దేశ ఆర్థిక వ్యవస్థకు, విజ్ఞాన విస్తరణకు, ఉపాధికి ఊతమిచ్చిన సమాచార సాంకేతిక (ఐటీ) రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. పరిశ్రమలను దెబ్బ తీసింది. సేవలకు, ఉత్పత్తులకు విఘాతం ఏర్పడటంతోపాటు కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దాదాపు లక్షన్నరకు పైగా ఉద్యోగాలకు దీనివల్ల ముప్పు వాటిల్లింది. ఐటీ రంగానికి ఇది కనీవినీ ఎరుగని సంక్షోభం. ఆర్థిక మాంద్యంతో ఆటుపోట్లకు గురవుతున్న తరుణంలో తాజా పరిణామాలు పిడుగుపాటుగా మారాయి. విపత్తును ఎదుర్కొని ముందుకు సాగడం ఇప్పుడు ఆరంగం ముందున్న అతిపెద్ద సవాలు.
భారత్‌పై విదేశీ కంపెనీల దృష్టి
ఐటీ జ్ఞాన ఆధారిత పరిశ్రమ. మానవ జీవితాల్లో పెనుమార్పులకు ఈ రంగం దోహదపడింది. వ్యవస్థీకృత అభ్యున్నతికి తోడు సత్వర, సులభతర, పారదర్శక సేవలు, మానవ వనరుల వృద్ధి, ఉపాధి కల్పన, అంకుర పరిశ్రమలకు ఆలంబనగా నిలిచింది. ఆధునిక పాలనకు, డిజిటల్ ప్రపంచానికి, మరెన్నో అద్భుతాలకు బాటలు వేసింది. దాదాపు అయిదు దశాబ్దాల్లో భారత్ ఈ రంగంలో సుస్థిర స్థానం సాధించింది. దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంలో ఈ రంగం కీలక పాత్ర పోషించింది. జీడీపీలో 7.7 శాతం వాటా దీనిదే. పోటీ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన అభివృద్ధిని సాధించిన భారత్ ఐటీలో ప్రస్తుతం ప్రముఖ స్థానంలో ఉంది. ప్రపంచ ఐటీ సేవలు, వనరుల రంగంలో 55 శాతం మార్కెట్ వాటా మన దేశానిదే. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో 200 భారతీయ ఐటీ సంస్థలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రపంచ డిజిటల్ సేవల్లో 75 శాతం భారత్ అందిస్తోంది. ఐటీ, దాని అనుబంధ పరిశ్రమల విలువ 2018-19లో 18,100 కోట్ల డాలర్లుగా ఉంది. ఇందులో ఎగుమతులు 13,700 కోట్ల డాలర్లు. భారతీయ ఐటీ రంగం ఏటేటా విస్తరించడంతో పాటు విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2000 నుంచి 2019 వరకు కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగంలో 4,300 కోట్ల డాలర్లకు పైగా విదేశీ పెట్టుబడులు సమకూరాయి. పరిశ్రమ సేవల పరంగానేగాక ఉపాధి పరంగానూ విస్తరించింది. ఇందులో 46 లక్షల మంది దేశంలో ఉపాధి పొందుతున్నారు. విదేశాల్లో 20 లక్షల మందిదాకా ఉన్నారు. గత రెండు దశాబ్దాల్లో ఉపాధి ప్రాధాన్య స్థానాల్లో ఐటీ మొదటి స్థానం పొందింది. మెరుగైన వేతనాలు, ప్రతిభకు ప్రోత్సాహాల పరంగా ముందుండటంతో చాలామంది దీనికి ఆకర్షితులయ్యారు.
