భారత పాడి పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. లాక్‌డౌన్ వేళ దేశవ్యాప్తంగా పాల వాణిజ్య అమ్మకాలు ఆగిపోవడంతో డిమాండు పడిపోయింది. సాధారణంగా పశువులు శీతాకాలంలో పాలు అధికంగా ఇవ్వడం ఆనవాయితీ. కానీ ఈసారి పాల ఉత్పత్తి పడిపోయి డెయిరీల రోజువారీ సేకరణ సైతం తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) తొలి అర్ధభాగం (గత ఏప్రిల్-సెప్టెంబరు)లో దేశవ్యాప్తంగా సహకార డెయిరీల రోజువారీ పాల సేకరణ కుంగింది. ఏప్రిల్‌లో 5.30 కోట్ల కిలోలుంటే సెప్టెంబరులో 4.65 కోట్ల కిలోలకు పడిపోయింది. ఈ ఏడాది పాల ఉత్పత్తి అయిదు శాతం తగ్గనుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంత భారీ తగ్గుదల గత అయిదేళ్లలో ఎన్నడూ లేదు. డెయిరీలు రైతులకు చెల్లించే పాల ధరలను గత జనవరి నుంచి పెంచడం ప్రారంభించాయి. లీటరుకు రెండు రూపాయల నుంచి మూడు రూపాయలకు పెంచడం వల్ల రైతులకు ఆదాయం పెరుగుతుందని డెయిరీలు చెబుతున్నాయి. కానీ పాడి పశువుల నిర్వహణకు పెడుతున్న ఖర్చులతో పోలిస్తే పాల ధర నిరాశాజనకంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పక్క రాష్ట్రాలపై ఆధారం
ప్రపంచ పాల ఉత్పత్తిలో అయిదో వంతు భారత్‌దే. అత్యధికంగా పాలు ఉత్పత్తి చేసే దేశం కూడా మనదే. కానీ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పాల లభ్యత లేదు. తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది కోట్ల మంది ప్రజలకు నిత్యం స్వచ్ఛమైన పాలు కావాలంటే పక్క రాష్ట్రాల వైపు చూడాల్సి వస్తోంది. ఇక్కడి పాడి రైతులకు ప్రోత్సాహకాలు లేకపోవడం, సహకార పాల ఉత్పత్తిదారుల సంఘాలను పటిష్ఠం చేయకపోవడం, సహకార డెయిరీల నిర్వహణ అధ్వానం కావడంతో ఇతర రాష్ట్రాల డెయిరీలు ఇక్కడ వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి. నాలుగు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీలోని విజయ డెయిరీకి దేశవ్యాప్తంగా మంచి పేరుండేది. ఇప్పుడు అది నామమాత్రంగా నడుస్తోంది. ఏపీలో అనేక సహకార, ప్రైవేటు డెయిరీలున్నా వాటిని ప్రోత్సహించి రైతులను ఆదుకోవడం మానేశారు. ఏపీ ప్రభుత్వం గుజరాత్ కేంద్రంగా పనిచేసే అమూల్ డెయిరీని ప్రోత్సహిస్తూ వెచ్చిస్తున్న వేల కోట్ల రూపాయలను స్థానిక రైతులకు పాల ధరపై ప్రోత్సాహకంగా ఇస్తే- స్థానిక డెయిరీలకు వ్యాపారం, రైతులకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
శ్రద్ధ లేకపోవడం వల్లే!
పక్కనే ఉన్న కర్ణాటకలో పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య బాగా పనిచేస్తూ పాల ఉత్పత్తి పెంచుతున్నా తెలుగు రాష్ట్రాల్లో ఆ స్థాయికి రాష్ట్ర సహకార డెయిరీలు ఎదగలేకపోతున్నాయి. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలకు వాటిపై శ్రద్ధ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. 2019లో భారత పాల ఉత్పత్తుల మార్కెట్ విలువ రూ.10,527 కోట్లు. ఏటా ఇది 15 శాతం వృద్ధిరేటును సాధిస్తుందని పలు దేశాల కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాయి. ఫ్రాన్స్‌కు చెందిన కంపెనీ ఇక్కడి తిరుమల డెయిరీలో పెట్టుబడి పెట్టడానికి ఇక్కడి పాలకున్న డిమాండే కారణం. వాతావరణ మార్పుల వల్ల పశువులు కట్టడం, ఈనాల్సిన సీజన్లు మారిపోతున్నాయి. పశువులు ఎదకు రావడం లేదు. ఆ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎదకు వచ్చినప్పుడు కృత్రిమ గర్భధారణ చేయడానికి సమయం సరిపోవడం లేదు. దీనివల్ల మేలుజాతి పశువుల ఉత్పత్తి తగ్గుతోంది. తెలంగాణలో చాలామంది రైతులు సాగునీటి వసతి వచ్చిన తరవాత సాగువైపు మరలుతూ భారమైందని పశువుల నిర్వహణ వదిలేస్తున్నారు. మరోవైపు, మంచి పాడి పశువు కొనాలంటే కనీసం లక్ష రూపాయలైనా పెట్టాలి. అంత సొమ్ము లేక పేదరైతులు ఇబ్బందులు పడుతున్నారు. రుణాలిచ్చేందుకు బ్యాంకులు నిరాకరిస్తుండటంతో కొత్తగా పాడి పశువుల్ని కొనుగోలు చేయడానికి రైతులకు ఇక్కట్లు తప్పడంలేదు.
