ETV Bharat / opinion

నాయకత్వ సంక్షోభం.. దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్​ - రాహుల్​ గాంధీ

కాంగ్రెస్​లో అంతర్గత కలహాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో అత్యంత పురాతన రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ తనను తానే బలహీనపరచుకుంటున్న తీరు ప్రతిపక్ష రాజకీయాల్లో శూన్యాన్ని విస్తరిస్తోంది. ముఖ్యంగా గత ఏడాది జరిగిన ఎన్నికల తరవాత పార్టీలో మొదలైన నాయకత్వ సంక్షోభాన్ని ఇప్పటికీ పరిష్కరించుకోలేని నిస్సహాయ స్థితిలో అది కూరుకుపోయింది.

editorial or congress situation amid leadership crisis
అంతర్యుద్ధంతో దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్​
author img

By

Published : Aug 28, 2020, 6:57 AM IST

కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిణామాలు దేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉండాలని కోరుకునే అందరినీ నిరాశ పరుస్తున్నాయి. ప్రజాస్వామ్యం చక్కటి ఆరోగ్యంతో మనుగడ సాగించేందుకు బలమైన ప్రతిపక్షం చాలా అవసరం. దేశంలో అత్యంత పురాతన రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ తనను తానే బలహీనపరచుకుంటున్న తీరు ప్రతిపక్ష రాజకీయాల్లో శూన్యాన్ని విస్తరిస్తోంది. ఎందుకంటే అధికార భాజపాను వ్యతిరేకించే పార్టీల్లో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో బలం ఉన్నది ప్రస్తుతం కాంగ్రెస్‌కే. వరసగా రెండు లోక్‌సభ ఎన్నికల్లో సంభవించిన ఓటమితో దీని బలం కూడా దేశంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ముఖ్యంగా గత ఏడాది జరిగిన ఎన్నికల తరవాత పార్టీలో మొదలైన నాయకత్వ సంక్షోభాన్ని ఇప్పటికీ పరిష్కరించుకోలేని నిస్సహాయ స్థితిలో అది కూరుకుపోయింది. వారసత్వ హోదాలో పార్టీపై సర్వాధికారాలు నిర్వహిస్తున్న సోనియాగాంథీకాని, ఆమె కుమారుడు రాహుల్‌గాంథీ కాని పార్టీని నడిపే పూర్తి స్థాయి బాధ్యతలను తీసుకోవడంలేదు. మరోవైపు దానిపై తమ పెత్తనాన్ని వదులుకుని ఇతరులకు అవకాశాన్నీ ఇవ్వడంలేదు. వారు అనుసరిస్తున్న ధోరణే పార్టీకి శాపంగా మారుతోంది. సోనియా దాదాపు రెండు దశాబ్దాలు కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షురాలిగా సారథ్యం వహించి 2017లో రాహుల్‌ గాంధీకి బాధ్యతలు అప్పగించారు. 2019 ఎన్నికల్లో ఓటమి దరిమిలా రాహుల్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆమె మళ్లీ తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో అధికారం రానంత మాత్రాన పార్టీ బాధ్యతల నుంచి తప్పుకోవడాన్ని బట్టే రాహుల్‌ రాజకీయాలను పరిమితమైన దృష్టితో చూస్తున్నారని తెలుస్తోంది. పార్టీ గెలిస్తే ప్రధాని పదవిని చేపట్టడానికి సిద్ధపడ్డ నాయకుడికి... ఓడితే ప్రతిపక్ష నేత బాధ్యత చేపట్టే ఓపిక, ఆసక్తి లేకపోతే ఎలా?

