ETV Bharat / opinion

దిగుమతుల స్థానంలో నూనెగింజల దిగుబడులు!

దేశంలో ఏటా వినియోగించే 2.30 కోట్ల టన్నుల నూనెల్లో.. 1.50 కోట్ల టన్నులు.. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఫలితంగా వంటనూనె ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశీయంగా ఉత్పాదకత పెరిగితేనే ఈ దిగుమతులను తగ్గించడం సాధ్యమవుతుంది. ఈ మేరకు అన్నదాతలకు ప్రభుత్వాలు అండగా నిలవాల్సిన అవసరం ఉంది.

oil seeds production in india
నూనెగింజల దిగుమతుల స్థానంలో దిగుబడులు!
author img

By

Published : Jan 21, 2021, 7:05 AM IST

వంటనూనె ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నూనెల కోసం దిగుమతులపై ఆధారపడటమే ఈ పరిస్థితికి కారణం. ఆర్నెల్లలో అంతర్జాతీయ విపణిలో ముడి పామాయిల్‌ ధరలు 50శాతం పెరిగాయి. దేశంలో ఏటా వినియోగించే 2.30 కోట్ల టన్నుల నూనెల్లో 1.50 కోట్ల టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. వంట నూనెల కోసం ఏటా రూ.74 వేల కోట్లు విదేశాలకు చెల్లిస్తున్నాం. డెబ్బయ్యో దశకం నుంచి దిగుమతులపైనే ఆధారపడుతూ వస్తున్నాం. గడచిన దశాబ్ద కాలంలో ఒక్క పామాయిల్‌ దిగుమతే 8.40శాతం పెరిగింది. మన కన్నా చిన్న దేశాలు, సాగు వాతావరణం దృష్ట్యా మనకన్నా మెరుగ్గా లేని దేశాల నుంచి నూనెలు, వాటి ఉత్పత్తులను దిగుమతి చేసుకొవాల్సి వస్తోంది. ఇకనైనా మన ప్రభుత్వాలు తగిన కార్యాచరణతో వ్యవసాయ రంగాన్ని ఆ పంటల వైపు తీసుకెళ్లాల్సి ఉంది.

దిగుమతి సుంకాలు ఎక్కువే..
కరోనా వైరస్‌ వ్యాప్తి క్రమంలో పంట చేతికొచ్చేనాటికి కార్మికులు అందుబాటులో లేక నూనె ధరలు పెరిగాయి. వేరుసెనగ, సోయాబీన్‌, పొద్దుతిరుగుడు, పామాయిల్‌ ధరల్లో గతేడాదితో పోలిస్తే 25 నుంచి 35 శాతం పెరుగుదల నమోదైంది. ముఖ్యంగా ఆహారం, సౌందర్య లేపనాలు, బయోగ్యాస్‌ వంటి తయారీలో ఎక్కువగా వాడే పామాయిల్‌ను 90శాతం ఇండొనేసియా, మలేసియా దేశాలే ప్రపంచానికి అందిస్తున్నాయి. ఈ దేశాల ఎగుమతులపైనే భారత్‌, చైనా ఎక్కువగా ఆధారపడ్డాయి. దేశ అవసరాలు తీర్చే ముడి, శుద్ధ పామాయిల్‌పై 37.5 శాతం నుంచి 45శాతం దాకా దిగుమతి సుంకం విధిస్తున్నారు. పొద్దుతిరుగుడు నూనెపై 35శాతం చెల్లించాల్సి వస్తోంది. దిగుమతి సుంకం తగ్గితే ప్రస్తుత ధరల నుంచి సామాన్యుడికి భారీ ఊరట లభిస్తుంది.

దేశీయంగా తక్కువే..

