కరోనా ఉత్పాతంతో అల్లాడిపోతున్న రైతులకు ఇప్పుడు మిడతల రూపంలో కొత్త సమస్య వచ్చి పడుతోంది. దేశంలో గతంలో థార్ ఎడారి ప్రాంతానికే పరిమితమై పెద్దగా ప్రభావం చూపని ఈ మిడతల దండు..గతేడాది డిసెంబరులో రాజస్థాన్, పంజాబ్ ప్రాంతాల్లో పంటలను నష్టపరిచింది. తాజాగా దేశంలోని సుమారు ఆరు రాష్ట్రాలకు వ్యాపించిన మిడతలు తక్కువ విస్తీర్ణంలోని వేసవి పంటలను దెబ్బతీస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఈ దండు మరింత విజృంభించి వానాకాలం పంటలను దెబ్బతీస్తే దేశంలో ఆహార లక్ష్యాలు గాడి తప్పే ప్రమాదముంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న కేంద్రం మిడతలపై ముప్పేటదాడికి సిద్ధమవుతోంది.
అందుబాటులో రసాయనాలు
మిడతలు ఉత్తర భారతంలోని ఆరు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. గతేడాది చివర్లో సూడాన్, పశ్చిమాఫ్రికా, పాకిస్థాన్ సరిహద్దుల ద్వారా రాజస్థాన్, పంజాబ్‌లోకి ప్రవేశించిన మిడతల దండువల్ల భారత్‌లో దాదాపు 4.03 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలకు నష్టం వాటిల్లింది. ప్రస్తుతం పాకిస్థాన్ వైపు నుంచి రాజస్థాన్ ఎడారి ద్వారా వచ్చిన మిడతల బెడదను గతేడాది చివర్లో పాక్‌లో పూర్తిగా నివారించకపోవడంతో అవి సంతానోత్పత్తి చేసుకుని భారత్‌కు చేరాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరాదిలోని రాజస్థాన్, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు విస్తరించి గంటకు 12-15 కిలోమీటర్ల వేగంతో సంచరిస్తున్నాయి. ప్రస్తుతం మిడతల దండు మహారాష్ట్రలోని రామ్‌మెక్ ప్రాంతాన్ని దాటాయి. మరో దండు ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ వైపు కదులుతోంది. మిడతలు దాడి చేస్తున్న రాష్ట్రాలన్నింటినీ అప్రమత్తం చేస్తున్న కేంద్రం అందుకు తగిన నియంత్రణ వాహనాలు, సిబ్బంది, యంత్రాలతో సహా పిచికారీ రసాయనాన్ని సైతం ఎక్కడికక్కడ అందుబాటులో ఉంచింది. ఇప్పటికే ఈ రాష్ట్రాల్లోని కొన్ని గ్రామాల ప్రజలు ఇవి పంటపై విశ్రమించకుండా డప్పులు, డబ్బాలను మోగించడంద్వారా పెద్ద శబ్దాలు చేస్తూ మిడతలను తరిమివేసేందుకు తంటాలు పడుతున్నారు. ఈ చర్యలవల్ల మిడతలు మరో ప్రాంతంలోని పంటలను ఆశ్రయించే అవకాశం ఉంది.
పొంచిఉన్న పెనుముప్పు
తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్ర జిల్లాలకు మిడతలు వ్యాపిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పరిస్థితిని సమీక్షించింది. రాష్ట్రంలో ప్రస్తుతం పంట లేనందున ఇప్పటికిప్పుడు వచ్చే ఇబ్బంది లేకపోయినా మరో పక్షం రోజుల్లో వానాకాలం పంటల సాగు ఆరంభమయ్యే అవకాశం ఉంది. దీంతో ముందస్తు నివారణకు సంసిద్ధం కావడం అత్యవసరం. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సహా వ్యవసాయ, ఇతర శాఖలను సమన్వయం చేసుకుని సన్నద్ధంగా ఉన్నామని ప్రకటించాయి. ఖరీఫ్ (జూన్-అక్టోబర్) కాలంలో వీటిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) పలు వ్యవసాయ విశ్వవిద్యాలయాలను అప్రమత్తం చేసింది. కర్ణాటక, తెలుగు రాష్ట్రాలకూ విస్తరిస్తే జులైలో పెనునష్టం వాటిల్లవచ్ఛు దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉత్తరభారతం సహా ఆయా రాష్ట్రాల వ్యవసాయశాఖలను కేంద్ర వ్యవసాయ పర్యావరణ మంత్రిత్వశాఖ ఆప్రమత్తం చేసింది. ఐకార్ కూడా మే 30న సమావేశాలు నిర్వహించింది. కోట్లాది మిడతలు పొలంపై వాలితే నిమిషాల వ్యవధిలో పంటను నాశనం చేస్తాయి. మందు పిచికారీ చేసే సమయం కూడా రైతుకు ఉండదు. దీన్ని సమూలంగా నివారించడమే పరిష్కారం. మిడతలను నాశనం చేసేందుకు వాడే మలాథియన్ వంటి మందులు అత్యంత హానికరం కానప్పటికీ వేపకషాయం వంటి సహజ ద్రావకాలతో వీటిని నిరోధించవచ్చని ప్రకృతి సేద్య నిపుణులు చెబుతున్నారు. జీవామృతంలో వేప పిండిని నానబెట్టి ఆ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. సీవీఆర్ (చింతల వెంకరెడ్డి) పద్ధతి సత్ఫలితాలను ఇస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మిడతలు సమీప ప్రాంతంలో ఉన్నప్పుడు చేలపై రాకుండా సీవీఆర్ విధానంలో నేల లోపలి మట్టి (బంకమన్ను మంచి ఫలితాలను ఇస్తుంది)ని తీసి నీటితో కలిపి పంటపై పిచికారీ చేస్తే బంకమన్ను పడిన ఆకుల్ని మిడతలు తినలేవు. మిడతలకు కాలేయం ఉండదు కాబట్టి, మట్టిని తిని ఆరగించుకోలేక అవి చనిపోతాయి.
