ఒడుదొడుకుగా ఉండే రాతి బంజరు భూములు, ఆక్సిజన్ కూడా అందని ఎత్తైన భూభాగాలు, ఒళ్లును ముళ్లులా గుచ్చుకునే శీతల పవనాలు... తూర్పు లద్దాఖ్‌లో ఉండే ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు చైనా సైనికులకు కొత్తే కావచ్చు. కానీ బెబ్బులిలా ఎగసిపడే భారత సైన్యానికి కాదు. మన యోధులకు ఈ పరిస్థితుల్లో మనుగడ సాధించడం కొట్టిన పిండి.
సియాచిన్ హిమానీనదంతో పాటు ఉత్తర సిక్కింలోని ఎత్తైన ప్రాంతాల్లో భారత సైన్యం విధులు నిర్వహించే ప్రాంతాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. భారత సైన్యంలోని 350 యూనిట్లు ఇలాంటి పరిస్థితుల్లోనే విధులు నిర్వహిస్తాయి. రాష్ట్రీయ రైఫిల్స్, అసోం రైఫిల్స్, ప్రత్యేక దళాలకు చెందిన 70 యూనిట్లు వీటికి అదనం.
వెయ్యి మంది ఉండే ప్రతి పదాతి దళ యూనిట్‌లోని సభ్యులను రెండు సంవత్సరాల పాటు లద్దాఖ్‌లో మోహరిస్తారు. ఇందులో ఒక సంవత్సరం సియాచిన్‌లో ఉండాలి. అక్కడికి వెళ్లే ముందు సైనికులంతా సియాచిన్ యుద్ధ పాఠశాలలో కఠోర శిక్షణను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యుద్ధ పాఠాశాల సముద్ర మట్టానికి 12 వేల ఎత్తులో ఉంది.
![Facing off China, east Ladakh is picnic for many Indian soldiers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9509089_12777b1b0adf7c550176790b44929866-8.jpg)
చైనాకు లేదీ అనుభవం!
సియాచిన్‌లో మోహరించిన తర్వాత పరిస్థితులను బట్టి విధుల కోసం 90 రోజుల పాటు అత్యంత ఎత్తైన ప్రాంతాల్లోకి సైనికులను పంపుతారు. ఈ ప్రదేశాలు సముద్ర మట్టానికి 18 వేల నుంచి 20 వేల ఎత్తున ఉంటాయి. ఉడికే రక్తాన్ని సైతం గడ్డకట్టించే చలి, మైనస్ 50 డిగ్రీలకుపైగా పడిపోయే ఉష్ణోగ్రతలు, 24 గంటలూ ఎటు చూసినా మంచు... చైనా సైనికులకు ఇలాంటి పరిస్థితులపై అవగాహన లేదు. ఇలాంటి కఠినమైన యుద్ధక్షేత్రాల్లో విధులు నిర్వహించిన అనుభవం లేదు.
![Facing off China, east Ladakh is picnic for many Indian soldiers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9509089_12777b1b0adf7c550176790b44929866-2.jpg)
![Facing off China, east Ladakh is picnic for many Indian soldiers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9509089_12777b1b0adf7c550176790b44929866-10.jpg)
విహారయాత్ర అనుభూతి
సియాచిన్‌లో విధులు పూర్తి చేసుకున్న తర్వాత తూర్పు లద్దాఖ్‌కు చేరుకుంటారు. 12 నుంచి 18 వేల ఎత్తు ఉండే ప్రాంతాల్లో పహారా కాస్తారు. లద్దాఖ్‌తో పోలిస్తే ఎన్నో రెట్లు తీవ్రమైన పరిస్థితులను సియాచిన్‌లో ఎదుర్కొంటారు సైనికులు. కాబట్టి సియాచిన్ నుంచి వచ్చిన సైనికులకు లద్దాఖ్‌లో పరిస్థితులు అంత ప్రమాదకరంగా కనిపించవు. ఇక్కడ హిమపాతాల ప్రమాదం ఉండదు, భూభాగంలో పగుళ్లు ఉన్నాయేమోనన్న అనుమానాలు అవసరం లేదు. మంచు బాధలూ అంతగా ఉండవు. అందుకే ఇక్కడికి వచ్చిన జవాన్లకు విహారయాత్రకు వచ్చిన అనుభూతి కలుగుతుందంటే ఆశ్చర్యం కలగక మానదు.
![Facing off China, east Ladakh is picnic for many Indian soldiers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9509089_12777b1b0adf7c550176790b44929866-6.jpg)
ఎల్ఏసీకి సియాచిన్ బలగాలు
ఈ నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అధికారులు వ్యూహాత్మక చర్యలు తీసుకున్నారు. సియాచిన్‌లో విధులు నిర్వహించే బలగాలను ఈ ఏడాది పెద్ద సంఖ్యలో తూర్పు లద్దాఖ్‌కు చేర్చారు.
"ఏప్రిల్ చివర్లో భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు ప్రారంభమైన తర్వాత చాలా యూనిట్లు సియాచిన్ నుంచి తూర్పు లద్దాఖ్‌కు చేరుకున్నాయి. చాలా మంది సైనికులు వాస్తవాధీన రేఖ వద్ద ముందు వరుసలో పహారా కాస్తున్నారు."
-సంబంధిత వర్గాలు
చలికాలంలో కనెక్షన్ కట్!
సియాచిన్‌లో గత 36 ఏళ్లుగా భారత సైనికులు విధులు నిర్వహిస్తున్నారు. పాకిస్థాన్‌ను ఎదుర్కొని ఈ ఎత్తైన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఇక్కడే పహారా కాస్తున్నారు. ఇక్కడి యూనిట్లలో మార్పులు చేయడం, బలగాలను తరలించడం మార్చి నుంచి అక్టోబర్ మధ్యే చేపడతారు. భారీ మంచు వల్ల శీతాకాలంలో ఈ హిమానీనదంలో పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి.
![Facing off China, east Ladakh is picnic for many Indian soldiers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9509089_12777b1b0adf7c550176790b44929866-7.jpg)
![Facing off China, east Ladakh is picnic for many Indian soldiers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9509089_12777b1b0adf7c550176790b44929866-9.jpg)
తొలగని ప్రతిష్టంభన
అటు.. ఆసియాలోని అతిపెద్ద దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. భారీగా సైన్యం, సైనిక సామాగ్రి సరిహద్దులకు చేరుకుంది. వాస్తవాధీన రేఖ వద్ద లక్ష మందికిపైగా సైన్యాన్ని చైనా పోగు చేసినట్లు తెలుస్తోంది. అందుకు ప్రతిగా భారత్ సైతం దీటైన చర్యలు చేపట్టింది.
(రచయిత: సంజయ్ బారువా, సీనియర్ పాత్రికేయులు)