గల్వాన్ ఘర్షణలతో చెలరేగిన ఉద్రిక్తతలు చల్లారకముందే జగడాలమారి చైనా మరో కుంపటిని రాజేసింది. నూతన సరిహద్దు చట్టాన్ని (china border law) తీసుకొచ్చి భారత్‌తో వివాదాలకు మరింత ఆజ్యం పోసింది. తమ దేశ సార్వభౌమత్వ పరిరక్షణకోసమే దానికి రూపకల్పన చేసినట్లు బయటకు చెబుతున్నా అసలు లక్ష్యం ఇండియానే అని స్పష్టంగా తెలుస్తోంది.
ఈ ఏడాది మార్చిలో పురుడుపోసుకొని (china border law) గతవారం ఆమోదం పొందిన నూతన చట్టం వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమలులోకి రానుంది. ఇది సరిహద్దుల్లో శాంతిస్థాపనే లక్ష్యంగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలను సంక్లిష్టంగా మార్చే అవకాశముంది. ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా దెబ్బతీసే ముప్పు కనిపిస్తోంది.
వ్యూహంతో తెచ్చిన చట్టం
చైనా 14 దేశాలతో భూ సరిహద్దులు (India China Border News) పంచుకుంటోంది. 12 పొరుగు దేశాలతో సరిహద్దు వివాదాలపై డ్రాగన్ స్పష్టమైన ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత్, భూటాన్‌లతో మాత్రం వివాదాలు ఇంకా పరిష్కారం కాలేదు. మంగోలియా, రష్యా తరవాత చైనా అత్యధికంగా భూ సరిహద్దును ఇండియాతోనే కలిగి ఉంది. ఈశాన్యంలో అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఉత్తరాన జమ్ము-కశ్మీర్ వరకు (India China Border News) 3,488 కిలోమీటర్ల మేర ఈ సరిహద్దు విస్తరించింది. దాని వెంట పలు సరస్సులు, నదులు, మంచుకొండలు ఉన్నాయి. ఆయా కాలాల్లో వాటి పరిమాణంలో వచ్చే మార్పులతో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)పై స్పష్టత కొరవడుతోంది. ఫలితంగా ఇరు దేశాల మధ్య పలు వివాదాస్పద ప్రాంతాల్లో సైనిక ప్రతిష్టంభనలు తలెత్తుతున్నాయి. 1993 నుంచి కుదిరిన అయిదు ఒప్పందాల ఆధారంగా ఇరు దేశాలు సరిహద్దుల నిర్వహణను పర్యవేక్షిస్తున్నాయి. విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనా- వాటిని ఎప్పటికప్పుడు ఉల్లంఘిస్తూ, పదేపదే కవ్వింపులకు పాల్పడుతోంది. కొన్నేళ్లుగా సరిహద్దుల్లో మౌలిక వసతులను బలోపేతం చేసుకుంటోంది. టిబెట్‌లో భారత సరిహద్దుకు కూతవేటు దూరంలో అనేక గ్రామాలను నిర్మించింది. గల్వాన్ ఘర్షణల తరవాత సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన, ఉద్రిక్తతల తొలగింపు లక్ష్యంగా ఇరు దేశాల మధ్య వివిధ స్థాయుల్లో పలుమార్లు చర్చలు జరిగాయి. పూర్తిస్థాయిలో బలగాల ఉపసంహరణపై సయోధ్య మాత్రం కుదరలేదు.
తమ దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత చాలా పవిత్రమైనవని, వాటి ఉల్లంఘనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మతించబోమని నూతన చట్టంలో (china border law) చైనా పేర్కొంది. ఈ చట్టాన్ని తీసుకొచ్చిన సమయం, అందులో పేర్కొన్న కొన్ని అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయి. సరిహద్దుల్లో పలు వివాదాస్పద ప్రాంతాలు తమవేనంటూ డ్రాగన్ చేస్తున్న వాదనలను భారత్ దీటుగా తిప్పికొడుతుండటం వల్ల పక్కా వ్యూహంతోనే తాజా చట్టాన్ని తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. ఇండియాతో వివాదాలే దాని రూపకల్పనకు మూలమని చైనా అధికారిక వార్తాసంస్థల్లో విశ్లేషణలు సైతం వచ్చాయి. సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాల్లో జన జీవనానికి అనుమతించడం (china border law) కొత్త చట్టంలోని కీలక అంశం. ఈ చట్టం ముసుగులో ఎల్‌ఏసీ వెంట డ్రాగన్ శాశ్వత నిర్మాణాలు చేపట్టే అవకాశముంది. భారత్‌తో చర్చల సమయంలో ఆయా ప్రాంతాల్లో తమ శాశ్వత నిర్మాణాలు ఉన్నాయని, దీర్ఘకాలంగా తమ పౌరులు అక్కడ స్థిరపడి ఉన్నారని వాదిస్తూ అవన్నీ తమ దేశ భూభాగాలేనని బుకాయించే అవకాశం ఉంది. సరిహద్దు ప్రాంతాల విషయంలో తమ దేశంలో ప్రత్యేక చట్టం ఉందని, దాని ప్రకారమే తాము నడుచుకుంటామని డ్రాగన్ మొండిగా వాదించే ప్రమాదం ఉంది. నిజానికి ఈ చట్టం ఆమోదం పొందక ముందునుంచీ వివాదాస్పద ప్రాంతాల్లో చైనా నిర్మాణాలు చేపడుతోంది. తాజా చట్టంతో వాటికి చట్టబద్ధత దక్కనుంది.
స్పష్టత అవసరం
సరిహద్దుల్లో ప్రవహించే నదులు, సరస్సులను పరిరక్షించుకోవడంపై నూతన చట్టంలో పొందుపరచిన అంశమూ భారత్‌కు ఆందోళన కలిగించేదే. తాజా చట్టం పేరుతో బ్రహ్మపుత్ర నదీజలాల్ని భారత్‌కు ఎక్కువగా చేరకుండా డ్రాగన్ అడ్డుకునే ముప్పుంది. సైనిక ప్రతిష్టంభనల వంటి సమయాల్లో నీటిని ఆపి పరిస్థితులను తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు సరిహద్దు నిర్వహణకు సంబంధించి పూర్తి బాధ్యతలను తాజా చట్టం ద్వారా చైనా ప్రజా విమోచన సైన్యానికి (పీఎల్‌ఏ) కట్టబెట్టగా, ఇండియాలో మాత్రం ఈ విషయంలో కొంత అస్పష్టత ఉందని భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హోం, రక్షణ శాఖల్లో ఏది సరిహద్దు నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుందన్న విషయంపై మరింత స్పష్టత అవసరమని సూచిస్తున్నారు. ఈ విషయంపై కేంద్ర సర్కారు తక్షణం దృష్టిసారించి అనిశ్చితిని తొలగించాలి. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల కోసం వివాదాస్పద ప్రాంతాలపై తమ డిమాండ్లను పక్కన పెట్టేయబోమని తాజా చట్టం ద్వారా చైనా చెప్పకనే చెప్పింది. వివాదాల పరిష్కారంతో పాటు సరిహద్దుల్లో శాంతి స్థాపనే లక్ష్యంగా ఇరు దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న, భవిష్యత్తులో జరగబోయే చర్చలకు ఈ పరిణామాలు ప్రతిబంధకాలుగా మారే ముప్పుంది. భారత్, చైనా- చర్చల ద్వారానే సరిహద్దు వివాదాలను పరిష్కరించుకొనేందుకు కృషి చేయాలి.
- నవీన్ కుమార్
ఇదీ చూడండి : విద్వేషాగ్నులకు ఆజ్యంపోసే.. అభ్యంతరకర పోస్టులు!