సన్నద్ధతే కీలకం
మిడతల దండును నివారించడం రైతుల వల్ల మాత్రమే అయ్యే పని కాదు. ప్రభుత్వాలు పూనుకోవాలి. ఒక ప్రాంతంలో మిడతల దండు సంచరిస్తున్నప్పుడే వాటికి సమీప ప్రాంతాలను అప్రమత్తం చేయడం ఎంతో ముఖ్యం. మిడతలున్న ప్రాంతాల్లో నేలను దున్నడం, రాత్రివేళల్లో తగులబెట్టడం ద్వారా వాటి గుడ్లను నాశనం చేయవచ్ఛు డైక్లోరోవాస్, ఇసుక, గోధుమపొట్టు, బెల్లం, క్లోరోపైరిఫాస్ నీటితో కలిపి సాయంత్రం వేళల్లో చల్లడం, మలాథియాన్ పిచికారీ ద్వారా మిడతలను అరికట్టవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తాజాగా కేంద్రం మిడతల దండుపై పిచికారీ చేసేందుకు అవసరమైన 60 డ్రోన్లను బ్రిటన్ కంపెనీ నుంచి తెప్పిస్తోంది. అజ్మీర్, చిత్తోర్‌గఢ్, దౌసా, మాందసార్, ఉజ్జయిని, శివపురి, ఝాన్సీలలో తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తోంది. ఈ కేంద్రాల నుంచి ఎప్పటికప్పుడు దండు కదలికల సమాచారాన్ని సంబంధిత శాఖలకు క్షేత్ర స్థాయి సిబ్బందికి చేరవేస్తూ అప్రమత్తం చేస్తోంది. ఖరీఫ్‌లో మిడతలు మరింత విజృంభించిన పక్షంలో వాటి నియంత్రణకు పూర్తి స్థాయి కార్యాచరణను పటిష్ఠంగా అమలు చేయాల్సిన అవసరముంది. మిడతల సంతానోత్పత్తిని అరికట్టడం, వాటి వ్యాప్తిని అడ్డుకోవడం, పూర్తిగా నాశనం చేయడం- ద్వారా ముప్పేట దాడితోనే ఈ సంక్షోభం నుంచి బయటపడగలం. పంటలను కాపాడుకోగలం. అందుకు ప్రభుత్వాల సన్నద్ధతే కీలకం.
ఆహారోత్పత్తిపై ప్రభావం
ఆఫ్రికా ఖండంలోని ఎడారి ప్రాంతాల నుంచి వ్యాపించిన మిడతల దండు సృష్టిస్తున్న విలయం అంతాఇంతా కాదు. రెండు గ్రాముల బరువుండే ఒక మిడత అంతే పరిమాణం ఉన్న ఆహారాన్ని తింటూ ప్రపంచ ఆహారోత్పత్తి లక్ష్యాలనే ప్రశ్నార్థకం చేయనుంది. ఒక కిలోమీటరు పరిధిలో విస్తరించిన మిడతలు ఒక్క రోజులో 35 వేల మందికి సరిపడా ఆహారాన్ని తినేస్తాయని అంచనా. 2003-05 కాలంలో పశ్చిమాఫ్రికాలో వృద్ధిచెందిన ఈ మిడతల దండు ఆఫ్రికాలోని సుమారు 26 దేశాలకు వ్యాపించి దాదాపు 1.30 కోట్ల హెక్టార్లలో పంటలను నష్టపరిచింది. తూర్పు, పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి ఆసియాకు వ్యాప్తి చెందకుండా వీటి కదలికలపై ప్రపంచ ఆహార సంస్థ (ఎఫ్‌ఏఓ) ప్రభావిత దేశాలను అప్రమత్తం చేస్తోంది. మిడతల దండును నియంత్రించని పక్షంలో ప్రపంచ ఆహార భద్రత ప్రమాదంలో పడి- కోట్లాది ప్రజలు ఆహార కొరతతో అల్లాడే ముప్పు పొంచి ఉంది. ఎస్‌ఏఓ ఇప్పటికే మిడతలను నిర్మూలించేందుకు అత్యవసర కేంద్రాన్ని (ఈసీఏఓ) ఏర్పాటు చేసింది. ఇటీవల ఐక్యరాజ్యసమితి కూడా భారత్‌ను అప్రమత్తం చేయడంతో కేంద్రం నియంత్రణ చర్యలను వేగిరం చేసింది.
- అమిర్నేని హరికృష్ణ