ETV Bharat / opinion

వక్రిస్తున్న ఉపాధి రేఖ- సంక్షోభంలో ట్రక్కు పరిశ్రమ

author img

By

Published : Jul 9, 2021, 9:23 AM IST

కొవిడ్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్లు, కఠిన ఆంక్షలు ట్రక్కు పరిశ్రమను(Truck industry) కోలుకోలేనంతగా దెబ్బతీశాయి. లక్షల మంది ట్రక్కు డ్రైవర్లు స్వగ్రామాల బాట పట్టారు. గిరాకీ లేకపోవడం కారణంగా ట్రక్కు అద్దెలు 30 శాతం దాకా తగ్గిపోయాయి. మరోవైపు పెరిగిన డీజిల్‌ ధరలు ట్రక్కు కంపెనీల ఆర్థిక స్థితిని మరింతగా కుంగదీశాయి. ఇప్పటి వరకు ట్రక్కు పరిశ్రమ సుమారు రూ.50 వేల కోట్ల మేర నష్టపోయినట్లు తెలుస్తోంది.

Truck industry
ట్రక్కు పరిశ్రమ

దేశాభివృద్ధికి, పౌర జీవనం సజావుగా సాగడానికి సరఫరా వ్యవస్థ చాలా కీలకం. భారత్‌లో 80 శాతం సరకు రవాణా రోడ్డు మార్గం ద్వారానే సాగుతూ, సరఫరా వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తోంది. ఇందులో సింహభాగం వాటా ట్రక్కులదే. రోజూ జాతీయ, రాష్ట్ర రహదారులపై వేల కిలోమీటర్లు తిరుగుతూ నిత్యావసర సరకులు, ఔషధాలు, ఇంధనం వంటి వాటిని దేశంలోని మూల మూలలకు చేరవేస్తున్నాయి. కరోనా కారణంగా వివిధ రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్లు, కఠిన ఆంక్షలు ట్రక్కు పరిశ్రమను(Truck industry) కోలుకోలేనంతగా దెబ్బతీశాయి. కరోనా మలిదశ విజృంభణలో సుమారు నాలుగున్నర లక్షల మంది ట్రక్కు డ్రైవర్లు కరోనా బారిన పడ్డారని, దాదాపు అయిదు లక్షల మంది విధుల్ని వదిలి స్వగ్రామాల బాట పట్టారని భారత రవాణా పరిశోధన, శిక్షణ ఫౌండేషన్‌ (ఐఎఫ్‌టీఆర్‌టీ) నివేదిక వెల్లడిస్తోంది. ఇప్పటి వరకు ట్రక్కు పరిశ్రమ సుమారు రూ.50 వేల కోట్ల మేర నష్టపోయిందని అఖిల భారత మోటారు రవాణా కాంగ్రెస్‌ వెల్లడించింది.

పరిశ్రమ డీలా..

ట్రక్కు రవాణాను అధికంగా ఉపయోగించుకునే ఇ-కామర్స్‌ సంస్థలు కరోనా కారణంగా వస్తూత్పత్తి లేక కార్యకలాపాలను నిలిపివేయడం, నిత్యావసర సరకుల రవాణాకే పరిమితం కావడం వల్ల ఈ పరిశ్రమ డీలాపడింది. గిరాకీ లేకపోవడం కారణంగా ట్రక్కు అద్దెలు 30 శాతం దాకా తగ్గిపోయాయి. మరోవైపు పెరిగిన డీజిల్‌ ధరలు ట్రక్కు కంపెనీల ఆర్థిక స్థితిని మరింతగా కుంగదీశాయి. ట్రక్కు రవాణా మందగించడం వలన ఈ మార్చిలో 71 శాతంగా ఉన్న ఇ-వే బిల్లులు జూన్‌లో 33 శాతానికి పడిపోయాయని, ఆదాయం రూ.20 లక్షల కోట్ల నుంచి రూ.11 లక్షల కోట్లకు కోసుకుపోయిందని వస్తు సేవల పన్ను నెట్‌వర్క్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతర్రాష్ట్ర ఇ-వే బిల్లులూ 19 శాతానికి క్షీణించాయి. జాతీయ రహదారులపై రూ.2,270 కోట్ల మేర టోల్‌ ఆదాయం పడిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ రంగంలో రుణాల వసూళ్లూ 91.3 శాతం తగ్గిపోయాయి. వాహన విక్రయాల్లోనూ క్షీణత నమోదైంది. ట్రక్కు పరిశ్రమలో సంక్షోభం జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి ఉండే వేలాది ఆహార శాలలపై ప్రభావం చూపింది. వ్యాపారాలు సాగక పెద్దసంఖ్యలో మూతపడ్డాయి. వాటిలో పనిచేసే లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. కరోనా భయంతో స్వగ్రామాలకు మరలిన ట్రక్కు డ్రైవర్లు ఉపాధి సమస్యను ఎదుర్కోవలసి వచ్చింది. ట్రక్కు పరిశ్రమలో నెలకొన్న దారుణ పరిస్థితుల ప్రభావం సూక్ష్మ, లఘుపరిశ్రమల రంగంపైనా పడింది. ముడి సరకుల సరఫరా లేక ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పాదకత కుంటువడి అవి మూతపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా వస్తువుల సరఫరా తగ్గి ధరలు పెరుగుతున్నాయి. ఈ ధరాఘాతం సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తోంది.

ప్రత్యేక ప్యాకేజీ అవసరం..

ట్రక్కు పరిశ్రమను సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గిరాకీ లేకపోవడం వల్ల ట్రక్కు పరిశ్రమకు రుణ చెల్లింపులు భారమవుతున్నాయి. రుణాలపై ఆర్‌బీఐ మారటోరియం విధించినా అంతగా ఊరట లభించలేదు. రుణ కాలావధిని పెంచడం, వడ్డీరేట్లను తగ్గించడం వంటి చర్యలతో కొంత వరకు ఫలితం ఉంటుంది. చిన్న, మధ్య తరహా ట్రక్కు పారిశ్రామికులు ప్రైవేటు రవాణా రుణ సంస్థల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రక్కు పరిశ్రమకు ప్రత్యేకంగా ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించాలి. అందులో ప్రైవేటు రుణాల్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ట్రక్కు కంపెనీలు తక్షణ నగదు ప్రవాహ సమస్యలను అధిగమించడానికి ప్రత్యేక ఆర్థిక సహాయం గురించి ప్రభుత్వం ఆలోచించాలి. 51 శాతం దాకా పెరిగిన ఊహించని ఖర్చులు ట్రక్కు పరిశ్రమను వేధిస్తున్న మరొక సమస్య. అనుమతి రుసుముల చెల్లింపును మరో మూడు నెలలు వాయిదా వేయడం శ్రేయస్కరం. దేశంలో ట్రక్కు పరిశ్రమలో నలభై లక్షల మంది డ్రైవర్లు, రెండున్నర లక్షల మంది సహాయకులు పనిచేస్తున్నారు. ఇందులో 90 శాతం అసంఘటిత కార్మికులే. మోటారు రవాణా శ్రామికుల చట్టం కింద వీరికి కనీస వేతనాలు లభించడం లేదు. ఈ నేపథ్యంలో ట్రక్కు రవాణా కార్మికులందరికీ సామాజిక భద్రత పథకాలు వర్తింపజేయాలి. ఆరోగ్య పరీక్షలు జరిపించి, వారికి, వారి కుటుంబాలకు కరోనా టీకాలు వేయించాల్సిన అవసరం ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆహార భద్రతకు, ఉపాధి కల్పనకు జీవరేఖ వంటి రోడ్డు రవాణా వ్యవస్థ పునరుత్తేజం పొందే దిశగా చర్యలు చేపట్టడం, ట్రక్కు రవాణా కార్మికుల జీవన భద్రతకు సమధిక తోడ్పాటునందించడం ప్రభుత్వాల ముందున్న తక్షణ కర్తవ్యం.

- పుల్లూరు సుధాకర్‌
(పట్టణాభివృద్ధి వ్యవహారాల నిపుణులు)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.