ETV Bharat / opinion

అసమానతల గుప్పిట వైద్యం విలవిల - april 7th who

కరోనా మహమ్మారి ధాటికి సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాలు అతలాకుతలమయ్యాయి. వైద్యసేవలను సక్రమంగా పొందడంలో పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో 'అందరికీ సమన్యాయంతో కూడిన ఆరోగ్యం' అందించాలని ప్రపంచ ఆరోగ్య దినోత్సం(ఏప్రిల్​ 7) సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) పిలుపిచ్చింది. సమాజంలో నెలకొన్న ఆరోగ్య అసమానతలను, దుర్విచక్షణలను నివారించి- ప్రజలందరికీ సరైన సమయంలో నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడమే ప్రపంచ ఆరోగ్య దినోత్సవ తొలి అడుగు కావాలని నిపుణులు సూచిస్తున్నారు.

world health day
అసమానతల గుప్పిట వైద్యం విలవిల
author img

By

Published : Apr 7, 2021, 7:08 AM IST

కరోనా వైరస్‌ సృష్టించిన కల్లోలం ప్రపంచానికి ఎన్నో పాఠాలు నేర్పింది. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సమన్యాయంతో కూడిన ఆరోగ్య సమాజాన్ని నిర్మించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ప్రాంతీయ అసమానతలకు తావీయకుండా.. ఆర్థిక, లింగ, వర్గ తారతమ్యాలు లేని నిష్పాక్షికతతో కూడిన వైద్యం అందరికీ అందాలని, మనిషి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం జన్మహక్కుగా మారాల్సిన అవసరం ఉందని ఆ సంస్థ నొక్కి చెప్పింది. అసమానతలు లేని సమాజాన్ని సాధించడం కష్టసాధ్యమేమో కానీ-అందుకు గట్టిగా ప్రయత్నించడం మాత్రం అవసరం. సమాజంలో అనేకమంది వ్యాధులకు దూరంగా ఆరోగ్యకరమైన జీవితం గడుపుతున్నారు. మంచి జీవన శైలితో పాటు, వైద్యం సకాలంలో అందడం అందుకు కారణం.

స్వాస్థ్య మార్గంలో...

కరోనా వైరస్‌ వ్యాప్తితో ఆరోగ్యపరంగా ఎప్పుడూ ఎదుర్కోని ఎన్నో క్లిష్టమైన సమస్యలను సమాజం చవిచూసింది. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాలు వైరస్‌ ధాటికి అతలాకుతలమయ్యాయి. పేద ప్రజలు వైద్యసేవలను సక్రమంగా పొందడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ 'అందరికీ సమన్యాయంతో కూడిన ఆరోగ్యం' అందించాలని పిలుపిచ్చింది. సుమారు 70 ఏళ్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా ఏప్రిల్‌ ఏడో తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తోంది. ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇస్తూనే ఆయా అంశాలపై ఆరోగ్య రంగ వ్యూహకర్తలకు దిశా నిర్దేశం చేయడం, ప్రజలను స్వాస్థ్య మార్గం వైపు కార్యోన్ముఖులను చేయడం దీని ప్రధాన ఉద్దేశం. అధిక ఆదాయ వర్గాల్లో గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి. అల్పాదాయ వర్గాల్లో అవి తక్కువే కానీ... చర్మ, నేత్ర వ్యాధులు, డయేరియా వంటి సాంక్రామిక వ్యాధులు వీరిలో అధికం.

ఆరోగ్యాన్ని పొందడంలోనే కాదు...

మాతా-నవజాత శిశు మరణాలు మాత్రమే కాదు.. స్థూల మరణాల శాతం సైతం సంపద సూచీలో దిగువ ఉన్నవారిలో అధికంగా ఉన్నాయి. చిన్న పిల్లల్లో మరణాలూ ఈ వర్గాల్లోనే అధికంగా ఉన్నట్లు ఎన్నో సర్వేలు స్పష్టం చేశాయి. ఆరోగ్యాన్ని పొందడంలోనే కాదు... విద్య, ఉపాధి సదుపాయాలను వినియోగించుకునే అవకాశాలనూ సామాజిక వెనకబాటుతనం ప్రభావితం చేస్తోంది. నిరుపేద వర్గాలకు చెందినవారిలో చిన్నవయసులోనే పెళ్ళి చేయడం, అధిక సంతానం వంటివి ఎక్కువగా కనిపిస్తాయి. వారు వైద్యులను కలవడం, ఆసుపత్రులకు వెళ్ళడంవంటి సందర్భాలు చాలా తక్కువ. ప్రసూతికి ముందు, ఆ తరవాత వైద్య సేవలు- పిల్లలకు టీకాలు ఇప్పించడం వంటి సదుపాయాలను వినియోగించుకోవడమూ తక్కువే. సామాజికంగా ఉన్నత వర్గాల వారు ఆరోగ్య సదుపాయాలు అందిపుచ్చుకోవడంలో ముందున్నారు.

పేదలకు అందని వైద్యం

విద్య, వృత్తి, ఆదాయం- మనిషికి సాంఘిక, ఆర్థిక కొలమానాలుగా ఉన్నాయి. ఈ మూడూ ఆరోగ్య పరిస్థితులను సైతం ప్రభావితం చేస్తున్నాయి. అనారోగ్యంపాలైతే ఆకు పసరే శరణ్యం అనుకునే పరిస్థితుల్లో కోట్లాది పేదలు బతుకీడుస్తున్నారు. సరైన పోషకాహారం దొరకని చిన్నారులు మన దేశంలోనే అధికం. అయిదేళ్ల లోపు చిన్నారుల్లో సగం మంది పౌష్టికాహార లోపంవల్ల శారీరక పెరుగుదలకు సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిన్న వయసులో సంభవించే మరణాలకు సమతులాహార లోపమూ ఒక కారణం.

రక్షిత మంచి నీటి సరఫరా ఆరోగ్య వ్యవస్థకు మూలాధారం. కలుషిత నీటి ద్వారా వచ్చే వ్యాధుల చికిత్సకు భారత్‌ ఏటా 60 కోట్ల డాలర్లు (సుమారు రూ.4,400 కోట్లు) ఖర్చు పెడుతున్నట్లు 'యునిసెఫ్‌' అంచనా వేసింది. అనావృష్టి, వరదలు అధికంగా ఉన్న ప్రదేశాల్లో ఇది మరింత ఎక్కువ. సురక్షితమైన మంచినీరు ఇంకా 50శాతం ప్రజలకు చేరువలో లేదు. రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు ఇప్పటికీ ఫ్లోరైడ్‌ ప్రభావిత నీరే ఆధారం. ఆర్సెనిక్‌ వంటి ధాతువులవల్ల కలుషితమైన నీరు తాగి ఏటా లక్షలాది ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. యునిసెఫ్‌ పర్యవేక్షణలో ప్రభుత్వం నిర్వహిస్తున్న 'జలశక్తి అభియాన్‌' మరింత మందికి రక్షిత మంచినీరు అందించే ప్రయత్నం చేస్తోంది.

భారత్‌లో కనీస గృహవసతి లేని కుటుంబాలు అనేకం. 1.80 కోట్ల మంది వీధి బాలలున్నారు. వీరందరి ఆరోగ్య పరిరక్షణ మాట అటుంచి, వ్యాధి నివారణ మార్గాలపై సరైన పథకాలు కూడా లేవు. ఆరోగ్యకర సమాజానికి ఆహార భద్రత ఎంతో కీలకమైంది. వ్యక్తులే కాదు... సంపూర్ణ సమాజ మనుగడను, ప్రజాశ్రేయాన్ని వారి జీవనోపాధిని ఉత్పాదకతను ఆహార భద్రత ప్రభావితం చేస్తుంది. ప్రపంచమంతటా ఆహారలోపంతో వచ్చే వ్యాధులు ప్రజారోగ్యంపై తీవ్రమైన భారం మోపుతూ ప్రభుత్వాలకు పెను సవాలుగా నిలుస్తున్నాయి. ఆహార భద్రతను తప్పనిసరి ప్రజారోగ్య విధిగా గుర్తించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తోంది.

ఆయువు తీస్తున్న కాలుష్యం

భారత్‌లో ఏటా 17శాతం మరణాలకు వాయు కాలుష్యం కారణమవుతోంది. ఊపిరితిత్తులకు చెందిన వ్యాధులతో పాటు, అనేక ఇతర రుగ్మతలకూ వాయు కాలుష్యం ప్రధాన కారణం. ఆరోగ్య సదుపాయాలు అందించడంలోనూ లింగ దుర్విచక్షణ కనిపిస్తోంది. స్త్రీలకు సరైన సమయంలో సరైన చికిత్స అందివ్వడంలో సమాజం విఫలమవుతోంది. అనేక వ్యాధుల చికిత్సలో లింగ దుర్విచక్షణ ప్రస్ఫుటమవుతోంది. నివారించగలిగే వ్యాధులను సైతం ముదిరిన దశలో గుర్తించడంవల్ల పలువురి ప్రాణాలు అర్ధాంతరంగా గాలిలో కలసిపోతున్నాయి. స్త్రీల ఆరోగ్య పరిరక్షణపై కుటుంబసభ్యులకు శ్రద్ధ తగ్గుతోంది. కేవలం నగరాలకు మాత్రమే పరిమితమైన వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించాలి. కొన్ని తరాలుగా నిరాదరణకు గురవుతున్న కుటుంబాలు అనేకం ఉన్నాయి. పల్లెల్లో కనీస వైద్యం, పారిశుద్ధ్యం, విద్య-ఉపాధి లేక పెద్దయెత్తున మరణాలు సంభవిస్తున్నాయి.

అందరికీ ఆరోగ్యం అందుబాటులో ఉన్నప్పుడే

ప్రపంచమంతటా రోజువారీ కనిష్ఠ ఆదాయం, పేదరికం, అవిద్య, ఉపాధి అవకాశాల లేమి, లింగ విచక్షణ ప్రజారోగ్యాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. సురక్షితమైన వాతావరణం, స్వచ్ఛమైన నీరు, గాలి, ఆహార భద్రత, సకాలంలో అందుబాటులో ఉండే ఆరోగ్య సేవలు మన తక్షణ అవసరాలు. అకాల మరణానికి కారణమయ్యే వ్యాధిలో, జబ్బు తీవ్రత మాత్రమే కాదు... చికిత్సను అనేక ఇతర అంశాలూ ప్రభావితం చేస్తాయి. అందరికీ ఆరోగ్యం అందుబాటులో ఉన్నప్పుడే ఉన్నతమైన సమాజాన్ని నిర్మించడం సాధ్యమవుతుంది. కంటికి కూడా కనిపించని అతి సూక్ష్మమైన వైరస్‌ పెను వ్యాధి కారకమై ప్రపంచం మొత్తం అస్తవ్యస్తమయ్యే పరిస్థితులు ఏర్పడగలవనడానికి కొవిడ్‌ ప్రబల నిదర్శనం. మానవ సమాజానికి, ఆర్థిక వ్యవస్థలకు ఇది కలిగించిన నష్టం అంతాఇంతా కాదు. దీన్ని గుణపాఠంగా తీసుకుని ప్రతి ఒక్కరికీ మంచి ఆరోగ్యాన్ని అందించి, జీవన పరిస్థితులను మరింత మెరుగుపరచాల్సిన తరుణం ఆసన్నమైంది. సమాజంలో నెలకొన్న ఆరోగ్య అసమానతలను, దుర్విచక్షణలను నివారించి- ప్రజలందరికీ సరైన సమయంలో నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించాలి. ఈ ప్రస్థానంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం తొలి అడుగు కావాలి.

-డాక్టర్​ శ్రీ భూషణ్​ రాజు(రచయిత- హైదరాబాద్​ నిమ్స్​లో నెఫ్రాలజీ విభాగాధిపతి)

ఇదీ చూడండి:'పొదుపుపై అల్పాదాయ వర్గాలకు కావాలి భరోసా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.