వంశపారంపర్య రాజకీయాలకు పునాది

పార్టీల్లో ప్రజాస్వామ్య పరిపుష్టికి ఆటంకంగా మారి వంశపారంపర్య రాజకీయాలకు పునాది వేసింది కాంగ్రెస్‌ పార్టీయే. భాజపా, కమ్యూనిస్టులు మినహా దేశంలో అత్యధిక రాజకీయ పార్టీల్లో ఈ సంస్కృతి పాతుకుపోయింది. ఏదోఒక తరంలో సరైన నాయకత్వం ఇవ్వలేనప్పుడు వారసత్వమే పార్టీ మనుగడకు ముప్పుగా మారుతుందనే గుణపాఠాన్ని ప్రస్తుతం కాంగ్రెస్‌ను చూసి మిగతా పార్టీలన్నీ నేర్చుకోవాలి. రాహుల్‌గాంధీకి ముత్తాత అయిన జవహర్‌లాల్‌ నెహ్రూ స్వాతంత్య్రం వచ్చినప్పుటి నుంచి 15 సంవత్సరాలకుపైగా ప్రధానిగా పనిచేశారు. ఆయన దార్శనికుడు. దేశాన్ని ఎలా నడిపించాలనే విషయమై స్పష్టమైన అవగాహన కలిగిన వ్యక్తి. పటేల్‌ వంటి హేమాహేమీలనూ కలుపుకొని పరిపాలన సాగించారు. కాంగ్రెస్‌కు బలమైన రాజకీయ నాయకత్వాన్ని అందించారు. కొంతకాలం తరవాత వారసురాలిగా ప్రధాని పదవిని చేపట్టిన ఆయన కుమార్తె ఇందిరాగాంధీ ప్రజల నాడి పట్టుకుని నేర్పుగా రాజకీయాలు సాగిస్తూ, బలమైన నేతగా వ్యవహరించగలిగారు. ఆమె తన హయాంలో అత్యవసర పరిస్థితి విధించి దేశవ్యాప్తంగా లక్షకుపైగా ప్రతిపక్షనేతలు, కార్యకర్తలను జైళ్లకు పంపారు. వ్యవస్థలను దెబ్బతీశారు. పార్టీలో వ్యక్తి పూజను విపరీతంగా పెంచారు. వీటన్నింటివల్ల ఆమె హయాం నుంచే దేశంలో కాంగ్రెస్‌ వ్యతిరేక భావజాలం బలంగా వేళ్లూనుకుంది. ఇందిర వారసుడిగా అధికారంలోకి వచ్చిన రాజీవ్‌గాంధీలో నెహ్రూ రాజనీతిజ్ఞత, ఇందిర రాజకీయ చతురత కరవైనట్లు చరిత్ర చెబుతోంది. అందుకే 404 సీట్లతో 1984లో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తదుపరి ఎన్నికల్లో నిలుపుకోలేకపోయారు. షాబానో కేసులో, అయోధ్య వ్యవహారంలో ఆయన నిర్ణయాలు పార్టీకి నష్టాలనే మిగిల్చాయనే విమర్శలను మూటగట్టుకున్నారు. రాజీవ్‌ హత్యానంతరం పార్గీ సారథ్యాన్ని చేపట్టడానికి తిరస్కరించిన సోనియా ఏడేళ్ల తరవాత పార్టీ పెద్దగా కుదురుకున్నారు. తన పరిమితులను అర్థం చేసుకుని ప్రధాని పదవిని ఇతరులకు అప్పగించేందుకు సోనియా సిద్ధపడటం వల్లే కాంగ్రెస్‌కు మరికొంత కాలం గౌరవ ప్రదమైన మనుగడ సాధ్యమైంది. రాజకీయాల్లో అత్యంత అవసరమైన ‘నిలకడ’ లేకపోవడంతో ఎన్నికల్లో ఓడిపోగానే రాహుల్‌ అస్త్రసన్యాసం చేశారు. ఒకవైపు భాజపాకు నరేంద్రమోదీ, అమిత్‌ షా వంటి రాటుతేలిన నాయకులు నాయకత్వం వహిస్తూ ప్రతిక్షణం తమ పార్టీ విస్తరణపై దృష్టిపెట్టి నిర్విరామంగా పని చేస్తుంటే- బలమైన నాయకత్వం లేకుండా కాంగ్రెస్‌ దానిపై పోరాటం చేయడం సాధ్యమేనా?

నాయకుడి నిరాసక్తత

రాహుల్‌ రాజకీయంగా తన స్థాయిని పెంచుకునేందుకు ఉన్న అవకాశాలనూ ఉపయోగించుకోలేదని అర్థమవుతోంది. కాంగ్రెస్‌ 2004నుంచి పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏదైనా కీలక మంత్రి పదవిని చేపట్టి తన సామర్థ్యాన్ని ప్రదర్శించాల్సింది. 2014లో పార్టీ అధికారం కోల్పోయాక లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేతగా బాధ్యతలు చేపట్టాలని సీనియర్లు అడిగితే ఆయన నిరాకరించారు. 2014 నుంచి అయిదేళ్లపాటు లోక్‌సభలో చురుకైన పాత్రను పోషించే ఆసక్తినీ చూపలేదు. సభకు హాజరు 51 శాతమే. ప్రశ్నోత్తరాల సమయంలో ఒక్క ప్రశ్ననూ అడగలేదు. కేవలం 12 సందర్భాల్లోనే చర్చలో పాల్గొన్నారు. గుజరాత్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల సమయాల్లో మాత్రమే రాహుల్‌ గట్టిగా పోరాడారనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించగలిగారు. లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి షరా మామూలే. భాజపా వ్యూహాలకు దీటుగా వ్యవహరించలేకపోయారు. భాజపా రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా నిలువగలిగిన తాత్వికతను, చైతన్యాన్ని పార్టీలో నింపలేకపోయారు. అందుకే కనీసం గౌరవప్రదమైన ఓటమినీ పార్టీకి దక్కించలేకపోయారు. పరాజయాన్ని సరైన స్ఫూర్తితో తీసుకోకుండా పార్టీ బాధ్యతలు వదిలేశారు. పార్టీకి ఎలాంటి పరిస్థితి ఎదురవుతున్నా సరే, అధికారికంగా పూర్తి బాధ్యత తీసుకుని దాన్ని నడపడం సాధ్యం కాదంటున్న తల్లీకుమారులు కుర్చీని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. వీరిద్దరికి తోడు రాహుల్‌ సోదరి ప్రియాంక కూడా పార్టీ వ్యవహారాల్లో ప్రమేయం కల్పించుకుంటూనే ఉన్నారు. ఇలా ‘గాంథీ’ కుటుంబ సభ్యులు పార్టీని అగమ్యగోచర స్థితికి నెట్టివేశారు. నిజానికి భారత్‌ వంటి విభిన్న సంస్కృతులున్న విశాల దేశంలో అధికార రాజకీయాలతోపాటు ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఎప్పుడూ అవకాశం ఉంటుంది. దాన్ని ఉపయోగించుకోవాలంటే ప్రతిపక్షానికి సిద్ధాంత పరిపుష్టి అవసరం. పార్టీని నడిపేందుకు తగిన శక్తిసామర్థ్యాలు, నిరంతర పోరాట స్ఫూర్తి కలిగిన నాయకత్వం కీలకం. అవి లోపించబట్టే కాంగ్రెస్‌ ప్రస్తుత దుస్థితికి చేరింది. నాయకత్వ లేమిని ‘గాంధీ’ కుటుంబం పూడ్చటం కష్టమని ఇప్పటికే అర్థమైంది. సమర్థులైన ఇతరులెవరైనా పార్టీని నడిపేందుకు ఆ కుటుంబం అవకాశాన్ని ఎందుకివ్వకూడదు? మనం ఉన్నది రాచరికంలో కాదు. ప్రజాస్వామ్యంలో కదా!

లేఖలోని అంశాలపై స్పందన ఏదీ?

కాంగ్రెస్‌కు యువత దూరమవుతున్నదని, పార్టీకి క్రియాశీల నాయకత్వం అవసరమని పేర్కొంటూ 23 మంది కాంగ్రెస్‌ నేతలు సోనియాకు రాసిన లేఖలోని అంశాలు వాస్తవం. వారు ఎత్తి చూసిన లోపాలను సవరించే స్పందన ప్రస్తుత ‘గాంధీ’ కుటుంబంలో కనిపించడం లేదు. లేఖపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ చర్చ ద్వారా ఏదైనా సానుకూల మార్పు రావచ్చని భావించినవారికి నిరాశే మిగిలింది. సంక్షోభాన్ని యథాతథంగా మరికొంత కాలం పొడిగించడమే ఈ సమావేశం సాధించగలిగింది. నిజానికి గత్యంతరం లేని పరిస్థితిలోనే సోనియా గత ఏడాది తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ప్రజల్లో తిరుగుతూ వారిని సమీకరించే శక్తి ఆమెకు లేదు. ఆరోగ్యమూ బాగుండటం లేదు. కుమారుడు తప్పుకోవడంతో కుటుంబ ప్రాబల్యాన్ని కాపాడేందుకే ఆమె రంగంలో ఉన్నారు.

- ఎన్‌.విశ్వప్రసాద్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.