ETV Bharat / opinion

చిన్న నగరాలు... సృజన కేంద్రాలు - చిన్న నగరాల్లో అంకురాలు

కరోనా ఆంక్షల కారణంగా ఐటీ తదితర కంపెనీలు ఉద్యోగులకు 'ఎక్కడి నుంచైనా పని' విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఫలితంగా దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాలు ప్రతిభా కేంద్రాలుగా, ఉపాధి ప్రాంతాలుగా అవతరిస్తున్నాయి. సాధారణంగా, జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండే నగరాలనే ఆయా కంపెనీలు తమ కార్యాలయాల స్థాపనకు ఎంచుకుంటాయి. అందుకని, ద్వితీయ శ్రేణి నగరాల్లో మౌలిక వసతులను ప్రభుత్వాలు భారీయెత్తున విస్తరించాలి. జీవన నాణ్యతల్ని మెరుగు పరచాలి. పెట్టుబడులను ఆకర్షించడానికి మన నగరాలు సకల సౌకర్యాలతో సంసిద్ధం కావాలి.

tier two cities, second tier cities
ద్వితీయ శ్రేణి నగరాలు, చిన్న నగరాలు
author img

By

Published : Aug 21, 2021, 9:51 AM IST

మన దేశంలో కొవిడ్‌ మహమ్మారి విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్ని దెబ్బతీసినా- కొన్ని రంగాల్లో కొత్త బాటలు పడ్డాయి. లాక్‌డౌన్లు, ఆంక్షల కారణంగా ఐటీ తదితర కంపెనీలు ఉద్యోగులకు 'ఎక్కడి నుంచైనా పని' విధానాన్ని అమలు చేస్తున్నాయి. దాంతో- కొచ్చి, చండీగఢ్‌, గువాహటీ, జైపూర్‌, వడొదరా, త్రివేండ్రం, ఇండోర్‌, మైసూర్‌, పుణె, లఖ్‌నవూ, కోయంబత్తూర్‌ వంటి ద్వితీయ శ్రేణి నగరాలు ప్రతిభా కేంద్రాలుగా, ఉపాధి ప్రాంతాలుగా అవతరిస్తున్నాయి. భిన్న పారిశ్రామిక సమూహాలకు, ఐటీ ఉత్పత్తి, ఎగుమతుల రంగాలకు, అంకుర పరిశ్రమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. కరోనా కారణంగా చాలామంది సాంకేతిక రంగ ఉద్యోగులు మహానగరాల్ని వీడి తమ స్వస్థలాలకు వెళ్ళిపోయారు. వారిలో ఎక్కువగా ద్వితీయ శ్రేణి నగరాలు, వాటిని ఆనుకొని ఉన్న ప్రాంతాలకు చెందినవారే. మహానగరాలతో పోలిస్తే జీవన వ్యయం తక్కువగా ఉండటం, కుటుంబాలతో కలిసి ఉండే అవకాశం లభించడంతో వారు ద్వితీయ శ్రేణి నగరాల్లోనే ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. కంపెనీలు చేపట్టిన ఉద్యోగ నియమకాల్లో 40శాతం ద్వితీయ శ్రేణి నగరాల్లోనే జరుగుతున్నాయని 'టాలెంట్‌ 500' నివేదిక పేర్కొంది.

