కరోనా వైరస్‌కు పుట్టినిల్లయిన చైనాలో దాదాపు సగం రాష్ట్రాల్లో డెల్టా రకం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఒక కార్మికుడికి కొవిడ్ సోకడంతో రద్దీపరంగా ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉండే నింగ్‌బో-జౌషాన్ ఓడరేవును చైనా మూసివేసింది. మన దేశంలోనూ పలు ప్రాంతాల్లో రాకాసి మహమ్మారి ప్రమాదఘంటికలు మోగిస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆరు రోజుల్లో 19 ఏళ్లలోపు వయసున్న 300 మంది పిల్లలు కొవిడ్ బారిన పడ్డారు. దీంతో మూడేళ్లు దాటిన వారంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, వేరే ప్రాంతాల నుంచి బెంగళూరుకు వచ్చేవారు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ ధ్రువపత్రం తేవాలని బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) పేర్కొంది. కమ్యూనిటీ హాళ్లు వంటి వాటిని మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. తమ రాష్ట్రంలోకి రావాలంటే ఆర్టీపీసీఆర్ ధ్రువపత్రం లేదా రెండు డోసుల టీకా తప్పనిసరని పంజాబ్ సైతం తాజాగా స్పష్టం చేసింది.
కరోనా పోరులో తడబాటు
మహమ్మారిని ఎదుర్కొనే చర్యల్లో భారత్ అడుగులు తడబడుతూనే ఉన్నాయి. మన దేశంలో కొవిడ్ టీకా కార్యక్రమం ఈ ఏడాది జనవరి 16న ప్రారంభమైంది. నాటి నుంచి రెండు డోసుల టీకాలు అందినవారు కేవలం 12.12కోట్ల మందే. మొదటి డోసు ఒక్కటే తీసుకున్నవారు 42.25కోట్ల మంది. కేరళలో రెండు డోసులూ తీసుకున్నవారిలోనూ దాదాపు 40వేల మందికి కొవిడ్ సోకడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఇలాంటి కేసులన్నింటినీ జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపాలని కేంద్రం కేరళను కోరింది. ఇందులో అప్పటికే కొవిడ్ సోకినవారి నుంచి తీసుకున్న వైరస్ నమూనాలను ఇతర కేసులతో పోల్చి, ఉత్పరివర్తనం ఏదన్నది నిర్ధారిస్తారు.
రెండు డోసుల టీకా ఇచ్చినా, దానివల్ల వచ్చే వ్యాధినిరోధకతను ఎదుర్కొని వైరస్ ఉత్పరివర్తనం చెందుతోందా అనేది ఆందోళనకరంగా మారింది. వైరస్ విలయం దృష్ట్యా ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం కేరళలోని ఎనిమిది జిల్లాల్లో పర్యటించింది. ఆగస్టు ఒకటి నుంచి 20లోపు కేరళలో 4.6లక్షల కొవిడ్ కేసులు వచ్చే ప్రమాదం ఉందని ఆ బృందం హెచ్చరించింది. ఓనం పండగ ఉండటం, పర్యాటక ప్రాంతాలు తెరవడం వంటివి కేసులు పెరగడానికి ప్రధాన కారణాలుగా కేంద్ర బృందానికి నేతృత్వం వహించిన జాతీయ వ్యాధి నివారణ కేంద్రం (ఎన్‌సీడీసీ) సంచాలకులు డాక్టర్ సుర్జీత్ సింగ్ సూచించారు.
రెండు డోసుల టీకా అసాధ్యమే!
మన దేశంలో ప్రస్తుతం ప్రధానంగా మూడు రకాల టీకాలే అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొవాగ్జిన్, కొవిషీల్డ్‌లను ఇక్కడే ఉత్పత్తి చేస్తుండగా, స్పుత్నిక్-వి టీకాను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇవన్నీ రెండు డోసులు తీసుకోవాల్సిందే. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ ఒకే డోసు టీకాకు భారతదేశంలో వినియోగ అనుమతి వచ్చినా అది నవంబరు, డిసెంబరు నాటికిగానీ అందుబాటులోకి రాదు. దేశవాసులకు కొవిడ్ బారి నుంచి రక్షణ లభించాలంటే టీకాల ఉత్పత్తిని భారీస్థాయిలో పెంచాలి. డిసెంబరు నాటికి వయోజనులందరికీ టీకా అందాలంటే రోజుకు 70-80 లక్షల డోసుల చొప్పున పంపిణీ చేయాలన్నది ఐసీఎంఆర్ సూచన. టీకా కేంద్రాలను గణనీయంగా పెంచినా, వాటిలో డోసుల అందుబాటు అంతగా లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది.
ఉత్పత్తి అవుతున్న మొత్తం టీకాల్లో 75శాతం రాష్ట్ర ప్రభుత్వాలకు, మిగిలిన 25శాతం ప్రైవేటు ఆసుపత్రులకు కేటాయించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. మే ఒకటినుంచి జులై 15 వరకు దేశంలో వేసిన మొత్తం టీకాల్లో ప్రైవేటు ఆసుపత్రులు ఏడు శాతమే అందించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పార్లమెంటులో ప్రకటించింది. దేశవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో జులై 19 నాటికి 2.6కోట్ల డోసుల టీకా నిరుపయోగంగా ఉండిపోయిందని కేంద్రం చెప్పింది. ప్రైవేటు ఆసుపత్రులకు 5-10శాతం టీకా కేటాయింపులు చాలని పలు రాష్ట్రాలు అంటున్నాయి. ఈ విషయంలో కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, హోం మంత్రి అమిత్‌షాకు లేఖలు రాశారు. ఈ దిశగా కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. టీకాల ఉత్పత్తిని రెట్టింపు చేయడం, వాటి అందుబాటును అన్ని రాష్ట్రాలకూ పెంచడం, గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య టీకాల విషయంలో అంతరాలు లేకుండా చూడటం వంటి చర్యల ద్వారానే టీకా కార్యక్రమ లక్ష్యాన్ని త్వరగా సాధించే అవకాశాలుంటాయి. లేనిపక్షంలో డిసెంబరు నాటికల్లా 96కోట్ల మంది వయోజనులకు రెండు డోసుల టీకా అసాధ్యమే!
రచయిత- కామేశ్
ఇదీ చూడండి: 'నవ భారత్ కోసం రూ.100 లక్షల కోట్లతో ప్రగతి యజ్ఞం'