మహమ్మారి కరోనా విషయంలో దూరదృష్టి కొరవడి ముందస్తు జాగ్రత్తలు తీసుకోని నేరానికి అమెరికా చెల్లిస్తున్న మూల్యం ఇప్పటికి దాదాపు పది లక్షల కేసులు, 55 వేల పైచిలుకు మరణాలు. ముప్పు తీవ్రతను ముందే పసిగట్టి 40 రోజుల లాక్‌డౌన్ ద్వారా 130 కోట్ల జనావళిని ఎక్కడికక్కడ దిగ్బంధించబట్టే ఇండియాలో కొవిడ్ అదుపులో ఉందనడంలో సందేహం లేదు.
అత్యవసర సేవలు తప్ప సమస్తం స్తంభించిపోవడం వల్ల రెక్కాడితేగాని డొక్కాడని వలస కూలీల బతుకు చిత్రం ఛిద్రమైంది. సొంతూళ్లను, నా అన్నవాళ్లను వదిలి ఉపాధివేటలో వేరే రాష్ట్రాలకు వలసపోయిన లక్షలాది బడుగు జీవులు- కాలినడకన పోదామన్నా ఊళ్లకు చేరలేక, జీవనాధారం కొరవడిన ఆత్మీయుల దుస్థితికి తాళలేక అనుభవిస్తున్న మూగవేదన గుండెల్ని మెలిపెడుతోంది.
కేంద్ర మార్గదర్శకాలకు లోబడి..
లాక్‌డౌన్ ప్రకటించిన కొత్తలో వలస కూలీల్ని స్వరాష్ట్రాలకు రప్పించి సొంత ఊళ్లకు పంపించడానికి యూపీ, బిహార్, రాజస్థాన్ ప్రభుత్వాలు విస్తృతంగా బస్సులు నడిపాయి. ఎక్కడివారు అక్కడే ఉండాలన్న కేంద్రం మార్గదర్శకాల్ని మన్నించి వలస కూలీల చేరవేతపై మిన్నకున్న రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ముగింపు గడువు సమీపిస్తుండటం వల్ల- తమవాళ్లను వెనక్కి తెచ్చేసుకొంటామంటున్నాయి.
నాందేడ్‌లో చిక్కుకుపోయిన 3,800మంది సిక్కు యాత్రికుల్ని స్వస్థలాలకు చేర్చడానికి కేంద్ర హోంమంత్రిత్వశాఖ తాజాగా అనుమతించింది. ఈ నేపథ్యంలో- యూపీ, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన 3.5 లక్షల మంది వలస శ్రామికుల్ని ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని మహారాష్ట్ర ప్రకటించింది.
కొత్త సంక్షోభం..
తమ రాష్ట్రాల నుంచి వలసపోయినవారిని తిరిగి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తామని యూపీ, మధ్యప్రదేశ్ భరోసా ఇచ్చాయి. కొవిడ్ ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో వలస కూలీల్ని తిరిగి రప్పించడమన్నది కొత్త సంక్షోభానికి అంటుకట్టే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు తోసిపుచ్చలేనివి. వలస శ్రామికుల విషాదాన్ని జాతీయ సమస్యగా గుర్తించి సమగ్ర పరిష్కారాన్ని అన్వేషించాలి!
ఆకలి మహమ్మారి..
భారత్ వ్యాప్తంగా 4 కోట్లమంది వలస శ్రామికులు ఉన్నారని, లాక్‌డౌన్ వారిపై తీవ్ర దుష్ప్రభావం చూపిందని నాలుగు రోజుల క్రితం ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. కాయకష్టం చేసి వాళ్లు ఇళ్లకు పంపే సొమ్ము ఏటా లక్షన్నర కోట్ల రూపాయలని 2016-17 నాటి ఆర్థిక సర్వే చెబుతోంది. వలస కూలీల్ని ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా- కరోనాతో కాదు, ఆకలితో చనిపోయేట్లున్నామన్న అభాగ్యుల ఆవేదన... క్షేత్రస్థాయి దుర్భర వాస్తవాలకే అద్దం పడుతోంది.
ఎక్కడి గొంగడి అక్కడే..
ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా అసంఘటిత రంగంలోని శ్రామికులందరి వివరాలూ సేకరించదలచిన కేంద్రప్రభుత్వం- నగదు బదిలీతోపాటు వారికి ఇతర ప్రయోజనాలూ దక్కేలా చూడాలనుకుంటోంది. శిబిరాల్లో తలదాచుకుంటున్న 22 లక్షల మంది వలస కూలీల సమగ్ర వివరాలు సేకరించి, వారి నైపుణ్యాల్ని గుర్తించి సమీపంలోని పరిశ్రమలకు అనుసంధానించడం ద్వారా ఉపాధికి భరోసా ఇవ్వాలని కేంద్రం సంకల్పించింది.
తీరా సేకరించిన వివరాల్లో వృత్తి నైపుణ్యాల సమాచారం లేకపోవడం వల్ల ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఈ పరిస్థితుల్లో తిరిగి రాదలచిన ప్రతి వలస కూలీ విధిగా వెబ్‌పోర్టల్ ద్వారా పేరు నమోదు చేసుకోవాలని, ఆ తతంగం పూర్తి అయ్యాక ఎప్పుడు ఎవరు ఎలా రావాలన్నది నిర్ధారిస్తామని ఒడిశా చెబుతోంది.
క్వారంటైన్ అయ్యాకే..
వచ్చే కొన్ని వారాల్లో 15 లక్షల మంది వలస కూలీలకు ఉపాధిపై దృష్టి సారించాలని యూపీ ఇప్పటికే నిర్దేశించింది. తిరుగు ప్రయాణ సమయంలో కొవిడ్ పరీక్ష జరిపి, స్వరాష్ట్రం చేరాక 14 రోజుల క్వారంటైన్ అయ్యాకే వలస కూలీల్ని ఇళ్లకు చేర్చాలన్నది ఆయా రాష్ట్రాల మనోగతం. దానిపై పకడ్బందీ జాతీయ వ్యూహం అత్యవసరం!