సంప్రదాయ సమర వ్యూహాలకు కాలం చెల్లిందని, భవిష్యత్తు యుద్ధతంత్రాల్లో డ్రోన్లే ప్రధాన ఆయుధాలని భారత సైన్యాధిపతి ఎంఎం నరవణే చేసిన హెచ్చరిక నాలుగు నెలల్లోనే నిజమైంది! జమ్మూలోని వాయుసేన స్థావరంపై ఆదివారం వేకువజామున జరిగిన డ్రోన్ దాడి- అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ఏర్పాటులో ఇండియా వెనకబాటుతనాన్ని వెక్కిరించింది! ఎంఐ17 హెలికాప్టర్లే లక్ష్యంగా లష్కరే తొయిబా ముష్కరులు ఈ దాడికి తెగబడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాడార్ల కన్నుగప్పి దూసుకొచ్చిన రెండు చిన్న డ్రోన్లు ప్రస్తుతానికి పెద్ద ప్రమాదమేమీ కలిగించకపోయినా- ఉగ్రవాద భూతానికి మొలుచుకొచ్చిన కొత్త కోరల వాడిని కళ్లకుకట్టాయి. డ్రోన్లతో దేశ భద్రతకు పొంచి ఉన్న ముప్పును కాచుకోవడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని రెండేళ్ల క్రితం లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏడాది కిందట అదే సభలో అవే మాటలను అక్షరం పొల్లుపోకుండా వల్లెవేసింది. ఆ సన్నద్ధత అంతా కాగితాలపై ప్రకటనలకే పరిమితమైందన్న దిగ్భ్రాంతకర వాస్తవం భారత గడ్డపై చోటుచేసుకున్న మొట్టమొదటి డ్రోన్ దాడితో తేటతెల్లమైంది. రాడార్ల డేగచూపులకు చిక్కకుండా సరిహద్దులు దాటి వచ్చి విధ్వంసం సృష్టించగలిగిన చిన్నపాటి డ్రోన్లను ఎదుర్కోవడంలో ఇండియా సామర్థ్యాన్ని పరీక్షించడమే ఉగ్రవాదుల ప్రయత్నమన్నది విశ్రాంత ఎయిర్ వైస్‌మార్షల్ సునీల్ నానోద్కర్ విశ్లేషణ!
వ్యవస్థలోని లోపాలు బట్టబయలు..
భారత గగనతల రక్షణ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ, వచ్చినంత రహస్యంగానే సురక్షితంగా మరలిపోయిన ఉగ్రడ్రోన్ల శక్తిసామర్థ్యాలే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. యాంటీ డ్రోన్ పరిజ్ఞానాన్ని డీఆర్‌డీఓ నిరుడే అభివృద్ధి చేసినా, ప్రధాని మోదీ భద్రతకు దాన్ని నియోగించినా- కీలక స్థావరాలు, సరిహద్దుల్లో మోహరించలేని అశక్తతకు అసలు కారణాలేమిటో అంతుపట్టడం లేదు! ప్రమాదకర డ్రోన్ల పీచమణచే ఇజ్రేలీ 'స్మాష్-2000 ప్లస్' సాంకేతికతను సకాలంలో అందిపుచ్చుకోవడమూ సాధ్యపడటం లేదు. దేశరక్షణకు అత్యవసరమైన ఆయుధ సంపత్తి సమీకరణలో ఆలస్యం ఆత్మహత్యా సదృశమనే విషయాన్ని ఏలికలు విస్మరించడమే- ఉగ్రవాదుల తాజా బరితెగింపునకు ఉత్ప్రేరకమైంది!
ముందంజలో ఇతర దేశాలు...
మానవరహిత వైమానిక వాహనాలు(యూఏవీలు), డ్రోన్ల ద్వారా శత్రువులను మట్టుపెట్టడంలో అమెరికా, యూకే, ఇజ్రాయెల్‌లు దశాబ్దం క్రితమే రాటుతేలిపోయాయి. ఈ పదేళ్లలో ఒక్క అమెరికాయే వివిధ దేశాల్లో 14 వేలకు పైగా దాడులతో దాదాపు 17 వేల మందిని హతమార్చింది. ఆరేళ్ల కిందట ఉత్తర వజిరిస్థాన్‌లోని షావాల్ లోయలో ఓ ఉగ్రవాదిని మట్టుపెట్టడం ద్వారా పాకిస్థాన్ సైతం ఈ పరిజ్ఞానాన్ని చేజిక్కించుకుంది. ఆ తరవాత మూడు డజన్లకు పైగా దేశాలు డ్రోన్లను హంతక విహంగాలుగా వినియోగించడంలో ఆరితేరాయి. ఆర్మేనియా సేనలపై అజర్‌బైజాన్ దళాలు, సిరియా అంతర్యుద్ధంలో టర్కీ సైన్యాలు వీటిని విరివిగా ఉపయోగించాయి. రక్తపింజరి ఐసిస్ చెంతకు సైతం చేరిన ఈ సాంకేతికతతో వందల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రెండేళ్ల క్రితం సౌదీ అరేబియా కీలక చమురు రిఫైనరీలపై పది డ్రోన్లతో విరుచుకుపడిన హౌతీ తిరుగుబాటువర్గాలు అంతులేని నష్టాన్నే కలిగించాయి.
దెబ్బతీసేందుకు కొత్తతంత్రం..
పంజాబ్, జమ్మూకశ్మీర్‌లలో మాటువేసిన ఉగ్రవాద తండాలకు డ్రోన్ల ద్వారానే పాకిస్థాన్ కొన్నేళ్లుగా ఆయుధాలు, మాదక ద్రవ్యాలను చేరవేస్తోంది. గగనతలాన్ని దుర్భేద్యం చేసుకోవడంలో ఎంత జాగు చేస్తే అంత మూల్యం చెల్లించాల్సి వస్తుందంటున్న రక్షణ రంగ నిపుణులు- డ్రోన్లతో సైనిక స్థావరాలకే కాదు, ఆయిల్ రిఫైనరీల వంటి కీలక పౌర నిర్మాణాలకూ ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లో సామరస్య వాతావరణం కోసం భారత ప్రభుత్వం ప్రయత్నించినప్పుడల్లా ఉగ్రవాద దుశ్చర్యలతో బదులివ్వడం దాయాది దేశానికి అలవాటుగా మారింది! ఈ కుతంత్రాన్ని ఛేదించి కశ్మీర్ లోయలో శాంతికపోతాన్ని ఎగరేయడమెంత అవసరమో- దేశానికి ప్రాణావసరాలైన రక్షణ వ్యవస్థలను సత్వరం సమకూర్చుకోవడమూ అంతే కీలకం!
ఇదీ చూడండి: డ్రోన్ల దాడిపై విచారణ- ఆర్డీఎక్స్ వాడారా?