ETV Bharat / opinion

కరోనా వేళ ఛిద్రమైన లఘు సంస్థలు.. గట్టెక్కేనా? - MSME loan scheme 2020

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 6.3కోట్ల ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు ఉన్నాయి. ఈ లఘు సంస్థల ద్వారా దాదాపు 11కోట్ల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఎగుమతుల్లోనూ 40శాతం వాటా వాటిదే. స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 30శాతం లఘు పరిశ్రమలదే ప్రాతినిధ్యం. దేశార్థికంలో అంతటి కీలక భూమిక పోషిస్తున్న సంస్థలు.. కరోనా వేళ కుదేలయ్యాయి. భారీ ఆర్థిక గ్రాంటు కోసం కేంద్రాన్ని వేడుకుంటున్నాయి.

Editorial on micro small and medium enterprises
ఛిద్రమైన లఘు సంస్థలు
author img

By

Published : Jun 19, 2021, 8:39 AM IST

కొన్నేళ్లుగా వరస కడగండ్లతో కిందుమీదులవుతున్న లఘు పరిశ్రమలు నిరుటి కరోనా పిడుగుపాటుతో సాంతం చతికిలపడ్డాయి. మహమ్మారి వైరస్‌ ధాటికి పెను ఇక్కట్ల పాలబడిన దేశాన్ని 'ఆత్మనిర్భర్‌ భారత్‌'గా తీర్చిదిద్దే క్రమంలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లను స్థిమితపరుస్తామంటూ గత సంవత్సరం కేంద్రం చేసిన ప్రకటన ఎన్నో ఆశలను మోసులెత్తించింది.

నాటి ప్రత్యేక ప్యాకేజీకి అనేక పరిమితులున్నాయని కేంద్ర ఆర్థికమంత్రికి రాసిన తాజా లేఖలో ప్రస్తావించిన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌, మరికొన్ని కీలకాంశాల్నీ లేవనెత్తారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు అక్కరకు రాని సహాయ ప్యాకేజీ తీరుతెన్నుల్ని సాకల్యంగా సమీక్షించాలన్నది సహేతుకమైన డిమాండు. కరోనా ఖడ్గ ప్రహారాలకు కకావికలమై రెక్కలు తెగిన పక్షుల్లా విలవిల్లాడుతున్న చిన్న సంస్థలు నిలదొక్కుకునేందుకు దోహదపడేలా భారీ ఆర్థిక గ్రాంటు ప్రసాదించాలన్నది మేలిమి సూచన.

80 శాతానికిపైగా..

లాక్‌డౌన్‌ వేళ తెలంగాణలో 80శాతానికి పైగా లఘు పరిశ్రమలు తీవ్ర ఇక్కట్ల పాలయ్యాయని, నాలుగోవంతు ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు రాబడుల్ని పూర్తిగా నష్టపోయాయనడం ద్వారా సంక్షుభిత స్థితిగతులకు కేటీఆర్‌ అద్దంపట్టారు. ఇది దేశంలోని ఏ ఒక్క రాష్ట్రానికో ప్రాంతానికో పరిమితమైన సమస్య కాదు. ప్రభుత్వ తక్షణ సాయం అందని పక్షంలో మహారాష్ట్రలోని సుమారు రెండు లక్షల చిరు సంస్థలు పూర్తిగా మూతపడే ముప్పును ఎదుర్కొంటున్నాయి. తమిళనాట 80శాతానికి పైగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు 'కావవే వరదా!' అంటూ కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి.

ఘనత వాటిదే..

దేశవ్యాప్తంగా సగానికి పైగా చిన్న సంస్థలది అదే దురవస్థగా ఇటీవలి అధ్యయన నివేదిక ధ్రువీకరించిన దృష్ట్యా, కేంద్రం తక్షణమే స్పందించి ఉనికి కోసం ఆరాటపడుతున్నవాటికి ప్రాణవాయువు అందించాలి! వివిధ ఉత్పాదనలకు మారుపేరై, పరిమిత పెట్టుబడులతో విస్తృత ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, దేశార్థికానికి ఊపిరులూదుతున్న ఘనత లఘు పరిశ్రమలది. దేశవ్యాప్తంగా నెలకొన్న 6.3కోట్ల మేర ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు 11కోట్ల దాకా ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నాయి. ఎగుమతుల పద్దులో 40శాతం వాటా వాటిదే. స్థూల దేశీయోత్పత్తిలో రమారమి 30శాతం దాకా లఘు పరిశ్రమలదే ప్రాతినిధ్యం. దేశార్థికంలో అంతటి కీలక భూమిక పోషిస్తున్నా- సిబ్బంది జీతాల్ని సైతం చెల్లించలేని దీనస్థితి దాపురించింది. రుణపరిమితిలో 50శాతం వరకు షరతులేమీ లేకుండా ఇవ్వాలన్న అభ్యర్థన అరణ్యరోదనమైంది. యూనిట్లు మూతపడిన కాలానికి విద్యుత్‌ ఛార్జీలు మాఫీ చేయాలని వేడుకున్నా, పట్టించుకున్న నాథుడు లేడు. మార్కెటింగ్‌ పరిస్థితులు అనుకూలించక ఉత్పత్తిని కుదించుకోవాల్సిన అనివార్యత ఎన్నో చిన్న సంస్థల్ని కోలుకోలేని దెబ్బ తీసింది. కొల్లేటరల్‌ సెక్యూరిటీతో నిమిత్తం లేకుండా అదనపు రుణం మంజూరు చేయాలన్న కేంద్రం ఆదేశాలు వాస్తవిక కార్యాచరణలో కొల్లబోయాయి.

భారీయెత్తున ప్రయోజనదాయకమంటూ ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన చర్యలు రుజాగ్రస్త లఘు పరిశ్రమల్ని ఆదుకోవడంలో విఫలమయ్యాయని ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ సంఘాలు లోగడే తూర్పారపట్టాయి. ప్రత్యేక ప్యాకేజీ ఫలితాలు ప్రస్ఫుటమయ్యేంత వరకు నిరీక్షించాలన్న పెడవాదనలు కట్టిపెట్టి- ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు, వాటినుంచి విడిభాగాల సరఫరా కుంగి ఉత్పత్తి ప్రణాళికల్ని తెగ్గోసిన పరిశ్రమలు సైతం తిరిగి కుదుటపడే వాతావరణ పరికల్పనపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి.

రుణవసతి కొరత

వాస్తవిక అవసరాల ప్రాతిపదికన ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల రంగం ఎకాయెకి రూ.17.75 లక్షల కోట్ల రుణవసతి కొరతతో సతమతమవుతున్నదని ఏసీసీఏ(ఛార్టర్డ్‌ ఎకౌంటెంట్ల సంఘం) నివేదిక నిగ్గు తేల్చింది. తయారీ రంగాన భారత్‌ అమేయ పురోగతే లక్ష్యమన్న ప్రధాని మోదీ మాట నిజం కావాలంటే, అన్నిందాలా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల సముద్ధరణే అనుసరణీయ మార్గం. అందుకు ప్రభుత్వ కట్టుబాటే ఆత్మనిర్భర్‌ భారత్‌ను ఆవిష్కరించగలిగేది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.