వాస్తవాధీన రేఖ వెంబడి చైనా నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ.. దేశ బడ్జెట్‌లో రక్షణ రంగానికి కేంద్ర ప్రభుత్వం మరింత ప్రాధాన్యం కల్పించింది. సైనిక పరికరాల సాంకేతికతలో స్వావలంబనే లక్ష్యంగా పెట్టుకున్న భాజపా సర్కారు.. హిమాలయాల్లో మిలిటరీ ఆధునీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం భారీగానే కేటాయింపులు చేసింది. గత ఐదేళ్లలో రక్షణ బడ్జెట్‌ను దాదాపు రెట్టింపు చేసిన కేంద్ర ప్రభుత్వం.. తాజా బడ్జెట్‌లో ఈ రంగానికి నిధులను 13శాతం పెంచింది. 2023-24 కేంద్ర బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ.5,93,537.64 కోట్లు కేటాయించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. గతేడాది కేటాయించిన మొత్తం (రూ.5.25లక్షల కోట్ల)తో పోలిస్తే ఇది 13శాతం అధికం. దేశీయ తయారీ, పరిశోధనలకు ఊతమిచ్చేలా ఆర్‌అండ్‌డీ బడ్జెట్‌లో 25శాతం ప్రైవేటు పరిశ్రమలు పొందేలా వీలు కల్పించారు నిర్మలమ్మ.
రక్షణ రంగానికి కేటాయింపులు ఇలా..
- కొత్త ఆయుధాలు, యుద్ధ విమానాలు, నౌకలు, సైనిక ఆయుధ సామగ్రి కొనుగోళ్లకు రూ.1.62 లక్షల కోట్లు
- రక్షణ రంగ సిబ్బంది జీతభత్యాలు, నిర్వహణ, మౌలికసదుపాయాల కల్పన కోసం రూ.2,70,120 కోట్లు
- రక్షణ రంగంలో పరిశోధనల కోసం రూ.12,850కోట్లు
- పింఛను వ్యయాల కోసం రూ.1,38,205కోట్లు
- రక్షణ శాఖ (సివిల్)కు రూ.8,774కోట్ల మూలధన వ్యయ కేటాయింపులు
'రక్షణ బడ్జెట్‌లో పెంపు ఓకే.. కానీ దేనికి సరిపోవు'
అయితే రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్‌పై మాజీ జనరల్ వేద్ ప్రకాశ్ మాలిక్ స్పందించారు. ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. "రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్‌లో 13 శాతం పెంపు స్వాగతించదగినదే. కానీ సైన్యం, నౌకాదళం, వైమానిక దళం ప్రస్తుత స్థితిని చూసుకుంటే ఆ పెంపు చాలా తక్కువ. అది దేనికీ సరిపోదని నేను భావిస్తున్నాను. పదేపదే సిఫార్సు చేసిన 'నాన్-లాప్సబుల్ ఫండ్' గురించి బడ్జెట్‌లో ప్రస్తావనే లేకపోవడం బాధాకరం" అంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జనరల్ వేద్ ప్రకాశ్ మాలిక్.. 1997 నుంచి 2000 వరకు ఇండియన్ ఆర్మీ 19వ చీఫ్‌గా విధులు నిర్వర్తించారు. కార్గిల్ యుద్ధ సమయంలో ఆయన ఆర్మీ చీఫ్‌గా ఉన్నారు.
-- సౌరభ్ శర్మ