దేశంలో పాతికేళ్లుగా నూనెగింజల పంటల విస్తీర్ణం ఏ మాత్రం పెరగలేదు. అయినా కొంతమేర ఉత్పత్తి పెరిగిందంటే- అదంతా అన్నదాతల చలవే. పంటల సాగులో వస్తున్న మార్పుల వల్ల దిగుబడులు పెరిగినా, ప్రపంచ సగటుతో పోలిస్తే దేశీయంగా తక్కువే. మన దేశంలో హెక్టారు భూమిలో 1.13 టన్నుల సోయాబీన్‌ పంట ఉత్పత్తి అవుతోంది. ప్రపంచ సగటు 2.41 టన్నులు. బ్రెజిల్‌ 2.81 టన్నుల దిగుబడి సాధిస్తోంది. మనవద్ద వేరుసెనగ హెక్టారుకు 1.21 టన్నులమేర పండుతుండగా, అమెరికా రైతులు ఏకంగా 3.80 టన్నులు సాధిస్తున్నారు. అన్ని నూనెగింజల ఉత్పత్తిలోనూ ప్రపంచ సగటుతో పోలిస్తే మనం చాలా వెనకంజలో ఉన్నాం. దేశంలో సోయాబీన్‌ వార్షిక దిగుబడి కోటి టన్నులు దాటినా పొద్దుతిరుగుడులో కనీసం పది లక్షల టన్నుల వార్షిక దిగుబడిని సాధించలేకపోయాం. మధ్యప్రదేశ్‌ (27శాతం), రాజస్థాన్‌(20శాతం), మహారాష్ట్ర (16), గుజరాత్‌ (15) రాష్ట్రాలే దేశంలోని మొత్తం ఉత్పత్తిలో 78శాతం పండిస్తున్నాయి.

ఆధునిక సేద్యపద్ధతులే ఆలంబన..

దేశీయంగా ఉత్పాదకత పెరిగే వరకు దిగుమతులు తగ్గించడం సాధ్యం కాదు. ప్రస్తుతం సరాసరి నూనె గింజల సాగు దేశంలో 2.50కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలోనే ఉంది. ప్రపంచ సగటు స్థాయిలో దిగుబడి సాధించగలిగితే ఈ విస్తీర్ణంలోనే దేశ అవసరాల మేరకు నూనె గింజల్ని ఉత్పత్తి చేయవచ్చు. సోయాబీన్‌, ఆవ, వేరుసెనగ, పొద్దుతిరుగుడులో ఆధునిక సేద్య పద్ధతులు అవలంబిస్తే 67శాతం దిగుబడులు పెరుగుతాయి. దీనిపై కేంద్రం ఇప్పుడిప్పుడే దృష్టి సారించింది. మొత్తంగా దిగుమతులు తగ్గించుకునేందుకు ప్రస్తుతం 3.7కోట్ల టన్నులుగా ఉన్న నూనెగింజల ఉత్పత్తిని 2024-25 నాటికి 4.7 కోట్ల టన్నులకు పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది.

అన్నదాతకు అండ అవసరం
దేశంలో వర్షపాతం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనే ఈ పంటలు పండిస్తున్నారు. నీటిపారుదల వ్యవస్థపై ఆధారపడే ప్రాంతాల్లో కేవలం నాలుగుశాతమే సాగవుతున్నాయి. దిగుమతులపై ఆధారపడటం వల్ల మార్కెట్‌లో నూనె ధరలు పెరుగుతున్నాయని, దీన్ని రైతులు సొమ్ము చేసుకోవాలంటూ- తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పామాయిల్‌ వంటి పంటలు పండించాలని పిలుపిస్తున్నాయి. అయితే, ఆ మేరకు ప్రోత్సాహకాలు మాత్రం రైతులకు అందడం లేదు. పామాయిల్‌ పంట వేస్తే మూడు నుంచి ఏడేళ్ల వరకు ఆ రైతుకు ఎలాంటి ఫలసాయం అందదు. అంతకాలం వేచిచూడటం రైతుకు భారంగా మారడం వల్ల ఎవరూ ముందుకు రావడం లేదు. పైగా మన వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే, నాణ్యమైన విత్తనాల లభ్యత కూడా లేదు. విత్తన ధరలూ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఉన్నత శ్రేణి విత్తనాలను రాయితీపై ప్రభుత్వం అన్నదాతలకు సరఫరా చేయాలి. పంట చేతికి వచ్చే వరకు నిర్వహణ నిమిత్తం రైతుకు ప్రభుత్వం అండగా ఉండాలి.

స్థానికంగా ఈ పంటలు పండిస్తే, వాటి ఆధారంగా చిన్నతరహా పరిశ్రమలు ఏర్పడి ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. జన్యు మార్పిడి విత్తనాలతో పంటలు పండిస్తే తలెత్తే ప్రభావాలు, ఫలితాలపై శాస్త్రీయంగా పరిశోధించాల్సి ఉంది. అంతకంటే ముందు సేద్యంలో ఆధునికీకరణ, నీటి వసతి, యాంత్రీకరణ, అన్నదాతకు ప్రోత్సాహకాలు ఇస్తే కొంత ముందడుగు వేసినట్లవుతుంది.

- బండపల్లి స్టాలిన్‌

ఇదీ చూడండి:కాలుష్యం బారి నుంచి నదులకు మోక్షమెప్పుడు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.