ప్రపంచ దేశాలన్నీ కొవిడ్ మహమ్మారితో తలపడుతున్నాయి. ఈ విపత్కర సమయంలో భవిష్యత్తుపై అనేక భయసందేహాలు ముసురుతున్నాయి. ప్రపంచ రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలపై మహమ్మారి ప్రభావం ఎలా ఉండబోతుందన్న ఆందోళన అందులో ఒకటి. అన్ని దేశాలకూ ఇప్పుడు కొవిడ్ ఉమ్మడి శత్రువు. సమష్టిగా మహమ్మారిని ఎదుర్కొంటున్న స్ఫూర్తితోనే మున్ముందు అంతర్జాతీయ సహకారం విషయంలోనూ ప్రపంచ దేశాల మధ్య సమన్వయం వెల్లివిరుస్తుందా అనే ప్రశ్నకు దురదృష్టవశాత్తు లేదన్న సమాధానమే వస్తోంది.
దేశమే ముందు..
దశాబ్ద కాలంగా ప్రపంచ రాజకీయాల పెడధోరణి ఇకపైనా కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచీకరణ విధానం ఇప్పటికే ఒత్తిడికి గురవుతోంది. అనేక దేశాల్లో జాతీయవాదాలు, ‘దేశమే ముందు’ అన్న భావాలు పుట్టుకొస్తున్నాయి. సరిహద్దులు పూర్తిగా మూసుకుపోయాయి. సమీప భవిష్యత్తులో అవి మళ్ళీ తెరచుకునే అవకాశాలూ కనబడటం లేదు. ఇది వలసల మీద ప్రభావం చూపుతుంది. వలసదారుల ఉనికి వల్లే దేశాల మధ్య యుద్ధాలు, హింస తగ్గుముఖం పట్టాయి. తమ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో అభివృద్ధి చెందిన దేశాల బాట పట్టాలనుకునేవారికి మున్ముందు గడ్డు పరిస్థితులే ఉంటాయి.
అభివృద్ధి చెందిన దేశాలు ఏకపక్ష ధోరణులు అవలంబిస్తుండటంతో ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు, దేశాల కూటములు కొన్నేళ్లుగా బలహీనపడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)కు అమెరికా నిధులు నిలిపేసిన ఉదంతం దీనికి తాజా ఉదాహరణ. అంతకుముందు యునెస్కోకు దూరమైన అమెరికా, పారిస్ వాతావరణ ఒప్పందం నుంచీ తప్పుకొంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి రష్యా వైదొలిగింది. దక్షిణ చైనా సముద్రంపై 2016 ఐరాస ట్రైబ్యునల్ చేసిన తీర్మానాన్ని చైనా బేఖాతరు చేసింది. బలమైన ఆర్థిక విధానాలను అవలంబించే ఐరోపా సమాఖ్య సైతం ఇటలీ వంటి సభ్యదేశాలకు కష్టకాలంలో సాయపడటానికి కిందుమీదులవుతోంది. అంతర్జాతీయ సంబంధాలకు ప్రాతిపదికగా ఉన్న ఉదారవాదం మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. దీనివల్ల ప్రజాస్వామ్యం, అంతర్జాతీయ సంస్థలు, పరస్పరాధారిత ఆర్థిక విధానాలు వంటివి ఒత్తిడికి గురవుతున్నాయి. కొవిడ్ సంక్షోభం తగ్గుముఖం పట్టాక ఎక్కడికక్కడ దేశాల ఆధిక్యతా పోరు ప్రబలమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముడిచమురు ధరల పతనం ఇరాన్, ఇరాక్ వంటి దేశాలను బలహీనపరచింది. దీనివల్ల ఆ ప్రాంతంలో అస్థిరత ప్రబలి, ప్రజారోగ్యం పడకేసి, మౌలిక సౌకర్యలు కొరవడతాయి. భవిష్యత్తులో తీవ్రవాదం వేళ్లూనుకోవడానికి ఇవన్నీ దోహదపడే అంశాలవుతాయి.
కరోనా వైరస్ విస్తృతి గురించి వాస్తవాలను చైనా దాచిపెట్టడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దుయ్యబట్టారు. ఇదంతా చైనా ఉద్దేశపూర్వకంగా చేసిందన్న విషయం నిర్ధారణ అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనీ హెచ్చరించారు. మరోవైపు వైరస్‌ను నియంత్రించడానికి తాము చేసిన కృషి గురించి చైనా సైతం పెద్దయెత్తున ప్రచారం మొదలెట్టింది. ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలో కొన్ని దేశాలకు వైద్య సహాయం అందజేయడం ద్వారా తమ ఉదారతను చాటుకునేందుకూ చైనా యథాశక్తి ప్రయత్నిస్తోంది.
అమెరికా-చైనా తీరుతెన్నులే..
అమెరికా-చైనా సంబంధాల తీరుతెన్నులే 21 శతాబ్దాన్ని నిర్వచిస్తాయన్న వాదనలు ఎప్పటినుంచో ఉన్నవే. కరోనా వైరస్ కారణంగా అవిప్పుడు అత్యంత కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అమెరికా, చైనాలు పరస్పరం కయ్యానికి కాలుదువ్వినా, ఈ రెండు దేశాలను విశ్వసించగల పరిస్థితులు ప్రపంచంలో ఇప్పుడు లేవు. సంక్షోభ సమయంలో నాయకత్వ పటిమను కనబరచడంలో అమెరికా విఫలమైంది. కొవిడ్‌ను ఎదుర్కొవడంలో అమెరికా ఉదాసీనత, అనిశ్చిత ధోరణులను ప్రపంచ దేశాలు గమనించాయి. ఇక కరోనా బాధితుల గురించి చైనా ప్రభుత్వం చెబుతున్న లెక్కలను, నియంత్రణ విజయాలను ఎవరూ నమ్మడమే లేదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలూ ఆర్థికంగా కుదేలయ్యాయి. ఇతర దేశాలకు ఆర్థిక సహకారం విషయంలో అవేవీ చొరవగా ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. బహుముఖ నాయకత్వాలకు అవకాశాలు వస్తాయి. భారత్‌కు ఇది చక్కటి అవకాశం. కరోనాను ఉన్నంతలో సమర్థంగా నిలువరించిన దేశంగా భారత్‌కు ప్రశంసలూ దక్కాయి. తయారీ రంగంలో అవకాశాలను ఇండియా అందిపుచ్చుకోవాల్సి ఉంది. చైనా మీద ఎక్కువ ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ప్రపంచానికి తెలిసివచ్చింది. జపాన్ సైతం 220 కోట్ల డాలర్ల విలువైన పెట్టుబడులను చైనా నుంచి తరలించడానికి సిద్ధపడుతోంది. దాదాపు వెయ్యి సంస్థలు భారత అధికారులతో సంప్రతింపులు ప్రారంభించాయనీ చెబుతున్నారు. ప్రోత్సాహక విధానాలు, రాయితీలతో ఈ సంస్థలను ఆకట్టుకోగలిగితే ఆర్థిక రంగాన సరికొత్త ఒరవడికి అది నాంది అవుతుంది. ఏమైనా మానవాళి ఇంతటి సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో విభేదాలు విడనాడి ప్రపంచం అంతా ఏకతాటిపై నడవాలని విజ్ఞులెందరో కోరుతున్నారు. కానీ, రాజ్యాల ఆధిపత్య పోరు, స్వీయ ప్రయోజనాల ముందు నైతిక విలువలకు గుర్తింపు లభించేది చాలా అరుదు!
- డి.ఎస్.హూడా (రచయిత- విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్)