ETV Bharat / opinion

విద్యార్థులకు 'స్మార్ట్‌' సాయం- ప్రభుత్వాల పాత్రే కీలకం

ఆన్‌లైన్‌లో విద్యాబోధన జరగడం వల్ల స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఉపకరణాల పాత్ర పెరిగింది. అయితే, ఆర్థిక సమస్యల కారణంగా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉపకరణాల్ని అందించలేకపోతున్నారు. పేద విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేసే అంశంపై ప్రభుత్వాలు గట్టిగా దృష్టిపెట్టాలి. కనీసం కొనుగోళ్లలో రాయితీల్ని కల్పించినా, పేద విద్యార్థులకు ఎంతో ఊరట కల్పించినట్లవుతుంది.

online education
విద్యార్థులకు 'స్మార్ట్‌' సాయంలో ప్రభుత్వాల పాత్రే కీలకం
author img

By

Published : Jan 29, 2021, 7:41 AM IST

కరోనా మహమ్మారి దెబ్బకు బడులు, కళాశాలలకు తాళాలు పడి, ఆన్‌లైన్‌లో విద్యాబోధన జరగడం వల్ల స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఉపకరణాల పాత్ర పెరిగింది. తరగతులతో సంబంధం లేకుండా విద్యార్థులంతా వీటిని సమకూర్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే, ఆర్థిక సమస్యల కారణంగా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉపకరణాల్ని అందించలేకపోతున్నారు. పేదరికం వల్ల ప్రతి 100 మందిలో 27 మంది విద్యార్థులు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లకు నోచుకోవడంలేదని జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) సర్వేలో వెల్లడైంది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కేవలం నాలుగు శాతం కుటుంబాలకే కంప్యూటర్లు ఉంటే, 14 శాతం కంటే తక్కువ మందికి అంతర్జాల సదుపాయం ఉన్నదని ఇటీవలి 'ఆక్స్‌ఫామ్‌' సర్వేలో వెల్లడైంది. ఈ సౌకర్యాలు కరవై చాలామంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులకు దూరమయ్యారని ఆ సర్వే కళ్లకు కట్టింది.

ఆత్మహత్యల ఉదంతాలు..

ఉపకరణాల్ని కొనుగోలు చేయలేక, ఆన్‌లైన్‌లో పాఠాలు వినలేక ఒత్తిడికి లోనవుతున్న కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలూ చోటుచేసుకోవడం బాధాకరం. ఉపకార వేతనాలు అందక చదువుకోవడమే భారంగా మారిన పరిస్థితుల్లో- ఆన్‌లైన్‌ తరగతుల కోసం ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసే మార్గం లేక ఆందోళనకు గురైన తెలంగాణకు చెందిన ఐశ్వర్యారెడ్డి అనే బీఎస్సీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఉదంతం తెలిసిందే. స్మార్ట్‌ఫోన్‌ లేక ఆన్‌లైన్‌ పాఠాలు వినలేకపోతున్నానన్న కలతతో కేరళకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ఉదంతాలు కలవరపరుస్తున్నాయి.

అంతర్జాల సదుపాయ కల్పన
ప్రపంచంలో చైనా (85.4 కోట్ల) తరవాత ఎక్కువ మంది అంతర్జాలాన్ని వినియోగిస్తున్నది భారత్‌లోనే (56కోట్ల). పేద పిల్లల విద్యావసరాలకు ఉపకరణాలు లేకపోవడం, వారు ఆన్‌లైన్‌ తరగతులు వినడానికి వీలుగా అంతర్జాల సదుపాయాన్ని కల్పించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 'జాతీయ డిజిటల్‌ అక్షరాస్యత మిషన్‌ (ఎన్‌డీఎల్‌ఎం)'లో భాగంగా చేపట్టిన 'ప్రధానమంత్రి గ్రామీణ్‌ డిజిటల్‌ సాక్షరత అభియాన్‌ (పీఎందిశ)' కార్యక్రమంలో డిజిటల్‌ అక్షరాస్యులుగా మారేవారి సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉంది.