తప్పని ఆటుపోట్లు
ఆకాశమే హద్దుగా ఎదిగిన ఐటీ రంగం క్రమేపీ ఆటుపోట్లకు గురయింది. ఆర్థిక సంక్షోభాలు, వ్యయ నియంత్రణ విధానాలు, రోబోటిక్స్, డేటా ఎనలటిక్స్ వంటి ఆధునిక పోకడలు దీనికి కళ్లెం వేశాయి. ఐటీకి పెద్ద దిక్కుగా ఉన్న అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక పరిస్థితులు మారిపోయాయి. స్థానిక ఉపాధి కోసం తీసుకున్న నిర్ణయాలు భారత్ వంటి దేశాలకు చెందిన నిపుణులు, ఉద్యోగార్థులకు శాపంగా మారాయి. క్రమేపీ ఐటీ రంగం విస్తరణ మందగించింది. కొత్త ఉద్యోగాలు దొరకడం గగనంగా మారింది. ప్రాంగణ నియామకాలు అరుదుగా మారాయి. ఈ రంగంలోని నిపుణులు ఉన్న ఉద్యోగాలను కాపాడుకోవడానికే శ్రమించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ తరుణంలో కరోనా వైరస్ గోరుచుట్టుపై రోకటిపోటుగా మారింది. కొవిడ్ వ్యాధిని నియంత్రించేందుకు లాక్‌డౌన్ చేపట్టగా మనదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవలు స్తంభించాయి. సుదీర్ఘకాలం ఐటీ కార్యాలయాలు మూతపడ్డాయి. లాక్‌డౌన్ ప్రభావం వల్ల దేశంలోని 1.5లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని ఇప్పటికే నిపుణులు అంచనా వేశారు. సంస్థల ఆదాయాలు తగ్గిపోవడం వల్ల చాలాచోట్ల యాజమాన్యాలు ఉద్యోగులను తొలగించాయి. మరికొన్ని సేవలను కుదించాయి. వేతనాల్లో కోత విధించాయి. ఇంటి నుంచే పని చేసే విధానాన్ని చేపట్టాయి. తాజా పరిణామాలతో కొత్త ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ఐటీలో మొదటి అడుగుగా భావించే అంకుర పరిశ్రమలు సైతం వాస్తవ రూపం దాల్చలేదు. భారత్ నుంచి ఎగుమతుల్లో 75% అమెరికా, ఐరోపా దేశాలకు వెళ్లేవి. ఇప్పుడు ఈ రెండు విపణులనూ కరోనా అతలాకుతలం చేసింది. ఇప్పట్లో అవి కోలుకునే అవకాశాలు తక్కువగా ఉన్నందున ప్రతికూల పరిస్థితులు ఇంకా కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. దేశంలో ఐటీ రంగంలో కొత్త నియామకాలు గగనం కానున్నాయి. ఇప్పటి వరకు ఐటీ రంగంలో మెరుగైన వేతనాలు ఉండగా క్రమేపీ తగ్గించే అవకాశం ఉంది. అనేక ఐటీ ప్రాజెక్టులతో పాటు వినియోగదారుల సాంకేతిక ప్రాజెక్టులను వాయిదా వేయవచ్చు లేదా రద్దు చేయొచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి.
ప్రభుత్వాలదే కీలక పాత్ర
ఐటీ రంగం ఎదుర్కొంటున్న తాజా విపత్తు నుంచి గట్టెక్కడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాల్సి ఉంది. ఐటీ, దాని అనుబంధ పరిశ్రమలకు మార్గదర్శనం చేసేందుకు ఐటీ నిపుణులతో, సంస్థల ప్రతినిధులతో టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేయాలి. ఐటీ సంస్థలకు స్థిరత్వం ముఖ్యం. ప్రస్తుత స్థితిలో అవి కొనసాగుతూ నిలదొక్కుకునే ప్రయత్నాలు చేయాలి. సామాజిక దూరం పాటిస్తూ ఉద్యోగుల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగాలి. పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించుకోవాలి. కొత్త ఆలోచనలు, మార్గాలపై దృష్టి సారించాలి. భారత్ నెట్ సేవలు విస్తరించాలి. నూతన ఆవిష్కరణలు, గేమింగ్, యానిమేషన్, ఎలెక్ట్రానిక్ తయారీ, గ్రామీణ సాంకేతికత వైపు దృష్టి సారించాలి. కరోనా అనంతరం చైనా, జపాన్ తదితర దేశాల నుంచి అనేక ఐటీ సంస్థలు ఇతర దేశాలకు మళ్లే ఆలోచనల్లో ఉన్నాయి. వాటిని భారత్ ఆకర్షించాలి. తాజా పరిణామాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత విధానాలను సమీక్షించుకొని కొత్త విధానాలపై దృష్టి సారించాలి. సంస్కరణలు చేపట్టాలి. ఐటీ సంస్థలకు భరోసా కల్పించాలి. సంక్షోభంవల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టపోయిన సంస్థలకు కేంద్రం ఆసరా కావాలి. స్వల్పకాలిక, దీర్ఘకాలిక విధానాలను చేపట్టాలి. వాటికి పన్ను మినహాయింపుల వంటి చర్యలపై దృష్టి సారించాలి. సూక్ష్మ మధ్య తరహా సంస్థలకు రుణసాయం అందించాలి. ఐటీ రంగానికి చెందిన ప్రత్యేక ఆర్థిక మండళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి.
తెలుగు రాష్ట్రాల్లో
తెలుగు రాష్ట్రాలు ఐటీ సేవలందించడంలో ప్రముఖ స్థానంలో ఉన్నాయి. ఐటీ సంబంధింత ఇంజినీరింగ్, ఇతర కోర్సుల్లో చేరేవారి సంఖ్య ఏటికేడూ పెరుగుతోంది. రెండు రాష్ట్రాల విద్యార్థులూ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఐటీ కంపెనీల్లో కీలక స్థానాల్లో ఉన్నారు. తెలుగు తేజం సత్య నాదెళ్ల ప్రపంచ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో ఆరు లక్షల మంది ప్రత్యక్షంగా ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. డిజిటల్ సేవలను రెండు ప్రభుత్వాలు విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ప్రపంచంలో పేరొందిన మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం, ఒరాకిల్, ఆపిల్, అమెజాన్ వంటి సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడలలో ఐటీ రంగం అభివృద్ధి చెందింది.
--- ఆకారపు మల్లేశం