ఎన్నికల్ని బహిష్కరించాలంటూ వేర్పాటువాద శక్తుల విస్తృత ప్రచారాలు.. పోలింగ్ ప్రక్రియను భగ్నం చేయడమే లక్ష్యంగా ముష్కరుల దారుణ మారణకాండలు.. ఇవీ మూడు దశాబ్దాలకుపైగా జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఇప్పటివరకూ కనిపిస్తూ వచ్చిన సర్వసాధారణ దృశ్యాలు. వాటికి తోడు రిగ్గింగ్ ఆరోపణలు రివాజుగా మారిన కీలక సరిహద్దు రాష్ట్రంలో.. అపశ్రుతులేవీ లేకుండా జిల్లా అభివృద్ధి మండళ్ల (డీడీసీ) ఎన్నికల క్రతువు సర్వజనామోదకరంగా ముగిసింది. నిరుడు ఆగస్టు తొలివారంలో మోదీ ప్రభుత్వం జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని, రాష్ట్రహోదాను రద్దు చేసి, లద్దాఖ్, జమ్మూ-కశ్మీర్లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తరవాత జరిగిన కీలక ఎన్నికలివి.
ప్రజాస్వామ్య విజయం..
ప్రతి జిల్లాను 14 ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజించి మొత్తం 20 జిల్లాల్లోని 280 స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో రెండు మినహా వెలువడిన ఫలితాలు- పార్టీగత విజయాలకు అతీతంగా జనస్వామ్య కాంక్షల దివిటీలై భాసిస్తున్నాయి. గత ఏడాది లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే కశ్మీరులో పోలింగ్ 15 శాతం అధికంగా 34 శాతంగా నమోదైంది. జమ్మూలో అంతకు రెట్టింపుగా నమోదైన ఓటింగ్- భాజపా ఆశల పాదుకు శ్వాసగా నిలిచింది. కశ్మీరులోనూ మూడు చోట్ల గెలిచి మొత్తంమీద 75 స్థానాల్లో విజయఢంకా మోగించి ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన భాజపా ఆరు డీడీసీల్ని ఒడిసి పట్టగలుగుతోంది. రద్దయిన స్వయంప్రతిపత్తి పునరుద్ధరణే అజెండాగా ఏకతాటిమీదకొచ్చిన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, మరో నాలుగు పక్షాల పీపుల్స్ అలయెన్స్ 112 స్థానాల్లో విజయ పతాక ఎగరేసి 12 జిల్లాలపై పట్టుబిగించింది. కడ నిమిషంలో విడిగా బరిలోకి దిగిన కాంగ్రెస్ 26 చోట్ల గెలవగా, 50 స్థానాల్లో స్వతంత్రులు నెగ్గుకొచ్చారు.
ఇదీ చదవండి: 'కాంగ్రెస్ ఎప్పుడూ రైతులకు వ్యతిరేకమే'
బ్యాలెట్‌తోనే భవిత అన్న కశ్మీరీల శాంతికాముకతను మన్నించి ప్రగతిశీల రాజకీయాలకు కొత్త ఒరవడి దిద్దే కార్యాచరణకు పార్టీలన్నీ నడుం కట్టాలిప్పుడు!తూటాలు, నిందారోపణలతో సమస్య పరిష్కారం కాదని, కశ్మీరీలను అక్కునజేర్చుకోవడం ద్వారానే సత్ఫలితాలు సాధించగలమని 2017 నాటి ప్రధాని మోదీ ఎర్రకోట ప్రసంగం నిర్ద్వంద్వంగా చాటింది. భూతాల స్వర్గంగా భ్రష్టుపట్టిన సరిహద్దు రాష్ట్రానికి సవ్య దిశ చూపిస్తామంటూ భిన్న ధ్రువాల్లాంటి పీడీపీ భాజపా ఒక్కతాటి మీదకొచ్చి సర్కారు ఏర్పాటు చేసినా, 2018లో ఆ సంకీర్ణం కుప్పకూలి రాష్ట్రపతి పాలన తోసుకొచ్చింది. శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాల్ని వల్లిస్తూ నిరుడు కేంద్రం తెచ్చిన సవరణలతో- కశ్మీర్ ప్రత్యేక హోదా, రాష్ట్రప్రతిపత్తి, ప్రాదేశిక సమగ్రతల్నీ కోల్పోయి మానసికంగా గాయపడింది.
రాజ్యాంగమే పరమావధి..
డీడీసీ ఎన్నికల్ని బహిష్కరించి భాజపాకు రాచబాటలు పరిచేది లేదంటూ ప్రత్యేక హోదా సముద్ధరణే అజెండాగా సైద్ధాంతిక వైరుద్ధ్యాల్ని పక్కనపెట్టి ఎన్‌సీ, పీడీపీలు పీపుల్స్ అలయెన్స్ నిర్మించాయి. పంచాయతీలకు నేరుగా నిధులందించడం ద్వారా సాకారమవుతున్న ప్రగతిని డీడీసీల ద్వారానూ విస్తరించడమే లక్ష్యమంటూ బరిలోకి దిగిన భాజపా- ప్రత్యర్థి పక్షాల నేతలకు అడుగడుగునా అవరోధాలు కల్పించింది. ఎన్‌ఐఏ, సీబీఐ, ఈడీ వంటివాటిని అడ్డుపెట్టుకొని భాజపా ప్రచ్ఛన్న యుద్ధం చేస్తోందని సహేతుకంగా విమర్శిస్తున్న మెహబూబా ముఫ్తీ- కశ్మీర్ పరిష్కారానికి ముందుగా పాకిస్థాన్‌తో చర్చలు జరపాలనడం, పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టమన్నట్లుంది. భారత రాజ్యాంగం పరిధికి ఆవల జమ్మూకశ్మీర్ రాజ్యాంగానికి ఏపాటి సార్వభౌమాధికారమూ లేదని, రాష్ట్ర రాజ్యాంగమైనా భారత రాజ్యాంగానికి లోబడిందేనని సుప్రీంకోర్టు లోగడే స్పష్టీకరించింది. కశ్మీర్ ప్రాంతీయ పక్షాల్లో ఆ స్పృహ మొగ్గ తొడగడం ఎంత ముఖ్యమో సరిహద్దు రాష్ట్రానికి సత్వరం రాష్ట్ర ప్రతిపత్తి కల్పించి శాసనసభ ఎన్నికలకు మేలు బాటలు పరవడమూ అంతే కీలకం!
ఇదీ చదవండి: బలగాల ఉపసంహరణపై త్వరలోనే మళ్లీ సైనిక చర్చలు