రక్షణ తప్పనిసరి
రైతు సంక్షేమ పథకాల్లో పంటల సాగు, దిగుబడుల పెంపునకు ప్రభుత్వాలిస్తున్న ప్రాధాన్యం పాడి రైతులకివ్వడం లేదు. కరోనాతో లాక్‌డౌన్ విధించిన కాలంలో సైతం ప్రజల రోగనిరోధకశక్తిని పెంచేలా బలాన్నిచ్చే స్వచ్ఛమైన పాల ఉత్పత్తి, సరఫరా ఆగకుండా రైతులు దేశానికి ఎంతో సేవచేశారు. పలు దేశాల్లో పాడి పరిశ్రమను ఆదుకోవడానికి అక్కడి ప్రభుత్వాలు ఆర్థికసాయాలు ప్రకటించాయి. ఉదాహరణకు కరోనా సమయంలో అమెరికా ప్రభుత్వం అక్కడి పాడి పరిశ్రమను ఆదుకునేందుకు రూ.21,500 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. అక్కడి పేదలకు పాలు, పాల ఉత్పత్తుల సరఫరాకు నెలకు రూ.730 కోట్లు కేటాయించినట్లు అమెరికా వ్యవసాయశాఖ వెల్లడించింది. భారత్‌లో కోట్ల మంది పేదలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వారి ఆరోగ్య పరిరక్షణకు స్వచ్ఛమైన పాలతో డెయిరీలు తయారుచేసే పాలపొడిని కొని రేషన్‌కార్డులపై విక్రయించాలని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఇటీవల చేసిన సిఫార్సు ఆచరణీయం. దీనికోసం పాలపొడిని నిల్వ చేయాలని అది కోరింది. దీనివల్ల పాల కొనుగోలు పెరిగి రైతులకు ఆదాయం అధికమవుతుంది. పేదలకు పోషకాహారం లభిస్తుంది.
చేయూత అందించినప్పుడే..
సహకార డెయిరీల సహకారంతో పేద పిల్లలకు వసతి గృహాలు, పాఠశాలల ద్వారా పాల ఉత్పత్తులు, పాల సరఫరా చేపడితే- పాడి రైతులకు ఆదాయ ప్రయోజనం కలుగుతుంది. పాలు లీటరుకు కనీస ధర ఎంత చెల్లించాలనేది ప్రభుత్వం ప్రకటించాలి. రైతు పాలుపోసిన పక్షం రోజుల్లో అతడి బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ చేయాలనే నిబంధనను పక్కాగా అమలు చేయాలి. పంటరుణాలతో సంబంధం లేకుండా పాడి రైతులకు బ్యాంకులు రుణాలివ్వాలి. గొర్రెల పంపిణీలా మేలుజాతి పాడి పశువుల పంపిణీనీ పెద్దయెత్తున చేపడితే తెలుగు రాష్ట్రాల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. రైతు బతకాలంటే పాడి-పంట రెండింటినీ కొనసాగించాలని 'భారత వ్యవసాయ పరిశోధన మండలి' పలునివేదికల్లో పేర్కొంది. పాడిని వదిలేసి పంటల సాగుకే ప్రభుత్వాలు పథకాలు అమలుచేస్తున్న విధానాల వల్లే అప్పులపాలై, బతికేదారి లేక- రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పాడి ఆదాయం ఉండే రైతు కుటుంబాల్లో ఇలాంటి సమస్యలకు అవకాశం ఉండదని పాలకులు గుర్తించాలి.
ఖర్చులైనా రావడం లేదు
పాడి పశువుల నిర్వహణ ఆర్థికభారంగా మారి వాటిని వదిలించుకునే రైతుల సంఖ్య పెరుగుతోంది. గ్రామాల్లోని చిన్నపాటి డెయిరీలు అప్పులు కట్టలేక మూతపడుతున్నాయి. దాణా, కూలీల ఖర్చు విపరీతంగా పెరిగింది. దినసరి కూలీ రూ.500 దాకా ఇస్తామన్నా పశువుల వద్ద పనిచేయడానికి కూలీలు దొరక్క తెలుగు రాష్ట్రాల రైతులు బిహార్, ఒడిశాల నుంచి వచ్చే వారిని నెలవేతనాలపై నియమిస్తున్నారు. హైదరాబాద్ పరిసర జిల్లాల్లోని అనేక చిన్న డెయిరీల్లో బిహారీ కూలీలే పని చేస్తున్నారు. ఖర్చులకు తగినట్లుగా పాల ధర పెరగనందు వల్ల పాడి గిట్టుబాటు కావడం లేదు. ఆవు పాలకు దేశవ్యాప్తంగా లీటరుకు రూ.28, గేదె పాలకు రూ.47కి మించి చెల్లించడం లేదు.
- మంగమూరి శ్రీనివాస్
ఇదీ చూడండి:చమురు మంటతో నిత్యావసరాల రేట్లకు రెక్కలు