Electrified Road For Charging Vehicles : ఖరీదు అధికంగా ఉండటం, ఎక్కువ దూరం ప్రయాణించలేకపోవడం, సరిపడా ఛార్జింగ్ కేంద్రాలు లేకపోవడం, ప్రయాణంలో ఛార్జింగ్ కోసం వేచి ఉండాల్సి రావడం వంటి సమస్యలు విద్యుత్ వాహనాలకు ప్రతిబంధకంగా మారాయి. బ్యాటరీలే ప్రధాన సమస్యగా మారుతున్నాయి. బ్యాటరీల ఖరీదు ఎక్కువ కావడం, బరువు తదితర అడ్డంకులతో వీటిని భారీ వాహనాలకు ఉపయోగించడం కష్టమవుతోంది. దీంతో విద్యుత్ వాహనాలు తేలికపాటి వస్తువుల రవాణాకు మాత్రమే పరిమితం కావలసి వస్తోంది. భారతదేశంలో బ్యాటరీ తయారీలో వినియోగించే లిథియం, నికెల్, మాంగనీస్ లాంటి ముడిసరకు లభ్యత తక్కువే. ప్రస్తుతం చమురు తరహాలో భవిష్యత్తులో బ్యాటరీ ముడి సరకుల కోసం సైతం విదేశాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇది మళ్లీ దేశీయ ఇంధన భద్రతకు సవాలుగా మారుతుంది. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా విద్యుత్ రహదారులు కనిపిస్తున్నాయి.
విద్యుత్ రహదారులంటే..
విద్యుత్తుతో నడిచే వాహనాలకు రహదారుల పొడవునా నిరంతరం కరెంటును అందుబాటులో ఉంచడం మేలైన పరిష్కారంగా నిపుణులు భావిస్తున్నారు. ఇందుకోసం రైల్వేమార్గం తరహాలో భూఉపరితలంపై కొంత ఎత్తున విద్యుత్ ప్రసార వ్యవస్థను ఏర్పాటు చేయడం ఒక పద్ధతి. ఇంకో పద్ధతిలో భూమిపై రైలు పట్టాల మాదిరిగా విద్యుత్ ప్రసార లైన్లు నెలకొల్పుతారు. ఈ రెండు పద్ధతుల్లో విద్యుత్తును నేరుగా అనుసంధాన పద్ధతిలో వాహనంలోని మోటారుకు అందించవచ్చు.
ఇవికాకుండా, భూగర్భంలో విద్యుత్ ప్రసార వ్యవస్థను ఏర్పాటుచేసి ప్రత్యక్షంగా అనుసంధానత లేని ఇండక్షన్ పద్ధతిలో రోడ్డుపై ప్రయాణించే వాహనాలకు కరెంటు సరఫరా చేయవచ్చు. రైల్వేల తరహాలో రహదారులపై విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసే పద్ధతిలో వాహనాలపైన అమర్చే ప్రత్యేక గ్రాహకాలు తీగల్ని తాకుతూ కరెంటును స్వీకరిస్తూ నడుస్తాయి. సాంకేతికంగా, నిర్వహణపరంగా ఇవి ఎంతో అనుకూలమైనవి. కానీ, వీటిని రోడ్డుపై కొంత ఎత్తులో నిర్మించాల్సి ఉంటుంది. అందుకని, ఎత్తయిన లారీలు, బస్సులు వంటి భారీ సరకులు, ప్రజారవాణా వాహనాలకు మాత్రమే అనుకూలంగా ఉంటాయి.
