మన భారతంలో అలుగుటయే ఎరుంగని మహా మహితాత్ముడు- జాతి ఆహార భద్రతకు నిష్ఠగా నిబద్ధమైన కర్షకుడు! కాయకష్టాన్ని కాస్తంత అదృష్టాన్ని నమ్ముకొని స్వేదం చిందిస్తూ, చీడపీడలు ప్రకృతి విపత్తులతో ఒంటరి పోరాటం చేస్తూ ధాన్యాగారాన్ని నింపుతున్న రైతు- తన జీవన భద్రతకే ముప్పు ముంచుకొచ్చిందంటూ నేడు కదనశంఖం పూరిస్తున్నాడు.
బారికేడ్లు, జల ఫిరంగులు, బాష్పవాయుగోళాల్ని ధిక్కరించి 'చలో దిల్లీ' అంటూ కదం తొక్కుతున్న 17 రైతు సంఘాల ఆందోళనలో పంజాబ్, హరియాణాలతోపాటు రాజస్థాన్, ఉత్తరాఖండ్, యూపీ, మధ్యప్రదేశ్ రైతులూ పాలుపంచుకోనున్నారు.
డిమాండ్లు ఇవే..
బేషరతు చర్చలకు సిద్ధమంటున్న అన్నదాతలు ప్రధానంగా ప్రస్తావిస్తున్న డిమాండ్లలో- వివాదాస్పద వ్యవసాయ చట్టాల ఉపసంహరణ మొదటిది. నోటి మాటలు కాకుండా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్నది రెండోది. మండీలకే పరిమితం కాకుండా రైతు తన పంటను ఎక్కడైనా అమ్ముకొనే స్వేచ్ఛ ప్రసాదించే, ఒప్పంద సేద్యాన్ని ప్రోత్సహించే చట్టాలు కర్షకుల ఆదాయాల్ని మెరుగుపరుస్తాయని కేంద్ర సర్కారు చెప్పినా- మండీలకు ముంతపొగ పెట్టి కనీస మద్దతు ధరకు చెల్లుకొట్టే దురాలోచన అందులో దాగుందని కర్షకలోకం భావిస్తోంది.
దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ పంటకు ఎంత గిరాకీ ఉందో ఆరా తీసి లాభదాయకంగా విక్రయించుకోగల వెసులుబాటు కర్షకలోకంలో 80శాతం పైబడిన రెండు మూడెకరాల రైతులకు ఉంటుందనుకోవడం పగటికల. అసలు మద్దతు ధరల విధానానికి చెల్లుకొట్టి నిర్దిష్ట పంట ఉత్పత్తులకు రాయితీలందించే ప్రత్యామ్నాయాల్ని పరిశీలించాలన్నది 2017లో నీతి ఆయోగ్ కేంద్రానికి చేసిన సూచన. తాజా చట్టాల పరమార్థం అదేనన్న రైతుల భయాందోళనల్ని ఉపశమింపజేయాలంటే- వాటిని ఉపసంహరించడమే సరైన పని!
కనీస మద్దతు ధర నిర్ధరణ అప్పుడే...
దేశీయంగా హరిత విప్లవం గట్టిగా వేరూనుకోవడానికి అరవయ్యో దశకంలో కనీస మద్దతు ధర, వాటిని నిర్ణయించే యంత్రాంగం, వ్యవసాయ మండీలు, భారతీయ ఆహార సంస్థ సేకరణ గొప్ప దన్నుగా నిలిచాయి. సతత హరిత విప్లవాన్ని పలవరించే పాలక శ్రేణులన్నీ- ఏమాత్రం గిట్టుబాటుకాని సేద్యం రైతు భవితకు గోరీకడుతున్న వాస్తవాన్ని గుర్తించ నిరాకరించబట్టే అన్నదాతల బలవన్మరణాలు జాతి ఆత్మను క్షోభిల్లజేస్తున్నాయి. రైతు కుటుంబం శ్రమ గిట్టుబాటు అయ్యేలా 'కనీస మద్దతు' నిర్ధారణ ఎలా సాగాలో డాక్టర్ స్వామినాథన్ ఏనాడో నిర్దేశించినా- ధరోల్బణం పెచ్చుమీరుతుందంటూ కేంద్రంలోని ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోనే లేదు.
'ఎంఎస్‌పీ'కే విక్రయించే హక్కును రైతుకు దఖలుపరచేలా చట్టం తెస్తే అన్నదాతల్లో అది విశ్వాసం నింపుతుందన్న ధరల నిర్ణాయక సంఘం ఇటీవలి సిఫార్సుకూ మన్నన దక్కలేదు. కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడుతోందన్న కర్షకుల సహేతుక ఆందోళనల నేపథ్యంలో- వివాదాస్పద చట్టాలను రద్దుచేసి, ముంచుకొస్తున్న ఆహార కొరత ఉపద్రవాన్ని కాచుకొనే సమగ్ర కార్యాచరణ వ్యూహంపై ప్రభుత్వాలు దృష్టిసారించాలి.
కోరసాచనున్న కొరత!
2050నాటికి ప్రపంచ జనాభా 980కోట్లకు చేరనుందని, ఆహారోత్పత్తుల్లో పెరుగుదల ఇప్పటి స్థాయిలో ఉంటే మరో పదేళ్లలోనే కొరత కోర సాచనుందనీ అధ్యయనాలు చాటుతున్నాయి. జనసంఖ్యపరంగా మరికొన్నేళ్లలోనే చైనాను అధిగమించనున్న ఇండియాలో దేశీయంగా ఆహారోత్పత్తి 2030 నాటికి 59శాతం జనావళికే సరిపోతుందన్న అంచనాలు- సమగ్ర దిద్దుబాటు చర్యల అవసరాన్ని ఎలుగెత్తుతున్నాయి. మేలిమి వంగడాలతో దిగుబడులు పెంచడం మొదలు ప్రకృతి ఉత్పాతాలు ఉరిమినా రైతు కుదేలయ్యే దురవస్థ లేకుండా ప్రభుత్వాలే కాచుకోవాలి. సేద్యాన్ని అన్నిందాలా లాభదాయకం చేసి రైతే రాజు అన్న నానుడి నిజమయ్యే రోజు రహించినప్పుడే అన్నదాతకు జీవన భద్రత, జాతికి ఆహార భద్రత ఒనగూడతాయి!
ఇదీ చదవండి:'చలో దిల్లీ': షరుతుల చర్చలకు రైతులు ససేమిరా