ప్రతిభా వికాసం

ద్వితీయ శ్రేణి నగరాల్లో నవీన సాంకేతిక నైపుణ్యాలున్న ప్రతిభావంతులకు, ఔత్సాహిక పారిశ్రామికులకు కొదవ లేదు. కంపెనీల కార్యకలాపాల విస్తరణకూ ద్వితీయ శ్రేణి నగరాలు అనువుగా ఉన్నాయి. కార్యాలయ స్థలం చౌకగా లభించడం, నిపుణులైన ఉద్యోగుల లభ్యత, మౌలిక వసతుల కల్పనకు, కార్యాలయ స్థాపనకు వ్యయం తక్కువగా ఉండటం వంటి అనుకూలమైన అంశాలు ఉండటంతో హెచ్‌సీఎల్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, ఎరిక్సన్‌ వంటి ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు ద్వితీయ శ్రేణి నగరాల్లో తమ ఉప కార్యాలయాలను నెలకొల్పుతున్నాయి. 'ఎక్కడి నుంచైనా పని పద్ధతి'ని వెసులుబాటుగానే కాకుండా, వ్యూహాత్మక ప్రయోజనంగా కంపెనీలు భావిస్తున్నాయి. ప్రదేశం కన్నా ప్రతిభ, నైపుణ్యాలకే కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. 'రాన్‌స్టెడ్‌ ఇన్‌సైట్స్‌' సంస్థ తన నివేదికలో 15 ద్వితీయ శ్రేణి నగరాల్లో దాదాపు లక్ష ఉద్యోగాల కల్పనకు అవకాశాలు ఉన్నట్లు విశ్లేషించింది. డాటా శాస్త్రజ్ఞులు, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, సమాచార భద్రత నిపుణులు, నెట్‌వర్కింగ్‌, హార్డ్‌వేర్‌ ఇంజినీరింగ్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ మొదలైన ఉద్యోగాలకు ద్వితీయ శ్రేణి నగరాల్లో డిమాండ్‌ ఉందని నివేదిక వివరించింది.

కృత్రిమ మేధ రంగంలోనూ..

కృత్రిమ మేధ రంగంలోనూ ద్వితీయ శ్రేణి నగరాలు తమ ప్రతిభను చాటుతున్నాయి. కేరళలోని త్రివేండ్రంలో ఒక అమెరికన్‌ సంస్థ కాగ్నిటివ్‌ డిజైన్‌ ఇన్‌స్టిట్యూట్‌ను నెలకొల్పడానికి సన్నాహాలు ప్రారంభించింది. కృత్రిమ మేధలో అంకుర సంస్థలను ఏర్పాటు చేయడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది. జపాన్‌ కంపెనీ నిస్సాన్‌ గ్లోబల్‌ డిజిటల్‌ హబ్‌ను నెలకొల్పుతోంది. కేరళ ప్రభుత్వం చొరవతో కొచ్చిలో పారిశ్రామిక సమూహాలు వెలుస్తున్నాయి. జైపుర్‌ అత్యంత వేగంగా సమాచార సాంకేతిక కేంద్రంగా పరివర్తన చెందుతోంది. జైపుర్‌లో 576 అంకుర సంస్థలు ఉన్నాయి. ఆకర్షణీయ నగరాల మౌలిక వసతుల నిర్వహణ, పర్యవేక్షణలో దక్షిణాసియాలో జైపుర్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, ఫిన్‌టెక్‌, సాస్‌ రంగాల అంకుర సంస్థలకు నిలయమైన నగరంగా అహ్మదాబాద్‌ పేరు తెచ్చుకుంది. ఇంక్యుబేటర్ల స్థాపన, పెట్టుబడుల సమావేశాల నిర్వహణలో ద్వితీయ శ్రేణి నగరాల్లో అహ్మదాబాద్‌ శిఖర స్థానంలో ఉంది. ఐటీలో సీనియర్‌ స్థాయి ఉద్యోగుల సంఖ్యలో బెంగుళూరుతో పోటీపడే స్థాయికి పుణె చేరుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే ప్రారంభం...

