విశ్వవ్యాప్తంగా కోట్లమందికి అంతర్జాలం నిత్యావసరంగా మారిపోయిన దశలో, సాంకేతికత మాటున ఘరానా మోసాలు ఇంతలంతలవుతున్నాయి. దేశీయంగానూ కొన్నాళ్లుగా సైబర్ నేరాల సంఖ్య (cyber crime incidents in india) పెచ్చరిల్లుతోంది. ఆన్‌లైన్ లావాదేవీలు, చరవాణి మంతనాలతో జనాన్ని బురిడీ కొట్టించి రాబట్టిన దొంగసొత్తును దాచుకోవడానికి నయానో భయానో ఇతరుల బ్యాంకు ఖాతాల్ని సైబర్ చోరులు వినియోగించుకునేవారు. ఆ నేరగాళ్లు ఇటీవల జన్‌ధన్ ఖాతాలపైనా గురిపెట్టినట్లు కథనాలు వెలుగు చూశాయి. వాటిని వెన్నంటి, టోకున నకిలీ పత్రాలు సృష్టించే ముఠా గుట్టు తాజాగా రట్టయింది. హరియాణాకు చెందిన ముగ్గురు- వ్యక్తుల ఫొటోలు సేకరించి, వాటికి వేరేవారి ఆధార్‌కార్డులూ పత్రాల్లోని సమాచారం జతపరచి, నకిలీ ఆధార్ కార్డులు రూపొందించి, వాటి ఆధారంగా అమ్మినట్లు చూపిన సిమ్‌కార్డులను సైబర్ ముఠాలకు అందజేస్తున్నట్లు వెల్లడైంది.
నకిలీ ఆధార్‌కార్డులు, బోగస్ పాన్‌కార్డులు పుట్టించి వాటి సాయంతో తప్పుడు బ్యాంకు ఖాతాలు తెరిచి జనం సొమ్మును కోట్లలో కొల్లగొట్టిన (cyber crime incidents in india) వైనం నిశ్చేష్టపరుస్తోంది. గతంలో దొంగనోట్లు, నకిలీ పాస్‌పోర్టులు, డూప్లికేటు ఫొటో గుర్తింపు కార్డుల బాగోతాలెన్నో చూశాం. ఇప్పుడు ఆధార్, పాన్‌కార్డుల్నీ యథేచ్ఛగా సృష్టిస్తున్న నేరగాళ్ల చేతివాటం సైబరాసురులకు కోరలూ కొమ్ములూ తొడుగుతోంది. ఆదాయపన్ను శాఖ నుంచి జారీ అయ్యే శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) కార్డులకు ఆధార్ వివరాల అనుసంధానాన్ని కేంద్రం నాలుగేళ్ల క్రితం తప్పనిసరి చేస్తూ చట్టాన్ని సవరించింది. ఆ చట్టం స్ఫూర్తినే చట్టుబండలు చేస్తున్న రీతిగా ఏ పత్రాలు కార్డులు కావాలన్నా చిటికెలో సృష్టించి కోట్లకు కోట్లు కొల్లగొడుతున్న సైబర్ ముష్కరుల దోపిడికాండ- వ్యవస్థాగతంగా బహుముఖ వైఫల్యాలను చాటుతోంది!
రూ. కోట్లు సరిహద్దులు దాటి..
జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) అధికారికంగా క్రోడీకరించిన సమాచారం (NCRB Cyber Crime) ప్రకారం, 2018 సంవత్సరంలో దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ నేరాలు 27,248. ఆ సంఖ్య 2019లో 44,735కు, నిరుడు 50,035కు విస్తరించిన వేగం సంక్షోభ తీవ్రతను సూచిస్తోంది. వాస్తవంలో, సైబర్ నేరాల ఉద్ధృతి ఏడాది కాలంలోనే ఐదింతలైందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ఆ మధ్య పచ్చి నిజం వెళ్ళగక్కారు. రుణయాప్‌ల పేరిట కొన్ని నెలల వ్యవధిలోనే వేల కోట్ల రూపాయలు దేశ సరిహద్దులు దాటిపోవడం తెలిసిందే. ఝార్ఖండ్, దిల్లీ, బిహార్, రాజస్థాన్ తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు బ్యాంకు ప్రతినిధులుగా దాతృత్వ సంస్థల సంబంధీకులుగా నమ్మబలుకుతూ పలువురి బ్యాంకు ఖాతాల్ని క్షణాల్లో ఖాళీ చేస్తున్న ప్రహసనాలు ఎన్నెన్నో!
కొవిడ్ విజృంభణ కారణంగా ఉద్యోగుల పనిపోకడల్లో మార్పుల దరిమిలా ఇళ్లలోని కంప్యూటర్లపై దాడులు అధికమైనట్లు సెర్టిన్ (భారత జాతీయ కంప్యూటర్ అత్యవసర స్పందన బృందం) నిరుడు నిగ్గు తేల్చింది. భారతీయ విద్యుత్ గ్రిడ్లపై సైబర్ దాడులకు చైనా యత్నించిందని (china cyber attack on india) ఆరు నెలల క్రితం వెల్లడైంది. దేశ రవాణా రంగానికీ సైబర్ దాడుల ముప్పు పొంచి ఉందని కేంద్రం అప్పట్లోనే ప్రకటించింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్), మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీస్ విభాగం నుంచి సమాచారం తస్కరణకు గురైనట్లు నిన్న కాక మొన్ననే బయటపడింది. వ్యక్తులు, సంస్థలతోపాటు వ్యవస్థలకు సైబరాసురుల తాకిడి పెరుగుతున్న వేళ- వాలంటీర్లుగా తమ పేర్లు నమోదు చేయించుకోవాలని పౌరులకు కేంద్రం పిలుపిచ్చింది.
అప్పుడే సైబర్ భద్రతకు ముందడుగు..
రాష్ట్రాల మధ్య సమాచార మార్పిడికి వీలుగా అనుసంధాన వ్యవస్థ నెలకొన్నట్లు ప్రభుత్వాలు ఘనంగా చెబుతున్నా- క్షేత్రస్థాయి యథార్థాలు వేరు. గత సంవత్సరం తెలంగాణలో నాలుగు వేలకు పైగా సైబర్ నేరాలు నమోదైనా, శిక్ష పడిన కేసులు నాలుగే! చోరబృందాల భరతం పట్టేలా ఉమ్మడి కార్యదళం ఏర్పాటు, 'నాస్కామ్' (సాఫ్ట్‌వేర్ సేవాసంస్థల జాతీయ సంఘం) సిఫార్సు ప్రకారం పది లక్షల (NASSCOM report on cybersecurity) మంది నిపుణులతో కూడిన సైబర్ సేన అవతరణ అత్యవసరం. రాష్ట్రాలు, దేశాల మధ్య సమాచార మార్పిడి అర్థవంతంగా సాకారమైనప్పుడే- సైబర్ భద్రత వైపు ముందడుగు పడినట్లు!
ఇదీ చూడండి : 'చైనా దురుసుతనం వల్లే లద్దాఖ్‌లో అశాంతి'