District cooperative central bank: గడచిన ఏడున్నర దశాబ్దాల్లో స్వతంత్ర భారతంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ... నిర్వహణ లోపాలతో బలహీనమవుతూ వచ్చింది. దాన్ని సరిదిద్ది ప్రాథమిక వ్యవసాయ సహకార రుణ సంఘాలను, పట్టణ సహకార బ్యాంకులను బలోపేతం చేస్తే- ఈ వ్యవస్థలు ఆర్థికాభివృద్ధికి సోపానాలు అవుతాయనడంలో సందేహం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థలో సహకార బ్యాంకింగ్ రంగం వాటా 12శాతం. సహకార సంఘాల పరిధిని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు విస్తరించినందువల్ల సమ్మిళిత ఆర్థికాభివృద్ధికి అవి అమోఘ సాధనాలుగా ఉపకరిస్తాయి. గ్రామీణ, పట్టణ సహకార రుణ సంఘాల మధ్య సమన్వయం సాధిస్తే- రుణ వితరణ, వసూళ్లలోని నష్టప్రమాదాలను సమర్థంగా నివారించవచ్చు. కాలానికి తగినట్లు పట్టణ సహకార బ్యాంకు(యూసీబీ)లూ మారుతున్నాయి. అవి కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకొని 'కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్'ను ప్రవేశపెట్టాయి. యూసీబీలు వాటి బలాన్ని సరైన పద్ధతిలో వినియోగించుకొంటే- గతంలో కోల్పోయిన ప్రజల నమ్మకాన్ని మళ్ళీ సంపాదించుకోగలుగుతాయి. ఈ దిశగా రిజర్వు బ్యాంకు మార్గదర్శక సూత్రాలనూ జారీ చేసింది. 2011-21 మధ్య కాలంలో గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో పలు పట్టణ సహకార బ్యాంకులు విఫలమయ్యాయి. చాలాచోట్ల అక్రమ ధన చలామణీకి తోడ్పడిన, చట్టాన్ని ఉల్లంఘించిన యూసీబీలకు రిజర్వు బ్యాంకు జరిమానాలు విధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చార్మినార్, కృషి, వాసవి, ప్రుడెన్షియల్ వంటి అనేక యూసీబీలు వరసగా విఫలమై ఖాతాదారులను ముంచాయి. 2019లో పీఎంసీ బ్యాంకు కుప్పకూలింది. అయితే, వైఫల్యాల నడుమ కాంతిరేఖలా విశాఖపట్నం సహకార పట్టణ బ్యాంకు పలు రాష్ట్రాల్లో 30 శాఖలతో విజయవంతంగా నడుస్తోంది.
సమూల మార్పులు అవసరం
ప్రపంచీకరణవల్ల భారత్‌కు విదేశీ బ్యాంకులు వస్తున్నాయి. జాతీయ బ్యాంకుల విలీనాలూ చోటు చేసుకోవడంతో పోటీ పెరిగింది. దీన్ని సమర్థంగా ఎదుర్కోవాలంటే పట్టణ సహకార బ్యాంకులు- గ్రామీణ రుణ సంఘాలతో చేతులు కలిపి సువ్యవస్థిత యంత్రాంగంలా తయారుకావాలి. కాలానుగుణంగా యూసీబీలలో సంస్కరణలు తీసుకురావడానికి రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ ఎన్.ఎస్.విశ్వనాథన్ అధ్యక్షతన జులై 2021న ఒక కమిటీని ఏర్పాటు చేశారు. యూసీబీలు చిన్న పరిమాణంలో ఉంటే మధ్యవర్తిత్వ రుసుములు తగ్గినా, వాటి నిర్వహణకు కావలసినంత రాబడి వస్తుందా అన్నది సందేహమేనని కమిటీ అంగీకరించింది. ప్రైవేటు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఫిన్‌టెక్ కంపెనీలతో చేతులు కలిపి యూసీబీలు సమర్థంగా నడిచే అవకాశాలను పరిశీలించాలని భావించింది. నేడు యూసీబీలను బాసెల్-3 ప్రమాణాల పరిధిలోకి, నష్టభయ ఆధారిత పర్యవేక్షణ చట్రంలోకి తెచ్చారు. కొన్ని నిరిష్ట ప్రమాణాలను పూర్తిచేసే యూసీబీలకు ఏటీఎంలను తెరవడానికీ రిజర్వు బ్యాంకు అనుమతి ఇచ్చింది. విజయవంతంగా పనిచేస్తున్న సహకార సంఘాలను యూసీబీలుగా మార్చడానికి, నిర్దిష్ట పెట్టుబడి ఉంటే కొత్త యూసీబీల స్థాపనకు మాలెగామ్ కమిటీ అనుమతి ఇచ్చింది. మొబైల్ బ్యాంకింగ్ సేవలకు యూసీబీలు సిద్ధమయ్యాయి. నీతి ఆయోగ్ అంచనా ప్రకారం, వచ్చే ఏడాది రెండున్నర లక్షల గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కాబట్టి యూసీబీలు అధునాతన సాంకేతికత సాయంతో సేవలను విస్తృతం చేయాలి. యూసీబీలకు ఛత్ర సంస్థ(అంబ్రెల్లా ఆర్గనైజేషన్-యూఓ)ను ఏర్పాటు చేయడానికి ఇటీవలి చట్టపరమైన మార్పులు, సూత్రప్రాయ అంగీకారాలు బాటలు వేశాయి. చిన్న యూసీబీలు కలిసి ఛత్ర సంస్థ కింద పనిచేస్తే ఎక్కువ లబ్ధి పొందుతాయి. యూఓలు అవసరమైనప్పుడు వీటికి పెట్టుబడి సహాయమూ అందిస్తాయి. ద్రవ్యలభ్యతకు పూచీ ఇస్తాయి. అన్ని యూసీబీలూ నవీకరణల ఫలాన్ని అందుకోగలుగుతాయి. యూసీబీలు 75శాతం రుణాలను రిజర్వు బ్యాంకు సూచించిన ప్రాధాన్య రంగాలకు ఇవ్వాలని విశ్వనాథన్ కమిటీ సూచించింది.
బీమా సదుపాయం
పీఎంసీ కుప్పకూలిన తరవాత నుంచి భారత డిపాజిట్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ప్రతి డిపాజిట్ దారుడికి అయిదు లక్షల రూపాయలవరకు పూచీకత్తు ఇస్తోంది. ఈ మేరకు పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. ఫలితంగా యూసీబీలు, జిల్లా సహకార బ్యాంకులు (డీసీసీబీలు) తమ డిపాజిట్ దారులకు భరోసా ఇవ్వగలుగుతున్నాయి. నేడు మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం, సామాజిక పింఛన్ పథకం, మొబైల్ వ్యాలట్ల కింద దేశవ్యాప్తంగా కోట్లమంది గ్రామీణ లబ్ధిదారులకు నగదు చెల్లింపులు జరుగుతున్నాయి. వారందరికీ విధిగా బ్యాంకు ఖాతా ఉండాలి. ఈ అవసరాన్ని తీర్చడానికి సహకార సంఘాలు, డీసీసీబీలు అన్ని సాంకేతిక హంగులనూ సమకూర్చుకొంటున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడమే తరువాయి. ఎలెక్ట్రానిక్ లావాదేవీలు, నగదు చెల్లింపుల రికార్డులు పక్కాగా ఉంటే పలు అవకతవకలకు కళ్లెం పడుతుంది. అధునాతన సాంకేతికత దీనికి కీలకం. గ్రామీణ, పట్టణ సహకార బ్యాంకులను సాంకేతికంగా అనుసంధానించి కోట్లాది ఖాతాదారులకు సమర్థ సేవలు అందించాలి. దీనికోసం సహకార బ్యాంకింగ్ వ్యవస్థను ప్రధాన బ్యాంకింగ్ స్రవంతిలోకి తీసుకురావడానికి సమగ్ర సంస్కరణలు చేపట్టాలి. అమూల్ మాదిరిగా విశిష్ట బ్రాండ్‌గా ఎదిగే అవకాశాన్ని సహకార బ్యాంకులు అందిపుచ్చుకోవాలి. అప్పుడే సమ్మిళిత అభివృద్ధి సాధనకు సుస్థిర సహకార బ్యాంకింగ్ చక్కని సాధనమవుతుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దాన్ని వెంటనే ఆచరణలో పెట్టాలి.
పేదరిక నిర్మూలనలోనూ..
భవిష్యత్తులో గ్రామీణ, పట్టణ సహకార బ్యాంకులు పరస్పరాధార యంత్రాంగాన్ని ఏర్పరచుకొని, ఖాతాదారులకు ఉమ్మడి సేవలు, ఉత్పత్తులు అందించడం ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందగలుగుతాయి. ఖాతాదారులకు హెచ్చు లబ్ధి చేకూర్చగలుగుతాయి. అమూల్, క్రిభ్‌కో వంటి విజయవంతమైన భారీ సహకార సంస్థలు యూసీబీలకు పెట్టుబడి, నిర్వహణ సేవలు అందించడానికి వెసులుబాటు ఉండాలి. యూసీబీలకు ఇప్పటికీ పెట్టుబడి అనేది సమస్యగా ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం 51శాతం మూలధనం సమకూరుస్తున్నప్పుడు సహకార బ్యాంకుల్లో రాష్ట్ర ప్రభుత్వాల వాటా 25శాతానికి మించరాదనే నిబంధన అర్థరహితం. సహకార బ్యాంకులో ప్రతి సభ్యుడూ పది శాతం పెట్టుబడి సమకూర్చాలి. వాణిజ్య బ్యాంకులకు అలాంటి నిబంధన లేదు. సహకార బ్యాంకులకు పెట్టుబడి కోటా పెంచడం వల్ల ప్రయోజనం ఉంటుంది. సహకార ఎక్స్చేంజీలు ఏర్పడినప్పుడు వాటి నుంచీ పెట్టుబడి సేకరించే వీలు కల్పించాలి. పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధికి సహకార బ్యాంకులను సమర్థ సాధనాలుగా ఉపయోగించాలి.
(రచయిత- డాక్టర్ బి.ఎర్రంరాజు, ఆర్థిక రంగ నిపుణులు)