ఐక్యరాజ్య సమితి కాలంతోపాటు మారాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత వారం సమితి సర్వసభ్య సమావేశంలో పిలుపు ఇచ్చినప్పటి నుంచి సంస్థలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరంపై చర్చ ఊపందుకొంది. అంతర్జాతీయంగా మారుతున్న ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సమితి సైతం మారక తప్పదు. లోపాలను సవరించుకుని, పరిమితులను అధిగమించి, అత్యంత సమర్థంగా పనిచేసే బహుళ పక్ష వేదికగా ఐక్యరాజ్య సమితి (ఐరాస)ని తీర్చిదిద్దడానికి తక్షణం సంస్కరణలు తీసుకురావాలి. 21వ శతాబ్ది సవాళ్లను ఎదుర్కొనే సత్తాను సంతరించుకోవడానికి తోడ్పడే సంస్కరణలతో ఐరాస ముందుకు రావాలి.
ఇదీ చూడండి: ఐరాసలో సంస్కరణలు రావాల్సిందే: నరేంద్ర మోదీ
కొందరి మాటకే చెల్లుబాటు
ఐరాస భద్రతా మండలి ఆవిర్భావం, పరిణామం గురించి సవివరంగా తెలుసుకుంటే కానీ, సంస్కరణల ఆవశ్యకతను గ్రహించలేం. రెండో ప్రపంచ యుద్ధం సృష్టించిన వినాశాన్ని చూసి, మూడో ప్రపంచ యుద్ధం రాకుండా నివారించడానికి ఒక అంతర్జాతీయ వేదికను ఏర్పరచాలని 50 ప్రధాన దేశాలు నిశ్చయించాయి. తదనుగుణంగా శాన్‌ఫ్రాన్సిస్కోలో ఐరాస నియమావళి (రాజ్యాంగం)పై సంతకాలు చేశాయి. అంతర్జాతీయ శాంతిభద్రతల పరిరక్షణకు ఈ నిబంధనావళి కింద భద్రతా మండలిని స్థాపించారు. అందులో అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలు శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రపంచానికంతా ఈ అయిదు దేశాలే రక్షణ ఛత్రం కల్పిస్తాయన్నమాట. దీనికోసం అంతర్జాతీయ శాంతి పరిరక్షక దళాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఎక్కడైనా సంఘర్షణ తలెత్తితే దాన్ని ఉపశమింపజేయడానికి భద్రతా మండలి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నం విఫలమైతే సంఘర్షణకు దిగిన దేశం లేదా దేశాలపై ఆంక్షలు విధిస్తుంది. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే సమితి శాంతి రక్షక దళాలు రంగంలోకి దిగుతాయి.
గడచిన 70 ఏళ్లలో భద్రతా మండలి సంప్రదాయ శాంతి పరిరక్షణ, ప్రత్యేక రాజకీయ కార్యక్రమాలు, తాత్కాలిక ప్రభుత్వాల ఏర్పాటు, నిర్వహణ, సమగ్ర ఆర్థిక ఆంక్షల విధింపు, సంఘర్షణల నిరోధానికి ముందస్తు దౌత్యయత్నాలు, కల్లోలిత దేశాల్లో భావసారూప్యత కలిగిన పక్షాలతో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటు వంటి బాధ్యతలను నెరవేర్చింది. పౌరులు, స్త్రీలు, బాలలను కాపాడటానికి తీర్మానాలు చేసింది. మానవ హక్కుల ఉల్లంఘనలు, టెర్రరిస్టు చర్యలు జరిగినప్పుడు తన పరిధిలో చర్యలు తీసుకొంది. అయితే రువాండా, సొమాలియా, బోస్నియాలలో శాంతిని కాపాడటంలో విఫలమైందనే విమర్శలు ఉన్నాయి.
శాశ్వత సభ్యదేశాల నిర్లక్ష్యంతోనే..
ఐక్యరాజ్య సమితిని సంస్కరించే దిశగా పలు అధ్యయనాలు జరిగాయి. సమితిని మరింత సమర్థంగా తీర్చిదిద్దడానికి అయిదు చర్యలను ఈ అధ్యయనాలు సూచించాయి. అవి- సభ్యత్వ వర్గీకరణలో మార్పు, శాశ్వత సభ్యుల గుత్తాధికారమైన వీటో అధికారంపై సమీక్ష, వివిధ ప్రాంతాలకు సమితిలో సముచిత ప్రాతినిధ్యం, భద్రతామండలి విస్తరణ, ఆపైన దాని విధులు బాధ్యతల నిర్వచనం. ప్రస్తుత వర్గీకరణ ప్రకారం మండలిలో అయిదు శాశ్వత సభ్య దేశాలు, 10 తాత్కాలిక సభ్యదేశాలూ ఉన్నాయి. దీనివల్ల 193 సభ్యదేశాలుగల ఐరాసలో స్థాయీ భేదాలు, అసమానతలు ఏర్పడ్డాయి. అధికారాలన్నీ శాశ్వత సభ్య దేశాల చేతిలో పోగుపడటంతో అవి స్వప్రయోజనాలను, తమ మిత్రుల ప్రయోజనాలను రక్షించుకోవడానికే ప్రాధాన్యమిస్తూ, ఇతర సభ్యులకు ద్వితీయ ప్రాధాన్యమిస్తూ, నిర్లక్ష్యం ప్రదర్శించాయి.
