అడవుల సమీప గ్రామాలు, పట్టణాల్లోకి వన్యప్రాణులు ప్రవేశించి అలజడి సృష్టిస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. అడవి చుట్టుపక్కల నివసించే రైతులు, గ్రామీణ ప్రజలకు ఇది కొత్త సమస్య కాదు. తెలుగురాష్ట్రాల్లో పెద్దపులి, ఎలుగుబంటి, అడవి పంది, కోతి, చిరుత వంటి వన్య ప్రాణులవల్ల మనుషులకు, పశువులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. గత 20 ఏళ్లలో దేశవ్యాప్తంగా పాము కాటు వల్ల 12 లక్షలమంది బలయినట్లు కెనడాకు చెందిన సెంటర్ ఫర్ గ్లోబల్ హెల్త్ రిసెర్చ్ ఆరునెలల క్రితం వెల్లడించిన అధ్యయన నివేదికలో పేర్కొంది. ఇందులో సగానికి పైగా మరణాలు కేవలం ఎనిమిది రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో జరిగాయి. అందులో తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి.
అడవుల సమీపంలో ఉన్న గ్రామాల్లో పాముకాటుకు గురయ్యేవారు ఎక్కువగా ఉంటారు. కొంతకాలం క్రితం కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ జనావాసాల్లోకి ప్రవేశిస్తున్న వన్యప్రాణుల జాబితాలో పామునూ చేర్చింది. ఇటీవలి కాలంలో సమాచార వ్యవస్థ అందుబాటులోకి రావడంవల్ల వన్యప్రాణుల ఉనికి, సంచారంపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని పొందగలుగుతున్నాం. అడవుల్లో నీరు, ఆహారం లేకపోవడం, అడవుల నరకివేతవల్ల ఆవాసాలు కోల్పోవడం, అటవీ ప్రాంతాలను అనుకొని కొత్తగా జనావాసాలు ఏర్పడుతూ ఉండటంతో ఈ సమస్య నానాటికీ పెరుగుతోంది. ఇందుకు కారణాలను లోతుగా అధ్యయనం చేయాలి.
పెరుగుతున్న దాడులు
ఇటీవల ఎక్కువగా పులులు జనావాసాల్లోకి చొరబడుతూ ఉండటం కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి దాడి వల్ల ఇద్దరు వ్యక్తులు మరణించారు. తెలంగాణలో మొదటిసారిగా పెద్దపులి మనుషులపై దాడి చేయడం స్థానిక ప్రజల్లో భయాందోళనలకు కారణమయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో మూడు నెలల బాలుడిని నక్క నోట కరచుకొని వెళ్లి తీవ్రంగా గాయపరిచింది. ఆదిలాబాద్‌లోని ఇంద్రవెల్లి మండలంలో వ్యవసాయం చేస్తున్న వ్యక్తిపై చిరుతపులి దాడి చేసింది. ఒక రైతు పొలంలో పనిచేస్తున్నప్పుడు ఎలుగుబంటి దాడి చేసింది. అతడు తీవ్రంగా గాయపడ్డాడు. కరీంనగర్, కామారెడ్డి తదితర ప్రాంతాల్లోనూ వన్యప్రాణుల దాడులు పెచ్చుమీరుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ అటవీ ప్రాంతాల్లో తరచూ అడవి జంతువులు గ్రామాల్లోకి ప్రవేశిస్తున్న ఘటనలు జరుగుతున్నాయి.
అపోహలు ఎక్కువే
వన్యప్రాణులు ఎలాంటి సందర్భాల్లో మనుషులు లేదా పశువులపై దాడి చేస్తున్నాయో, శాస్త్రీయ పద్ధతుల్లో పరిశోధిస్తే- ఈ సమస్య మూలలను తెలుసుకోవచ్చు. వన్యప్రాణుల పట్ల అవగాహన లోపం వల్ల చాలాసార్లు ప్రజలు అనవసర భయానికి లోనవుతున్నారని అర్థం అవుతుంది. ఉదాహరణకు ఇటీవల కరీంనగర్‌జిల్లాలోని రామడుగు మండల గ్రామాల్లోని పొలంలో కనిపించిన జంతువు ఆఫ్రికా ఖండానికి చెందిన చిరుతపులిగా ప్రచారం జరిగింది. కానీ దాన్ని చివరికి హైనాగా గుర్తించారు. ప్రజలు వ్యవసాయ భూమిలో అడవి పిల్లిని చూసి, పెద్ద పులిగా అపోహ పడిన సందర్భాలూ అనేకం.
అవగాహన అవసరం
వన్యప్రాణులు గాయపరిస్తే వెంటనే చికిత్స తీసుకునే విధానాలను ప్రజలకు అటవీ శాఖ తెలియజేయాలి. ఈ సమాచారాన్ని గ్రామ పంచాయతీల స్థాయిలో చలనచిత్రాల రూపంలో ప్రదర్శించాలి. ఎక్కువగా ఏయే జాతుల వన్యప్రాణులు నివాసప్రాంతాల్లోకి చొరబడే అవకాశం ఉందో, ఆ సమస్యను ఎలా అధిగమించాలో అధ్యయనం చేయడానికి అటవీ శాఖ ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలి. అడవుల నరికివేతను అరికట్టడంలో అటవీ శాఖ భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్)ను ఉపయోగిస్తే ప్రయోజనం ఉంటుంది. అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, జంతువులను వేటాడి వాటి చర్మాలు, గోళ్లను అమ్ముకునే ముఠాల ఆటలు కట్టించాలి. దీనివల్ల వన్యప్రాణులు ఆవాసాలను కోల్పోకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నట్లవుతుంది.
మహారాష్ట్ర తరహాలో..
అడవి మృగాల సంచారంపై నిఘా అవసరం. ఆ వివరాలు ప్రతి జిల్లాలో నమోదు కావాలి. ఈ సమస్యవల్ల మనుషులు, పశువులు గాయపడితే పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం అటవీ శాఖకు ప్రత్యేక నిధి కేటాయించాలి. వన్యప్రాణుల దాడిలో మృతి చెందినవారి కుటుంబానికి రూ.15 లక్షలు పరిహారంగా చెల్లించనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ప్రకటించింది. ఇందులో భాగంగా బాధిత కుటుంబానికి తక్షణమే అయిదు లక్షల రూపాయలు చెల్లిస్తుంది. మిగతా సొమ్ము ఆ కుటుంబ సభ్యుల పేరిట బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్‌గా జమ చేస్తుంది. మెచ్యూరిటీకి ముందే సొమ్మును తీసుకోవాలనుకుంటే అందుకు అటవీశాఖ అనుమతి అవసరం అవుతుంది. అటవీ సమీప ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు భరోసానిచ్చేందుకు మిగతా రాష్ట్రాలూ ఈ తరహా విధానాలను అనుసరించాల్సి ఉంది. వన్యప్రాణుల పట్ల ప్రేమగా ఉండటం అవసరం. అవి మన సంపద, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. అటు ప్రజలకు, ఇటు వన్య ప్రాణులకు ఇబ్బంది లేకుండా ఈ సమస్యను పరిహరించడంలో ప్రభుత్వాలు చొరవ ప్రదర్శించాల్సిన అవసరం ఉంది.
- సిరిపురం శ్రీనివాస్
ఇదీ చూడండి : పులి మనిషిని చంపితే రూ.15 లక్షలివ్వాలి: అటవీ శాఖ