నిరుపేదలకు బాసటగా..
ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉచితంగానో, రాయితీలపైనో ఉపకరణాలు అందించడంపై దృష్టి సారించాల్సిన అవసరముంది. 12వ తరగతిలో అధిక మార్కులు సాధించిన 36వేల మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు 'కేరళ ఫ్రీ ల్యాప్‌టాప్‌ స్కీం-2021' కింద ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా అందించనుంది. నిరుపేద విద్యార్థులకు బాసటగా నిలిచేందుకే రూ.311 కోట్లతో ల్యాప్‌టాప్‌లను ఉచితంగా అందజేస్తున్నట్లు రాష్ట్ర సర్కారు ప్రకటించింది. పేద విద్యార్థులు ఆన్‌లైన్‌ పాఠాలకు దూరమవుతున్నారని గ్రహించిన దిల్లీ హైకోర్టు- వారికి ఉపకరణాలను, ఉచిత అంతర్జాల సదుపాయాన్ని కల్పించాలని విద్యాసంస్థలను ఆదేశించింది.

సహృదయుల సహకారం..

లాక్‌డౌన్‌ సమయంలో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలను చేపట్టి ఔదార్యం చూపిన బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ తాజాగా పేద విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలను చేరువ చేసేందుకు షియోమి(ఎంఐ ఇండియా) సంస్థతో జట్టుకట్టారు. పేద పిల్లలకు ఇప్పటికే 100 స్మార్ట్‌ఫోన్లు అందజేసిన ఆయన ఈ సంస్థతో కలిసి శిక్షాహర్‌హాథ్‌ ఉద్యమాన్ని చేపట్టనున్నారు. దీనికింద ప్రజలు వినియోగించిన స్మార్ట్‌ఫోన్లను సేకరించి పేద పిల్లలకు అందజేయనున్నారు. పాడయిపోయిన ఉపకరణాలకు మరమ్మతులు చేపట్టి పేద విద్యార్థులకు పంపిణీ చేస్తారు. ఇదేకోవలో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు సహృదయులు పేద విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు ఉచితంగా అందిస్తూ వారి చదువులకు బాటలు వేస్తుండటం ప్రశంసనీయం.

బడ్జెట్​పై ఆశలు..
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. కరోనా సంక్షోభం దాపురించిన దరిమిలా కేంద్రం ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్‌ ఇది. ఈ పరిస్థితుల్లో 'బడ్జెట్‌-2021'పై ప్రజలకు భారీ అంచనాలు ఉండటం సహజమే. ఈసారి విద్యారంగానికి సముచిత కేటాయింపులు లభిస్తాయన్న ఆశలు రేకెత్తుతున్నాయి. విద్యార్థులను డిజిటల్‌ ఇండియా వైపు నడిపించేందుకు ఈ బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయిస్తే బాగుంటుందన్న సూచనలు వినవస్తున్నాయి. ఇందులో భాగంగా విద్యార్థులకు అవసరమైన ఉపకరణాలు అందిస్తూ అంతర్జాల సదుపాయాన్ని కల్పించేందుకు నిధులు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రాయితీలతో ఊరట..

ఉదార హృదయులు, స్వచ్ఛంద సంస్థలు పేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, పెన్నులు, బడిసంచులు, పాఠశాలలకు ఫ్యాన్లు, కుర్చీలు, బల్లలు, నీటి శుద్ధి సామగ్రి అందిస్తుండటాన్ని ఎన్నో ఏళ్లుగా చూస్తున్నాం. పూర్వ విద్యార్థులు, ప్రవాస భారతీయులు తాము చదువుకున్న, తమ సొంత గ్రామాల్లోని బడుల పురోభివృద్ధికి ఆర్థిక సాయంతో అండగా నిలుస్తున్నారు. ఇలాంటి వారంతా ప్రస్తుత డిజిటల్‌ యుగంలో భావిభారత పౌరులకు సరికొత్త రీతిలో అండగా నిలవాల్సిన అవసరముంది. విద్యాభ్యాసంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెరిగిన దృష్ట్యా ఆ కోణంలో స్పందించడం మేలు. ప్రభుత్వాలు సైతం పేద విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేసే అంశంపై గట్టిగా దృష్టిపెట్టాలి. కనీసం కొనుగోళ్లలో రాయితీల్ని కల్పించినా, పేద విద్యార్థులకు ఎంతో ఊరట కల్పించినట్లవుతుంది. ఇలాంటి మార్గాల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తేనే మనదేశం సాంకేతిక రంగంలో కొత్త పుంతలు తొక్కుతుంది.

-- ఏలేటి ప్రభాకర్‌రెడ్డి

ఇదీ చదవండి:మౌలిక అజెండాతోనే శీఘ్ర ప్రగతి సాధ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.