ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల వల్ల ఏర్పడిందే ప్రజాస్వామ్యం. ఇందులో ప్రజలే దేవుళ్లు. తమ భవితను తీర్చిదిద్దుకోవడానికి ఓటే ప్రజలకు బలమైన సాధనం. తమను పాలించడం కోసం నిర్దిష్టకాలానికి తమ నుంచే కొందరిని ప్రతినిధులుగా వయోజనులైన ఓటర్లు ఎన్నుకొంటారు. ఎన్నికల ప్రక్రియలో ఓటర్లు పూర్తిస్థాయిలో పాలుపంచుకోకపోవడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థకు వెన్నెముక వంటి ఓటుహక్కు స్ఫూర్తే నీరోడుతోంది. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సెలవు ప్రకటించి మరీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా- ఎన్నికల కేంద్రం వైపు వెళ్ళడానికి చాలా మంది ఆసక్తి కనబరచడంలేదు. ఫలితంగా చాలా తక్కువ పోలింగ్ నమోదవుతోంది. ప్రజాస్వామ్యమే అపహాస్యానికి గురవుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇంటి నుంచే ఓటు వేసేలా ఈ-ఓటింగ్ విధానంపై కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లో నిర్దేశిత యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఉన్నచోటు నుంచే ఓటుహక్కును వినియోగించుకోవచ్చు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం, ఐటీ శాఖ, కేంద్ర ఐటీ విభాగం, సీడాక్, బొంబాయి, భిలాయ్ ఐఐటీ ఆచార్యుల నేతృత్వంలో ప్రత్యేక యాప్ రూపొందింది. తాజాగా ఖమ్మం నగరంలో ఈ ఓటింగ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రయోగాత్మకంగా పరిశీలించింది. 55శాతానికి పైగా ఓటర్లు నమూనా ఓటుహక్కును వినియోగించుకున్నారు.
ఇటీవల సాక్షాత్తు పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ ఉప ఎన్నికలో పోలింగ్ 60శాతం దాటలేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లోనూ చివరి రెండు పర్యాయాలూ ఇటువంటి పరిస్థితే నెలకొంది. కొవిడ్ మహమ్మారి భయం కారణంగా గత ఏడాదిన్నరగా జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు జంకారని అనుకున్నా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో 67శాతమే పోలింగ్ నమోదైంది. అంతకు ముందు ఏడాది తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో, రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇటువంటి దృశ్యాలే కనిపించాయి. బాగా చదువుకుని పట్టణాలు, నగరాల్లో ఉన్నతోద్యోగాలు చేస్తున్నవారు ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో విముఖత ప్రదర్శిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ ఎన్నికలను బట్టి అర్థమవుతుంది.
ఎన్నికల్లో చోటుచేసుకుంటున్న మద్యం, అక్రమ ధన ప్రవాహాలు, ఎన్నికల తరవాత ఆయా పక్షాల నేతల కప్పదాట్లు వంటి వాటి పట్ల విసుగుచెంది చాలామంది పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు వెయ్యడానికి ఆసక్తి కనబరచడంలేదు. దేశ భవిష్యత్తు ఓటుహక్కుతోనే ముడివడి ఉందన్నది కాదనలేని సత్యం. పూర్తిస్థాయి పోలింగ్ నమోదు కాకపోవడంతో చాలా చోట్ల అరకొర జనామోదంతో గెలిచినవారే గద్దెలెక్కి విధాన నిర్ణేతలుగా మారుతున్నారు. ఎన్నికల్లో ఇబ్బడిముబ్బడిగా ధన ప్రవాహాన్ని ఉరకలెత్తించిన వారికి ఇది ప్రయోజనకరంగా మారుతోంది. ఈ తరుణంలో ఈ-ఓటింగ్ విధానం చాలా ప్రయోజనకరంగా నిలవనుందని విశ్లేషకులు చెబుతున్నారు. కొవిడ్ వంటి ఉత్పాతాల సమయంలో ఎన్నికలను వాయిదావేయకుండా అనుకున్న సమయానికి నిర్వహించడానికి ఇది తోడ్పడుతుందని పేర్కొంటున్నారు. దీనివల్ల దేశంలో ఏ మూలన ఉన్నా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆస్కారం లభిస్తుంది. నకిలీలకు ఆస్కారం లేకుండా ఓటరు ఫొటోను విశ్లేషించే పరిజ్ఞానం ఇందులో దాగుంది. ఇందులోని బ్లాక్‌చైన్ సాంకేతికత అత్యంత పటిష్ఠమైందని, వివరాలను మార్చడం అసాధ్యమని అంటున్నారు. ఫోన్‌ను హ్యాక్ చేయడానికీ ఆస్కారం ఉండదంటున్నారు.
స్థిరాస్తి, క్రిప్టోకరెన్సీ, బ్యాంకింగ్ వంటి చాలా రంగాల్లో బ్లాక్‌చైన్ సాంకేతికత ఇప్పటికే వినియోగంలో ఉంది. ఎస్తోనియా, సియర్రాలియోన్ వంటి దేశాలు ఈ విధానంలో ఎన్నికలు జరిపాయి. అమెరికాలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు గతేడాది అధ్యక్ష ఎన్నికల్లో యూటా కౌంటీలో దీన్ని వినియోగించారు. రష్యా, దక్షిణ కొరియా, జపాన్ సైతం ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరిశీలించాయి. ఈ-ఓటింగ్ విధానంలో ఎన్నికల ప్రక్రియ, లెక్కింపు వంటివన్నీ సులభతరం అవుతాయని, టాంపరింగ్‌కు ఎంతమాత్రం అవకాశం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో సైబర్ దాడులు అధికమవుతున్న తరుణంలో బ్లాక్‌చైన్ విధానంపైనా పలు సందేహాలు తలెత్తుతున్నాయి. ఓటర్ల వివరాలు హ్యాకర్లకు దొరికితే మొత్తం ప్రక్రియే అభాసుపాలవుతుంది. వారి వ్యక్తిగత సమాచార గోప్యతకు తీవ్ర భంగం వాటిల్లుతుంది. వీటికి ఆస్కారం లేకుండా కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ఠ చర్యలు తీసుకోవాలి.
భద్రతపరంగా అందరికీ భరోసా కల్పించాలి. యాప్ డౌన్‌లోడ్ నుంచి ఓటు వేసేదాకా ఎక్కడా ఎటువంటి సాంకేతిక ఆటంకాలు తలెత్తకుండా సమస్త జాగ్రత్తలూ తీసుకోవాలి. పోనుపోను పల్లెప్రాంతాలకూ దీన్ని సమర్థంగా విస్తరించాలి. అప్పుడే ఈ విధానంలో మేలిమి ఫలితాలు సాధ్యమవుతాయి.
- దివ్యాన్షశ్రీ
ఇవ చదవండి: