ETV Bharat / opinion

సంరక్షణతోనే సంక్షోభానికి కళ్లెం - తాగు నీటి సమస్య

ప్రపంచవ్యాప్తంగా జల సంక్షోభం ముంచుకొస్తోంది. జీవ నదులు పొంగిపొర్లే భారత్​లోనూ నీటి కొరత తారస్థాయికి చేరింది. ఎన్నో నివేదికలు మన దేశ అధ్వాన స్థితిని చాటుతున్నాయి. అయినా మేల్కొని దిద్దుబాటు చర్యలు చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. నీటి పొదుపు, పర్యావరణ పరిరక్షణ అన్నవి మనకు సంబంధించిన అంశాలు కాదనే భావన చాలా మందిలో ఉంది. ఈ వైఖరే దేశానికి శాపంగా మారిందంటున్నారు నిపుణులు.

Drinking water problem in India
సంరక్షణతోనే సంక్షోభానికి కళ్లెం
author img

By

Published : Mar 22, 2021, 7:59 AM IST

ఉచితంగా దొరికే గాలి, నీరు వంటి సహజ వనరులు ఎంతో విలువైనవి. తీవ్ర కొరత లేదా అంతర్ధాన దశ ఏర్పడితే తప్ప- వాటి గురించి ప్రజలుగానీ, పాలకులుగానీ పట్టించుకోరు. ప్రపంచవ్యాప్తంగా జల సంక్షోభం ముంచుకొస్తోంది. అయినా మేల్కొని దిద్దుబాటు చర్యలు చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. నీటి పొదుపు, పర్యావరణ పరిరక్షణ అన్నవి మనకు సంబంధించిన అంశాలు కాదనే భావన చాలా మందిలో ఉంది. ఈ వైఖరే దేశానికి శాపంగా మారింది. ఏటికేడు కాలుష్యం, భూతాపం పెనుభూతాలై ప్రపంచాన్ని కబళిస్తున్నాయి. ముఖ్యంగా తాగునీటి సంక్షోభం అన్ని దేశాలనూ పీడిస్తోంది. వానలు, వరదల సమయంలో అపార జలరాశిని వృథాగా వదిలేసి.. ఆనక బొట్టు నీటికోసం పల్లె, పట్టణ జనం పరితపిస్తోంది.

జీవ నదులు పొంగిపొర్లే భారత్​లో నీటి కొరత తారస్థాయికి చేరింది. ఎన్నో నివేదికలు మన దేశ అధ్వాన స్థితిని చాటుతున్నాయి. తాజా నీటి వాడకంలో మనదే అగ్రస్థానం. భూగర్భ జలాల వాడకంలో మనమే ముందున్నాం. ప్రపంచ వ్యాప్తంగా నీటి కొరతతో అల్లాడుతున్న ప్రజల్లో 30శాతం ఇక్కడే ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల పథకాల పేరుతో వేల కోట్లు ఖర్చుపెడుతున్నా నేటికీ సురక్షిత జలం అందని ఆవాసాలు కోకొల్లలు. పైగా ఇంటికే సరఫరా చేసే రక్షిత మంచి నీటిలో నాణ్యతకు సరైన పూచీ లేదు.

భవిష్యత్‌ భయానకమే!

ప్రపంచ నీటి వనరుల్లో నాలుగు శాతమే ఉన్న మన దేశంలో ఏటా నీటి అవసరాలు భారీగా పెరిగిపోతున్నాయి. పెరిగే జనాభా, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాల రీత్యా కొరత తీవ్ర రూపందాల్చింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అంచనా ప్రకారం 2030 నాటికి లక్షా యాభై వేల కోట్ల ఘనపు మీటర్లకు నీటి డిమాండ్‌ చేరుకుంటుంది. 1951లో 5200 ఘనపు మీటర్ల మేర తలసరి నీటి లభ్యత ఉండగా.. 2011 నాటికి అది 1545 ఘనపు మీటర్లకు పతనమైంది. 2025 నాటికి వార్షిక తలసరి నీటి లభ్యత 1401 ఘనపు మీటర్లుగా ఉండవచ్చన్న అంచనాలు కలవరపరుస్తున్నాయి. ఆరోగ్య జీవనానికి ఏడాదికి 1700 ఘనపు మీటర్ల నీరు అవసరం.

మూడేళ్ల క్రితం నీతి ఆయోగ్‌ వెలువరించిన సమీకృత నీటి నిర్వహణ సూచిక దేశంలోని నీటి సంక్షోభానికి అద్దం పట్టింది. దీని ప్రకారం 60 కోట్ల మంది భారతీయులు నీటి ఎద్దడిని ఎదుర్కొంటారు. 2030 నాటికి దేశంలో నీటి వినియోగం రెండింతలు పెరగనుంది. నీటి నాణ్యత విషయంలో మనం అథమ స్థానంలో ఉన్నాం. 122 దేశాలతో కూడిన సూచికలో మన స్థానం 120. దేశంలో సరఫరా అవుతున్న నీటిలో 70 శాతం కాలుష్యకారకమే. రక్షిత మంచినీటి సదుపాయానికి నోచుకోక దేశంలో ఏటా రెండు లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. 40 శాతం తాగునీటికి మూలమైన భూగర్భ జలాలు ప్రమాదకరస్థాయిలో క్షీణిస్తున్నాయి. కరవులు సర్వసాధారణమై.. రైతులను నష్టపరుస్తున్నాయి. నీతి ఆయోగ్‌ లెక్కల ప్రకారం జీడీపీలో ఈ నష్టం వాటా ఆరు శాతం.

కరుగుతున్న హిమానీ నదాలు

దేశంలో హిమాలయాల రూపురేఖలు చెదిరిపోతున్నాయి. 40శాతం మానవాళికి కీలకమైన హిమానీ నదాలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. సింధు, గంగ, బ్రహ్మపుత్ర తదితర నదులు భూతాపానికి గురవుతున్నాయి. హిందు కుశ్‌ హిమాలయ 2019 జనవరి నివేదిక మేరకు.. ఈ శతాబ్ది చివరికి భూమి సగటు ఉష్ణోగ్రత పారిశ్రామికీకరణ పూర్వదశకంటే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ పెరిగినా మూడొంతుల మంచు కొండలు కరిగిపోతాయి. హిందు కుశ్‌ హిమాలయ ప్రాంతంలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 1.3 డిగ్రీలు అధికమయ్యాయి. 2050 నాటికి టిబెటన్‌ పీఠభూమిలో 40శాతం మంచు కొండలు కనుమరుగవుతాయని అంచనా. నివేదిక ప్రకారం.. ఈశాన్య రాష్ట్రాలపై ముప్పు అధికంగా ఉంటుంది. ప్రస్తుత భూతాప పరిస్థితులతో తూర్పు హిమానీ నదాలు 95శాతం దెబ్బతింటాయి. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల వ్యవసాయానికి హిమానీ నదులు, మంచు కొండలే కీలకం. ప్రస్తుతం కరుగుతున్న మంచు కొండలతో నీటి లభ్యత అధికంగా ఉన్నా.. దీర్ఘ కాలంలో నీటి ప్రవాహం తగ్గి, అత్యధిక నీటి లభ్యత ఉన్న ఈ ప్రాంతాన్ని నీటి కొరత లోయలుగా మార్చే పరిస్థితులు భయపెడుతున్నాయి.

వాన నీరే శరణ్యం

ఐక్యరాజ్య సమితి 1993 నుంచి ఏటా మార్చి 22న ప్రపంచ జల దినోత్సవం నిర్వహిస్తోంది. ఈ ఏడాది అంశం నీటికి విలువ ఇవ్వడం. నీటి నిల్వ, పొదుపు, వినియోగం, పరిరక్షణలో ఇప్పటికైనా మన దృక్పథం, ఆలోచనా సరళి మారాలి. నీరు ఇంకెంతమాత్రం ఉచితంగా దొరికే అపరిమితమైన సహజ వనరు కాదనే సత్యాన్ని గుర్తించాలి. ఈరోజు పొదుపు చేస్తేనే రేపు పొందగలమనే వాస్తవాన్ని గ్రహించాలి. వ్యవసాయంలో సమర్థ నీటి వినియోగాన్ని ప్రోత్సహించాలి. పారిశ్రామిక రంగంలో 80శాతం రీసైక్లింగ్‌ నీటినే వాడాలి అనే చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇళ్లు, పరిశ్రమలు, కార్యాలయాల్లో నీటి పునరుత్పాదకత, పునర్వినియోగాన్ని ప్రోత్సహించాలి. నదీజలాలను శుద్ధి చేయాలి. మురుగు కాల్వల నుంచి ప్రవహించే ప్రతి వ్యర్థ బొట్టునూ శుద్ధి చేయకుండా నదులు, నీటి వనరుల్లోకి కలవకుండా చర్యలు చేపట్టాలి. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హేతుబద్ధంగా నిధులు కేటాయించాలి.

నేలపై పడే ప్రతి వాన చినుకును ఒడిసిపట్టాలి. ఇంకుడు గుంతలు, బోర్ల రీఛార్జ్‌ ఛాంబర్లు, పంట కుంటల ద్వారా వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేయాలి. వాన నీటి సంరక్షణ, నిల్వలో మన తీరు మారాలి. వాననీటిలో 80 శాతం నిల్వ చేయడం కోసం అవసరమైన చట్టం తీసుకొస్తే మంచిది. పట్టణాలు, నగరాల్లో వర్షం నీటిని నిల్వచేసే ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరి చేయాలి. తాగు నీటి విషయంలో స్వచ్ఛత, నాణ్యతలో రాజీ పడకుండా సురక్షితమైన నీటిని అందించగలిగే ఏకైక పరిష్కారం వాన నీరు మాత్రమే. సాగు రంగంలోనూ కరవు, లవణీయతకు విరుగుడు వర్షపు నీటిని సంరక్షించుకొని వాడుకోవడమే. ఆక్రమణలకు గురై, ఆనవాళ్లు కోల్పోయిన సంప్రదాయ నీటి వనరులను పునరుద్ధరించాలి. నీటిని సైతం వస్తువు కింద జమకడుతూ న్యూయార్క్‌ స్టాక్‌మార్కెట్‌లో నమోదు చేయడాన్ని దృష్టిలో పెట్టుకొని- ఈరోజు మనం చేసే నీటి ఆదా రేపటికి నిధి అని గుర్తెరగాలి. జలం లేనిదే జీవం లేదని జనులంతా నీటి విలువ తెలుసుకొని సాగితే భవిష్యత్‌లో నీటి కష్టాలు, కొరత, జలగండాలకు చోటు ఉండదు. ఈ బాధ్యత మనందరిదీ అనుకుంటే అపార జల నిధులు మానవాళికి లభ్యమవుతాయి. శతాబ్దాల క్రితం నాటి జలకళ మళ్లీ సాకారమవుతుంది.

రచయిత- ఎం.కరుణాకర్‌ రెడ్డి (వాక్‌ ఫర్‌ వాటర్‌ వ్యవస్థాపకులు)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.