Electrified Vehicle Vs Electric Vehicle : భూమిపై రైలు పట్టాల తరహాలో వేసే విద్యుత్తు లైన్లు అన్ని రకాల వాహనాలకూ అనుకూలం. భూగర్భంలో నెలకొల్పే విద్యుత్ వ్యవస్థలో ఉపరితలంపై స్తంభాలు, తీగలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు. కానీ కొన్ని సాంకేతిక పరిమితుల వల్ల పెద్దమొత్తంలో కరెంటును అందించలేవు. భారీ వాహనాలకిది అనుకూలం కాదు. రహదారుల వెంబడి విద్యుత్తు సౌకర్యం ఏర్పాటుకు ఎత్తులో ఉండే ఉపరితల వ్యవస్థకు కిలోమీటర్‌కు సుమారు రూ.9.30 కోట్లు, భూమిపై రైలు పట్టాల తరహా లైన్లకు సుమారు రూ.5.84 కోట్లు, భూగర్భ వ్యవస్థకు సుమారు రూ.18.33 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ రహదారుల విద్యుత్ వ్యవస్థల జీవితకాలం ఇరవైఏళ్లకు పైగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి మార్గాల్లో నడిచే వాహనాల్లో సైతం రిజర్వులో చిన్న బ్యాటరీ ఉండటంవల్ల మధ్యలో విద్యుత్ సరఫరాకు అంతరాయం నెలకొన్నా సమస్య ఉండదు. లైన్ల ఏర్పాటు లేకపోయినా కొంతదూరం ప్రయాణించగలవు. విద్యుత్ రహదారులపై నడిచే వాహనాలకు తయారీలోనే తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
అయితే ఇప్పుడున్న విద్యుత్ వాహనాలు వీటికి అనుకూలం కావు. విద్యుత్ రహదారులు లేనిచోట కూడా నడవాలంటే పూర్తి సామర్థ్యంగల బ్యాటరీ లేదా డీజిల్/పెట్రోల్‌తో నడిచే హైబ్రిడ్ వాహనాలను వినియోగించాల్సి ఉంటుంది. దీనివల్ల సమస్య మళ్ళీ మొదటికే వస్తుంది. రహదారులపై ఈ తరహా విద్యుత్ వాహనాలు ప్రయాణించాలంటే వీటికోసమే ప్రత్యేకంగా మార్గాన్ని ఇరువైపులా కేటాయించాల్సి ఉంటుంది. ఇది ఆరు వరసల జాతీయ రహదారుల్లోనే సాధ్యమవుతుంది. విద్యుత్ పంపిణీ సంస్థలు రహదారి పొడవునా ఉపకేంద్రాలను నిర్మించి నిరంతరం కరెంటును సరఫరా చేయాలి. పెరిగే డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తినీ పెంచుకోవాలి. దారి పొడవునా సౌర విద్యుత్ పలకలు ఏర్పాటుచేసి అనుసంధానిస్తే కరెంటు పంపిణీ నష్టాలు ఉండవు. విద్యుత్తు రహదారుల నిర్మాణం, పర్యవేక్షణ వ్యయప్రయాసలతో కూడిన అంశం. అందుకని, నడిచే వాహనాల తీరు, సంఖ్యను బట్టి తగిన విధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
బృహత్తర ప్రణాళిక
First Electrified Roads : కేంద్ర జాతీయ రహదారుల శాఖ విద్యుత్ వాహనాల వాడకాన్ని సులభతరం చేసే ప్రయత్నంలో భాగంగా 'విద్యుత్ వాహనాల కోసం జాతీయ రహదారులు' అనే బృహత్తర ప్రణాళికలో భాగంగా తొలిసారిగా నాగ్‌పుర్‌లో పైలట్ ప్రాజెక్టును నిర్మించింది. ఆ అనుభవంతో దిల్లీ-ముంబయి మధ్య విద్యుత్ రహదారిని అందుబాటులోకి తీసుకురానుంది. రాబోయే కాలంలో అయిదు వేల కిలోమీటర్ల విద్యుత్ జాతీయ రహదారులను నిర్మించాలని యోచిస్తోంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ఇలాంటి నిర్మాణాలు చేపట్టనుంది. టోల్ వసూళ్ల ద్వారా పెట్టుబడి, నిర్వహణ ఖర్చులను సంబంధిత కంపెనీలు రాబట్టుకునే అవకాశం కల్పిస్తారు. విద్యుత్ రహదారుల నిర్మాణం వల్ల బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుందనే ఆందోళన ఉండదు. రహదారుల వెంబడి నడిచే విద్యుత్ వాహనాలు నేరుగా లైన్ల నుంచి కరెంటును సంగ్రహించి నడవడం వల్ల, సాధారణ విద్యుత్ వాహనాల్లో మాదిరిగా బ్యాటరీ ఛార్జింగ్, నిల్వ, డిశ్ఛార్జింగ్ ప్రక్రియ ఉండదు. అందుకని, సుమారు 50 శాతందాకా విద్యుత్ మార్పిడి నష్టాలను నివారించవచ్చు. విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచడం వల్ల చమురు ఉత్పత్తుల దిగుమతిని తగ్గించుకోవచ్చు. కర్బన ఉద్గారాలు, వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఇంధన భద్రతను సాధించవచ్చు.
కొన్ని దేశాల్లో..
దక్షిణ కొరియాలో ప్రయోగాత్మకంగా ఇండక్షన్ పద్ధతిలో నిర్మించిన నమూనా విజయవంతమైంది. కొన్ని రహదారుల్లో ఈ తరహా విద్యుత్ వాహనాలను నడపడం ప్రారంభించారు. స్వీడన్, నార్వే, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా తదితర దేశాల్లో పరిమిత స్థాయిలో ఇప్పటికే ఈ తరహా వాహనాలు నడుస్తున్నాయి. స్వీడన్ అన్ని వాహనాలకు అనుకూలంగా ఉండే మొట్టమొదటి పొడవైన శాశ్వత విద్యుత్ రహదారిని 2025 కల్లా వాడకంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది.