విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు సమాయత్తమైన కేంద్ర ప్రభుత్వం- ఇందుకోసం పేర్కొంటున్న కారణాల్లోనే ఎన్నో లొసుగులు కనిపిస్తున్నాయి. నష్టాల ఊబిలో కూరుకుపోతోందనేది ప్రధానమైన అంశం. అయితే, దానికి ప్రైవేటీకరణే మార్గమా? నష్టాల నుంచి బయటపడే దారులే లేవా? ఈ ప్రశ్నలకు సర్కారు సమాధానం చెప్పాల్సి ఉంది. మరోవైపు విశాఖ ఉక్కు విషయంలో విస్మయకర విషయాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. సాధారణంగా ఏ సంస్థకు చెందిన భూములయినా ఆ సంస్థ పేరునే ఉంటాయి. కానీ విశాఖ ఉక్కు కర్మాగార నిర్మాణం సమయంలో సంస్థకు చెందిన భూములన్నింటినీ రాష్ట్రపతి పేరున పెట్టారు.
ఏమాత్రం పెంచకుండా..
ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో ఇదేమీ తప్పు కాకపోయినా, 1970వ దశకంలో భూసేకరణ చేపట్టినప్పుడు ఆ భూములకు ఎంతమొత్తాన్ని చెల్లించారో- ఇప్పటికీ వాటి విలువను ఏమాత్రం పెంచకుండా అంతే చూపుతుండటం గమనార్హం. ఫలితంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం- మొత్తం 19,703 ఎకరాల భూముల విలువ కేవలం రూ.55.82కోట్లుగానే లెక్కగట్టారు. కొద్దిపాటి భూములు మాత్రమే సంస్థ పేరిట ఉన్నాయి.
విశాఖ నగరంలోని సంస్థ పేరిటనున్న 22.19 ఎకరాల భూముల అభివృద్ధికి మరో ప్రభుత్వరంగ సంస్థ 'నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్'(ఎన్.బి.సి.సి.)తో కర్మాగార ఉన్నతాధికారులు ఒప్పందం చేసుకున్నారు. దీనివల్ల విశాఖ ఉక్కుకు హీనపక్షం రూ.1000-1500కోట్ల ఆదాయం ఒనగూరే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. 22.19 ఎకరాల భూమికే రూ.1000-1500కోట్లు వస్తుంటే- 19,703 ఎకరాలకు కేవలం రూ.55.82కోట్ల విలువే నిర్ధరించడం గమనార్హం. ఈ ఒక్క నిర్ణయంతోనే ఉక్కు కర్మాగారానికి సుమారు లక్ష కోట్ల రూపాయలకుపైగా నష్టం వాటిల్లబోయే దుస్థితి నెలకొందంటే అతిశయోక్తికాదు. దీన్నిబట్టి కేంద్రప్రభుత్వం ఉక్కు కర్మాగారం విక్రయంలో ఎంత అడ్డగోలుగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.
సర్కారు భూమి విలువల్నీ గౌరవించరా..
సాధారణంగా ప్రభుత్వ భూముల విలువలు మార్కెట్ ధరకన్నా పదిరెట్ల వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ లెక్కన విశాఖ ఉక్కు భూములను కనీసం ప్రభుత్వ భూవిలువల మేరకైనా విక్రయించాలి. కానీ కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు కనీసం రాష్ట్ర ప్రభుత్వ భూవిలువల ప్రకారం కూడా విక్రయించకుండా, 1970వ దశకం నాటి విలువకే కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడానికి రంగం సిద్ధం చేయడం ఆశ్చర్యకరం. కేంద్రం నిర్ణయం కారణంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కొనుగోలు చేయబోయే సంస్థకు లక్ష కోట్ల రూపాయల లాభం వచ్చే అవకాశం ఏర్పడిందంటే భూముల విక్రయాల్లో ఎంత పెద్ద కుంభకోణం దాగుందో అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రపతి పేరిట ఉన్న భూములు విశాఖ ఉక్కు కర్మాగారం పేరు మీదకు బదిలీ జరిగితే- ప్రభుత్వ విలువల ప్రకారం చూపించుకొనే అవకాశం ఏర్పడుతుంది. ఫలితంగా లక్ష కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్న సంస్థకు బ్యాంకులు వేల కోట్ల రూపాయల రుణాలు ఇవ్వడానికి అవకాశం కలుగుతుంది. ఫలితంగా కర్మాగారం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు కొంత మేరకు అడ్డుకట్టపడుతుంది. దీంతోపాటు సంస్థను విక్రయించదలచినా సంస్థ ఆస్తులకు సరిపడా విలువను డిమాండు చేయడానికి వీలుంటుంది. కర్మాగారాన్ని ప్రైవేటుకు విక్రయించి ఆయా భూములను ప్రైవేటువారి పేరు మీదకు బదిలీచేయడానికి పాలకులు చూపిస్తున్న ఆసక్తి ప్రస్తుత సంస్థ(ఆర్.ఐ.ఎన్.ఎల్.) పేరు మీదకు మార్చడానికి వెనకాడుతుండటం గమనార్హం.
రోడ్డున పడేయడమే..
సాధారణంగా భారీ పెట్టుబడులు, వేలల్లో ఉద్యోగాలు ఇచ్చే పారిశ్రామిక సంస్థలకు భూములను కేటాయించే విషయంలో రాయితీలు కల్పిస్తుంటారు. విశాఖ ఉక్కు కర్మాగార విక్రయం వ్యవహారంలో ఎలాంటి షరతులు లేకపోవడం విస్మయకరం. ఇప్పటికే సుమారు 38వేల మంది శాశ్వత, ఒప్పంద ఉద్యోగులున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తక్కువగా విక్రయించి ఎంత అదనపు పెట్టుబడులు ఆయా కొనుగోలుదారులు తీసుకురాబోతున్నారు? కొత్తగా ఎన్ని వేల ఉద్యోగాలు కల్పించబోతున్నారన్న విషయాలపై ఎలాంటి నిబంధనలు లేకుండా పూర్తి ఏకపక్షంగా వందశాతం విక్రయానికి తెగబడటం వేలమంది జీవితాలను రోడ్డున పడేయడమేనని పలువురు ఆక్రోశిస్తున్నారు.
సంస్థ ప్రైవేటు యాజమాన్యం చేతుల్లోకి వెళ్తే వేల మంది ఉద్యోగులపై వేటు పడే అవకాశాలున్నాయి. జాతీయ రహదారిలోని, పలు ప్రధాన రహదారులకు ఆనుకుని, వాణిజ్యపరంగా అత్యంత ఉపయుక్తంగా ఉన్న కర్మాగారం భూముల్లో ప్రైవేటు భాగస్వామ్యంతో వాణిజ్య సముదాయాలు నిర్మిస్తే కోట్ల రూపాయల్లో ఆదాయం ఒనగూరుతుంది. అలాంటి ప్రత్యామ్నాయ అవకాశాలపై దృష్టి పెట్టకుండా ఏకంగా కర్మాగారాన్నే విక్రయించాలన్న నిర్ణయం సమంజసం కాదనే అభిప్రాయాలున్నాయి.
సత్వర నిర్ణయాలతోనే సాంత్వన
విశాఖ ఉక్కు కర్మాగారంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష కుటుంబాలకు పైగా ఆధారపడ్డాయి. అలాంటి సంస్థను గాడిలో పెట్టడానికి సత్వరం సరైన నిర్ణయం తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మరింత వేగంగా నష్టాల్లో కూరుకుపోయే ముప్పుంది. ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదన అనంతరం దాన్ని లాభాల బాటలో పెట్టడానికి అందుబాటులో ఉన్న అనేక ప్రత్యామ్నాయ మార్గాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్.ఎం.డి.సి.తోగానీ, సెయిల్‌తోగానీ విలీనం చేయడం, లేదంటే ఎన్.ఎం.డి.సి., సెయిల్ సంస్థలను, వాటి ఆధ్వర్యంలో ఉన్న కర్మాగారాలన్నింటినీ విలీనం చేస్తే పలు ప్రయోజనాలు ఉంటాయన్న నిపుణుల అభిప్రాయం ఆలోచించదగ్గదే. పలు ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేస్తున్నప్పుడు ఉక్కు రంగంలోని పలు ప్రభుత్వరంగ సంస్థలను విలీనం చేస్తే తప్పేముందని ఉక్కు ఉద్యమంలో భాగస్వామిగా మారిన విశ్రాంత ఐ.పి.ఎస్. అధికారి వి.వి.లక్ష్మీనారాయణ, విశాఖ ఉక్కు పూర్వ సీఎండీ వై.శివసాగర్‌రావు ప్రశ్నిస్తున్నారు. ఒకే సంస్థగా మారిస్తే ఏటా రూ.18వేల కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని సూచిస్తున్నారు. అలాంటి ఆచరణాత్మక పరిష్కారాలపై దృష్టిసారిస్తే విశాఖ ఉక్కు భవితవ్యం ఉజ్జ్వలంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
విదేశీ పోటీతో కుదేలు
విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రస్తుత సమయం చాలా కీలకం. మార్చినెలలో విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. ఏకంగా ఒక్క నెలలోనే రూ.2400కోట్లకు పైగా విక్రయాలు జరిగిన దాఖలాలున్నాయి. రానున్న రోజుల్లో గణనీయమైన విక్రయాలు జరగకపోతే నగదు లభ్యత కరవై వివిధ చెల్లింపులకూ కష్టమయ్యే ముప్పుంది. ఇలాంటి కీలక తరుణంలో నెలకొన్న గందరగోళంతో సంస్థ మరింతగా నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి నెలకొంది. దీనికితోడు, మౌలిక వసతుల రంగం ఇబ్బందులను తొలగించడానికి కేంద్రం తీసుకున్న దిగుమతి సుంకాల తొలగింపు నిర్ణయం విశాఖతోపాటు దేశంలోని ఉక్కు కర్మాగారాలన్నింటికీ పెనుశాపంగా మారనుందనడంలో సందేహం లేదు. దేశీయ ఉక్కు కర్మాగారాలతోనే పోటీపడలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విశాఖ స్టీలుప్లాంటుకు చైనా వంటి విదేశీ సంస్థల నుంచి తీవ్ర పోటీ ఎదురవనుంది. దీనివల్ల విశాఖ కర్మాగారం ఆర్థికంగా మరింత కుదేలవనుంది.
- బి.ఎస్.రామకృష్ణ
ఇదీ చూడండి:ఈసీ నియామకాల్లో ఇష్టారాజ్యం