దేశంలో అభివృద్ధి చెందుతున్న మిగతా ద్వితీయ శ్రేణి నగరాలతో పోలిస్తే, తెలుగు రాష్ట్రాల్లో అవి వెనకంజలో ఉన్నాయి. విశాఖపట్నం మాత్రమే పేటీఎం, వీసా, థాంప్సన్‌ వంటి ఫిన్‌టెక్‌ సంస్థలకు కేంద్రంగా ఉంది. ఆర్థిక అంకుర సంస్థలను, ఇంక్యుబేటర్లు తదితరాలను ఒకే సమూహంలోకి తీసుకురావడానికి 'ఫిన్‌టెక్‌ వ్యాలీ' అనే ఆక్సిలరేటర్‌ కార్యక్రమాన్ని విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించగా, పలు ఫిన్‌టెక్‌ అంకుర సంస్థలు తమ కార్యకలాపాలను అక్కడ ప్రారంభించాయి. విజయవాడ, తిరుపతి, కాకినాడలలో ఐటీ సంస్థల స్థాపనకు ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాలను ఉత్పత్తి, ఉపాధి కేంద్రాలుగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం తన పారిశ్రామిక విధానంలో స్పష్టం చేసింది. వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ వంటి నగరాలు ఐటీ రంగ అభివృద్ధికి అనువుగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆ నగరాల్లో ప్రభుత్వం ఐటీ టవర్లను నెలకొల్పుతోంది.

జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండేవాటిల్లోనే..

'టాస్క్‌' అనే సంస్థ ద్వారా యువతలో నైపుణ్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. టి.హబ్‌, వి.హబ్‌ ద్వారా అంకుర సంస్థలను ప్రోత్సహిస్తోంది. సాధారణంగా, జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండే నగరాలనే ఆయా కంపెనీలు తమ కార్యాలయాల స్థాపనకు ఎంచుకుంటాయి. అందుకని, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ద్వితీయ శ్రేణి నగరాల్లో మౌలిక వసతులను భారీయెత్తున విస్తరించాలి. జీవన నాణ్యతల్ని మెరుగు పరచాలి. పెట్టుబడులను ఆకర్షించడానికి మన నగరాలు సకల సౌకర్యాలతో సంసిద్ధం కావాలి. అందుకు స్థానిక ప్రభుత్వాల పూనిక చాలా అవసరం. అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న మహానగరాల విస్తరణ కూడా ద్వితీయ శ్రేణి నగరాల ఎదుగుదలకు అడ్డంకిగా మారుతోంది. ఈ అంశాన్ని సైతం అధికార యంత్రాంగం పరిగణనలోకి తీసుకొని కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా ద్వితీయ శ్రేణి నగరాలను సృజన నగరాలుగా తీర్చిదిద్దాలి. అప్పుడే ఆ నగరాలు ఆర్థిక చోదక శక్తులుగా అభివృద్ధి చెంది మహానగరాలతో పాటు ఆదాయ సముపార్జనకు, ఉపాధి అవకాశాల కేంద్రాలుగా వర్ధిల్లుతూ, దేశార్థికాభివృద్ధిలో కీలక పాత్ర నిర్వర్తిస్తాయి.

మారుతున్న దృక్పథం

కొవిడ్‌ సంక్షోభం మహానగరాల కన్నా చిన్న నగరాలే సురక్షితమని గుర్తించేలా చేసింది. '15 నిమిషాల నగరం', 'నడక దూరంలో పని ప్రదేశం' వంటి భావనలు చిన్న నగరాల పట్ల మారుతున్న దృక్పథాన్ని సూచిస్తున్నాయి. అభివృద్ధి చెందిన ద్వితీయ శ్రేణి నగరాలు వలసలను నిరోధించి స్థానిక ఉపాధికి బాటలు పరుస్తాయి. మహానగరాలపై ఒత్తిడిని తగ్గిస్తాయి. సుస్థిరాభివృద్ధిని సుసాధ్యం చేస్తాయి. పట్టణీకరణ దుష్ఫలితాలను నివారిస్తాయి. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పట్టణీకరణ దృక్పథానికి అనుగుణంగా మన పట్టణాభివృద్ధి వ్యూహాల్లో మార్పులు రావాలి.

- పుల్లూరు సుధాకర్‌ (పట్టణాభివృద్ధి వ్యవహారాల నిపుణులు)

ఇదీ చూడండి: దేశీయ జలరవాణా ఊపందుకుంటుందా?

ఇదీ చూడండి: పొగచూరుతున్న భవితవ్యం- విద్యార్థుల్లో ధూమపాన వ్యసనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.