భూతాప నియంత్రణలో రాజకీయ సంకల్పమే కీలకమని రెండేళ్ల క్రితం జీ20 దేశాల శిఖారాగ్ర సదస్సులో(G20 summit) ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటొనియో గుటెరెస్ స్పష్టీకరించారు. పోనుపోను అది పలుచనైపోతుండటమే అసలు సమస్య అని ఆయన అప్పట్లో ఆందోళన వ్యక్తంచేశారు. తాజా రోమ్ సదస్సు సైతం వాతావరణ మార్పులపై మొక్కుబడి తీర్మానాలతోనే ముగిసిపోయింది. శతాబ్ది మధ్య నాటికి నెట్‌జీరో(కర్బన తటస్థత)ను సాధించగలమన్న జీ20 దేశాధినేతల ఉమ్మడి ప్రకటనలో- కర్బన ఉద్గారాలకు కళ్లెం బిగించే స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికే కొరవడింది. బొగ్గు ఆధారిత నూతన విద్యుత్కేంద్రాలకు ఈ సంవత్సరాంతం నుంచి అంతర్జాతీయ ఆర్థిక సాయాన్ని నిలిపివేయాలని నేతలు నిర్ణయించారు. వర్ధమాన దేశాల స్వచ్ఛ ఇంధన లక్ష్యాల సాఫల్యానికి ఏటా సుమారు రూ.7.5లక్షల కోట్లను సమకూరుస్తామని వారు పునరుద్ఘాటించారు. దేశీయంగా బొగ్గు వినియోగాన్ని కట్టడి చేయాలంటే అణుశక్తి సరఫరాదారుల బృందం(ఎన్‌ఎస్‌జీ)లో తనకు స్థానం కల్పించాల్సిందేనని ఇండియా స్పష్టంచేసింది.
అణు విద్యుత్కేంద్రాల స్థాపన, నిర్వహణలలో సమస్యలను సమర్థంగా ఎదుర్కోవడానికి ఎన్‌ఎస్‌జీతో భాగస్వామ్యం ఉపయుక్తం అవుతుందని పేర్కొంది. స్వచ్ఛ ఇంధన ప్రాజెక్టులకు ప్రత్యేక నిధి, పరిశోధన సంస్థల వ్యవస్థ, హరిత ఉదజనిపై అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పాలన్న ప్రధాని మోదీ- ప్రపంచ సరఫరా గొలుసును విస్తృతపరచేందుకు జీ20 దేశాలు ఇండియాలో(g20 summit india) పెట్టుబడులు పెట్టాలని పిలుపిచ్చారు. దేశీయ, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా వచ్చే ఏడాది చివరికల్లా 500 కోట్ల మోతాదులకు పైగా కొవిడ్ టీకాలను ఉత్పత్తి చేస్తామని ఆయన ప్రకటించారు. రాబోయే ఏడెనిమిది నెలల్లో ప్రపంచ జనాభాలో 70శాతానికి వ్యాక్సిన్లు అందేలా చొరవ తీసుకుంటామన్న జీ20 దేశాలు- మహమ్మారులపై సమష్టి పోరాటానికి ప్రత్యేక కార్యదళాన్ని కొలువుతీర్చాలని నిర్ణయించాయి. టీకాల పంపిణీలో దేశాల మధ్య అసమానతలను అరికట్టాలన్న సదస్సు సదాశయం సత్వరం సాకారమైతేనే- సర్వ మానవాళి సురక్షితమవుతుంది!
అన్ని దేశాలతో శాంతియుత సంబంధాలను కొనసాగించడమే తమ అభిమతమని నిరుటి శిఖరాగ్ర సదస్సులో చైనా వెల్లడించింది. తద్భిన్నంగా ఇరుగుపొరుగులతో నిరంతరం పేచీలకు దిగుతున్న డ్రాగన్- తాలిబన్ల ఏలుబడిలోని అఫ్గానిస్థాన్‌పై ఆంక్షలు ఎత్తివేయాలని జీ20 విదేశాంగమాత్యుల భేటీలో వాదించింది! అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా తదితర జీ20 దేశాలతో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పాటు రష్యా అధినేత పుతిన్ సైతం రోమ్ సదస్సుకు గైర్హాజరయ్యారు. కీలక అంశాల్లో మిగిలిన వారితో ఆ రెండు దేశాలు కలిసిరావడం లేదన్న అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఆక్షేపణ అక్షరసత్యం. చిన్న దేశాల్లోని పన్నుల నిబంధనల ఆసరాతో భారీస్థాయిలో సుంకాలను ఎగ్గొడుతున్న బహుళజాతి సంస్థలకు ముకుతాడు వేసే కార్యాచరణకు జీ20 దేశాలు కట్టుబాటు చాటడం కీలక పరిణామం.
దేశవిదేశాల్లో కార్యకలాపాలు సాగించే బడా కంపెనీలకు 15శాతం అంతర్జాతీయ కనీస కార్పొరేటు పన్ను విధించే ఒప్పందంపై ఇండియాతో పాటు 136 దేశాలు ఇటీవలే సంతకాలు చేశాయి. అమెరికా చొరవతో ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ) ప్రతిపాదించిన ఈ విధానం- రెండు మూడేళ్లలో అమలులోకి రానుంది. తద్వారా ఆయా దేశాల నడుమ దాదాపు 12,500 కోట్ల డాలర్ల ఆదాయం పంపిణీ కానుందంటున్నారు. లింగపరమైన దుర్విచక్షణను రూపుమాపడం నుంచి ఉపాధి కల్పనను జోరెత్తిస్తూ వలసలను నిరోధించడం వరకు అనేక అంశాల్లో సమష్టి కృషికి జీ20 దేశాలు ఘనంగా ప్రతినబూనాయి. చేతల్లో చిత్తశుద్ధి, సమర్థ సమన్వయాలతో భాగస్వామ్య పక్షాలు ఏకతాటిపై సాగితేనే- ఆ స్వప్నాలన్నీ సాకారమవుతాయి!
ఇదీ చూడండి: '2070 నాటికి కర్బన ఉద్గారాల రహితంగా భారత్'