్నాయి.
బతుకులను నిలబెట్టేలా విస్తరణ
ఇంకొన్నాళ్లపాటు ఉపాధి హామీకింద పని అడిగేవారి సంఖ్య పెరిగేదే తప్ప తరగదు. 2019-20 సవరించిన అంచనాల ప్రకారం ఉపాధి హామీ వ్యయం సుమారు రూ.71వేలకోట్లు. ఇటీవలి బడ్జెట్లో ఆ పద్దును రూ.10వేలకోట్లదాకా తెగ్గోసిన కేంద్రం ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ కింద రూ.40వేలకోట్లు అదనంగా ప్రకటించింది. అలా లక్షకోట్ల రూపాయలకు పైబడిన ఉపాధిహామీ ఖాతాలో 300కోట్ల పనిదినాలు సృష్టించగల వీలుందని కేంద్రమే లెక్కకట్టింది. కరోనా కారణంగా స్వస్థలాలకు పయనమైన, కొన్నేళ్లుగా లబ్ధి పొందుతున్న కోట్ల మందికి కొండంత ఆసరాగా నిలిచేలా- పెరుగుతున్న గిరాకీ మేరకు ఉపాధి హామీ పథకాన్ని విస్తరించాలి. ఈ అసాధారణ పరిస్థితుల్లో బడ్జెట్ పరిమితుల్ని పక్కకు నెట్టి, కూలిన బతుకుల్ని ప్రభుత్వమే నిలబెట్టాలి!
నగదు చెల్లింపులతో మేలు..
విశ్వంలోనే అతిపెద్ద ప్రజాపనుల కార్యక్రమంగా ప్రపంచ బ్యాంకు లోగడ ప్రశంసించిన ఉపాధి హామీ- అమలుపరంగానూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అడ్డగోలు లెక్కలు, నకిలీ బిల్లులు, దొంగఖాతాల బాగోతాలను తూర్పారపట్టిన పార్లమెంటరీ స్థాయీసంఘమే- దోచుకున్నవాళ్లకు దోచుకున్నంతగా ఉపాధి హామీ భ్రష్టుపట్టిందని ఛీత్కరించింది. వేతనాల చెల్లింపుల్లో నెలల తరబడి జాప్యాన్ని నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నా, ఇప్పటికీ ఎనిమిదిన్నర వేలకోట్ల రూపాయలదాకా బకాయిలు పోగుపడి ఉన్నాయి. వలస కూలీలకు ఉపాధి హామీ ఉపశమనకారకం కావాలంటే, ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ లెక్కలు తేల్చి తక్షణ నగదు చెల్లింపులకు ప్రాధాన్యమివ్వాలి. ఇప్పటివరకు ఇ-మస్తర్ పట్టీల్లో ముందస్తుగా పేర్లు నమోదు చేయించుకున్నవారికి నిర్ధారిత గడువులో పని కల్పించే పద్ధతి పాటిస్తున్నా- జీవన్మరణ పోరాటం చేస్తూ వందలూ వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి స్వస్థలాలకు చేరిన శ్రామికులకు కోరిన వెంటనే పని కల్పించాలి. సాయంత్రానికి నగదు చెల్లింపు జరిగిపోయేలా విధివిధానాల్ని ప్రక్షాళించాలి. ఉపాధి హామీ కింద వర్షాకాలంలో మొక్కలు, ఉద్యానవనాల పెంపకం వంటి పనులు చేపట్టదలచినట్లు కేంద్ర ఆర్థికమంత్రి వెల్లడించారు. అటవీ పనులకు ఉపాధి హామీని అనుసంధానిస్తామని తెలంగాణ వంటి రాష్ట్రాలు చెబుతున్నాయి.
వేతన సవరణ చేపట్టాలి..
రాష్ట్రాలవారీగా వేతనాల్లోనూ వ్యత్యాసాలున్నాయి. బిహార్, ఝార్ఖండ్ వంటివి రూ.171 ఇస్తుండగా- పంజాబ్, కర్ణాటక వంటివి రూ.240పైన చెల్లిస్తున్నాయి. వేతనాల్ని సహేతుకంగా సవరించి, వందరోజుల వ్యవధినీ సడలించి- పరిస్థితులు కుదుటపడేదాకా పథకాన్ని అవినీతి రహితంగా ప్రభుత్వాలు అమలుపరచాలి. జాతి నిర్మాణ మహాక్రతువులో బడుగుజీవుల భాగస్వామ్యం సార్థకమయ్యేలా నిబంధనావళిని పరిపుష్టీకరించాలి!
ఇదీ చూడండి: ఢీ అంటే ఢీ: సరిహద్దులో భారత్- చైనా బలగాల మోహరింపు