కలియుగాన్ని కల్తీయుగంగా భ్రష్టుపట్టించిన కాసుల కక్కుర్తి మూకల వికృత దందాలో తాజాగా దిగ్భ్రాంతపరచే కోణం ఆవిష్కృతమవుతోంది. జాతి ఆయురారోగ్యాలను కబళించడంలో నకిలీ ముఠాల బరితెగింపు, నిఘా పర్యవేక్షణ వ్యవస్థల ప్రయోజకత్వాన్నే ప్రశ్నార్థకం చేస్తోంది. పాలు, పప్పులు మొదలు నూనెలు, మసాలాల వరకు ఎన్నింటిలోనో కల్తీలు విచ్చలవిడిగా పెచ్చరిల్లుతున్న దేశంలో వ్యవస్థాగత లోటుపాట్లను ఆ మధ్య 'కాగ్' నివేదికే తూర్పారపట్టింది.
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో చేతుల పరిశుభ్రతకు పెరిగిన ప్రాధాన్యాన్నీ ఆబగా సొమ్ము చేసుకునే ముఠాలు కొత్తగా పుట్టుకొస్తున్నాయి. శానిటైజర్ల(చేతులు శుభ్రపరచుకునే ద్రావణాల)కు గిరాకీ ఒక్కసారిగా పోటెత్తిన దృష్ట్యా- 200 మిల్లీ లీటర్ల గరిష్ఠ ధరను రూ.100గా కేంద్రం అయిదు నెలల క్రితమే నిర్ధారించింది. ఇథైల్ ఆల్కహాల్, ఐసోప్రొపైల్ ఆల్కహాల్, ఎన్‌ప్రొపైల్ ఆల్కహాల్ వినియోగించి నాణ్యమైన శానిటైజర్లు రూపొందించాలనీ మార్గదర్శకాలు వెలువడ్డాయి. కొన్నివారాల వ్యవధిలోనే నొయిడా, జమ్మూకశ్మీర్, ముంబై, వడోదరా, బెంగళూరు, హైదరాబాద్ వంటిచోట్ల నకిలీ శానిటైజర్ల తయారీ ముఠాల బాగోతాలు బట్టబయలయ్యాయి.
తీగ లాగితే డొంక కదిలింది
ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో మద్యానికి బానిసలైన సుమారు 50 మంది చౌకలో లభిస్తున్నాయన్న వెర్రితనంతో శానిటైజర్లను సేవించి మృత్యువాత పడ్డ ఘటనలు వెలుగు చూశాయి. తీగ లాగితే డొంకంతా కదిలింది. లీటరు రూ. 10-15లకే దొరికే మిథనాల్‌కు ఇతర రసాయనాలు జోడించి ఎడాపెడా నకిలీ సరకు తయారు చేయడం భాగ్యనగర శివార్లలో ఇప్పుడు కుటీర పరిశ్రమగా వర్ధిల్లుతోంది. వ్యక్తిగత పరిశుభ్రత మాట దేవుడెరుగు... వాటి వినియోగం ప్రాణాలకే పెను ముప్పన్న నిపుణుల విశ్లేషణలు- జనజీవితాలతో నకిలీ ముఠాలు ఎలా చెలగాటమాడుతున్నాయో ప్రస్ఫుటీకరిస్తున్నాయి.
చిత్తశుద్ధి లేదు
'కల్తీ నివారణకు అధికారుల్లో చిత్తశుద్ధి లేదు... వ్యాపారులకు లాభాపేక్ష తప్ప ప్రజారోగ్యం సంగతి పట్టదు' అంటూ ప్రజల జీవనహక్కును కాలరాస్తున్నదెవరో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు లోగడే సూటిగా తెలియజెప్పింది. కొవిడ్ తరుణంలోనూ అది అక్షరసత్యమని రుజువవుతోంది. శానిటైజర్లలో మిథనాల్ వాడకం కంటిచూపును హరిస్తుందని, నాడీ వ్యవస్థను కుంగదీస్తుందని, ఆయువును తోడేస్తుందన్న హెచ్చరికల్ని పెడచెవిన పెడుతున్నవాళ్లది నెత్తుటి దాహం; అందుకు లోపాయికారీగా సాయపడుతున్నవాళ్లది, సామాజిక ద్రోహం!
మరిందరి బలిదానాలు
కల్తీదారులకు చైనా, బంగ్లాదేశ్ మరణదండన విధిస్తుండగా- యూకే, బ్రెజిల్, ఫ్రాన్స్, స్పెయిన్ వంటివి ఆహార భద్రతా ప్రమాణాల నిఘా, పర్యవేక్షణల్లో సమున్నతంగా రాణిస్తున్నాయి. దేశీయంగా కల్తీల తాలూకు దుష్ప్రభావాలు పోనుపోను ఇంతలంతలవుతున్నా సరైన పకడ్బందీ దిద్దుబాటు చర్యలు కొరవడటం అక్రమార్కులకు అయాచిత వరమవుతోంది. పాలల్లో కల్తీ పసిబిడ్డల ఎదుగుదలను కర్కశంగా చిదిమేస్తుండగా- నూనెలూ తదితరాల్లో హానికారక మిశ్రమాల మిళాయింపు క్యాన్సర్లు, పేగుల్లో పుండ్లకు కారణమవుతోంది. ఇప్పుడు నకిలీ శానిటైజర్లు మరిందరి బలిదానాలకు చితులు పేరుస్తున్నాయి!
ప్రక్షాళించాలి
అఖిల భారత స్థాయిలో ప్రాధికార సంస్థ ఏర్పాటుతోనే కేంద్ర ప్రభుత్వ బాధ్యత ముగిసిపోయినట్లుంది. రాష్ట్రాల స్థాయిలో ఆయా నిబంధనల్ని ప్రమాణాల్ని కట్టుదిట్టంగా అమలుపరచాల్సిన యంత్రాంగమే కొరవడింది. కిరాతక కల్తీ మాఫియా కూసాలు కదిలేలా నిఘా తనిఖీ విభాగాల్ని సాకల్యంగా ప్రక్షాళించాలి. చట్టాలు, నిబంధనల్ని రూపొందించి చేతులు దులిపేసుకోవడం కాదు. సక్రమంగా అమలు చేస్తేనే వాటికి సార్థకత. కల్తీ ఘాతుకాలను నిర్దాక్షిణ్యంగా తుదముట్టించే సమర్థ యంత్రాంగం అవతరిస్తేనే- విచ్ఛిన్న శక్తులకు దారులు మూసుకుపోయేది!
ఇదీ చదవండి: 'ఐదు నెలల్లో కేరళ విమాన ప్రమాదంపై నివేదిక'