ఇదీ చూడండి: ఐరాస కీలక కమిటీ ఎన్నికల్లో చైనాపై భారత్ విజయం
ప్రపంచంలో అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం, ప్రాతినిధ్యం లభించకపోవడం కూడా భద్రతా మండలి సామర్థ్యాన్ని దెబ్బతీస్తోంది. ఉదాహరణకు మండలి కార్యకలాపాల్లో 75 శాతం ఆఫ్రికాకు సంబంధించినవే అయినా, ఆఫ్రికా నుంచి కనీసం ఒక్క దేశానికీ మండలిలో శాశ్వత ప్రాతినిధ్యం లేదు. ఆఫ్రికా ఖండం సమస్యలపై ఆఫ్రికావాసులు కాకుండా ఇతర ఖండాలవారు చర్చించి నిర్ణయాలు తీసుకునే విడ్డూరపు పరిస్థితి మండలిలో ఉందని దక్షిణాఫ్రికా ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ఆఫ్రికా సమస్యలపై నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో అక్కడి దేశాలకు ప్రాతినిధ్యం ఉండాల్సిందే. అందుకోసం మండలిలో తమకూ శాశ్వత సభ్యత్వం ఉండాలని దక్షిణాఫ్రికా, నైజీరియా వంటి ప్రధాన దేశాలు ఆశిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మండలి స్వరూప స్వభావాలు మారకతప్పదని భారత్ సహా పలు దేశాలు భావిస్తున్నాయి. ఈ దిశగా కృషి చేయడానికి భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్ జి-4 బృందంగా ఏర్పడ్డాయి. మండలిలో కొత్త శాశ్వత సభ్యులను చేర్చుకుని, విస్తరించాలనీ, పనిచేసే పద్ధతులనూ మార్చాలని కోరుతున్నాయి.
మండలిలో అయిదు శాశ్వత సభ్య దేశాలకే వీటో అధికారం ఉంది. ఈ అధికారంతో అవి ఎప్పటికప్పుడు తమ మాట నెగ్గించుకొంటున్నాయి. సమస్త ప్రపంచానికి సంబంధించి ఏదైనా సమస్యపై సమితి సభ్యులంతా కలసి ఒక తీర్మానం చేసినా, అది తమ ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని భద్రతా మండలిలో ఏ ఒక్క శాశ్వత సభ్యదేశమైనా భావిస్తే, అఖిల పక్ష తీర్మానాన్నీ వీటో చేసేస్తున్నాయి. ఇక ఈ పరిస్థితుల్లో బహుళపక్ష కార్యాచరణకు అర్థం ఏముంటుంది?
కాలానుగుణ సంస్కరణలు
21వ శతాబ్దిలో ప్రపంచంలో ఆర్థికంగా, సైనికంగా, రాజకీయంగా ఎన్నో మార్పులు సంతరించుకున్నాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఐరాస కూడా మారాలి. ఆర్థిక బలం ఆధారంగా సభ్యత్వాన్ని విస్తరించాలంటే జపాన్, జర్మనీలను శాశ్వత సభ్యులుగా చేర్చుకోవాల్సిందే. ఇవి ప్రస్తుతం ఆర్థికంగా ప్రబల శక్తులుగా ఉండటంతోపాటు, ఐరాసకు భారీ మొత్తాలను కేటాయిస్తున్నాయి. ఇక- ఐరాస తరఫున ప్రపంచంలో శాంతి రక్షణ విధులకు అత్యధికంగా సేనలను పంపే దేశాలకు మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే డిమాండ్ న్యాయబద్ధమైనది. ఇలా సేనలను పంపే దేశాల్లో భారత్, నైజీరియా, బ్రెజిల్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. మండలి తీర్మానాలను అమలు చేసే గురుతర బాధ్యతను ఈ మూడు దేశాలే మోస్తున్నాయి. వీటికి మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వడం తక్షణం జరగాల్సిన సంస్కరణ. ఘర్షణలకు దిగిన దేశాలతో, ప్రాంతీయ సంస్థలతో, సంఘర్షణ ప్రాంతాల్లో శాంతి పునరుద్ధరణకు సేనలను, పోలీసులను పంపిన దేశాలతో సంప్రదించి, పరిష్కార సాధనకు పకడ్బందీ ప్రాతిపదికను ఏర్పరచాలి. ఇలాంటి సంఘర్షణలపై మండలి జరిపే సమావేశాలన్నీ సాధికారంగా ఉండక్కర్లేదు. కొన్ని అనధికార సమావేశాలూ జరపవచ్చు. సంబంధిత రంగాల నిపుణులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఇతర ప్రముఖులను ఈ సమావేశాలకు ఆహ్వానించి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలి. ఇందులో మండలిలో సభ్యులు కాని దేశాలూ పాలు పంచుకోవచ్చు. దారి తప్పిన దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే ముందు వీరందరితో సంప్రదించి తుది నిర్ణయానికి రావడం ఉత్తమం. అంతేతప్ప మండలిలోని అయిదు శాశ్వత సభ్యదేశాలే సర్వంసహాధిపత్యం నెరపడం ఏమాత్రం మంచిది కాదు. అందర్నీ కలుపుకొని వెళితే ఆర్థిక ఆంక్షలు మరింత సమర్థంగా అమలవుతాయి. కాబట్టి ఐరోపా సమాఖ్య (ఈయూ), ఆఫ్రికా దేశాల ఆర్థిక సంఘం వంటి బహుళ పక్ష వేదికలకూ సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ భద్రతా మండలిని రూపాంతరం చెందించాలి.
- కె.సి.రెడ్డి (ఐక్యరాజ్య సమితికి మాజీ ప్రధాన భద్రతా సలహాదారు)