కేంద్రంలో ప్రస్తుత పాలక పార్టీ భాజపాకు సంఘ్ పరివార్ వెన్నూదన్ను కాగా, ప్రతిపక్షం కాంగ్రెస్‌కు నెహ్రూ కుటుంబమే దిక్కూమొక్కు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడూ క్రమశిక్షణను మరచి, నిత్య కలహాల్లో మునిగితేలడం ఆ పార్టీ నేతలకు అలవాటుగా మారిందనే విమర్శలున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న అతి కొద్ది రాష్ట్రాల్లో ఇప్పటికీ ఇదే తంతు సాగుతోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఫలితాలను చూస్తే- కాంగ్రెస్‌కు గెలుపు సాధించి పెట్టే సత్తా అధిష్ఠానంగా వ్యవహరించే పాలక కుటుంబానికి ఉందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని పటిష్ఠం చేసుకోవాల్సింది పోయి, లుకలుకలతో కాంగ్రెస్‌ను మరింత బలహీన పరచడానికే సిద్ధమవుతున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ పార్టీ అధిష్ఠానం మాటను లెక్కచేయడం లేదనే ఆరోపణలున్నాయి.
సిద్ధుతో ఘర్షణ..
పంజాబ్‌లో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కూ, మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూకు మధ్య ఘర్షణ వాతావరణం తారస్థాయికి చేరింది. కెప్టెన్ ప్రతిపక్షం అకాలీదళ్‌తో కలిసి రాష్ట్రంలో మాదకద్రవ్య మాఫియాను పెంచి పోషిస్తున్నారని, సిక్కుల మతగ్రంథం గురు గ్రంథ్‌సాహిబ్‌ను అపవిత్రం చేసిన ఘటనల్లో ఉభయుల హస్తం ఉందని సిద్ధూ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అసమ్మతివాదులు ఈయన వెనక చేరారు. సిద్ధూకు ఉప ముఖ్యమంత్రి పదవికానీ, రాష్ట్రశాఖ అధ్యక్ష పదవికానీ ఇవ్వాలంటూ అధిష్ఠానం సూచించినా సీఎం ససేమిరా అంటున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న దృష్ట్యా సిద్ధూతో సామరస్యంగా మెలగాలని అధిష్ఠానం సలహా ఇస్తున్నా కెప్టెన్ లెక్కచేయడం లేదు.
రాజస్థాన్‌లోనూ..
రాజస్థాన్‌లో సైతం ఇలాంటి గొడవే నడుస్తోంది. అక్కడ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, అసమ్మతి నేత సచిన్ పైలట్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సచిన్ నేతృత్వంలో 19మంది అసమ్మతీయులు గత ఏడాది మొదట్లో తిరుగుబాటు చేసినప్పుడు అధిష్ఠానం సయోధ్య మంత్రం జపించింది. అప్పట్లో సోనియాగాంధీ రాజస్థాన్ ప్రతిష్టంభనను అంతం చేయడానికి అహ్మద్ పటేల్, కె.సి.వేణుగోపాల్, అజయ్ మాకెన్‌లతో కమిటీని ఏర్పాటుచేశారు. గత నవంబరులో అహ్మద్ పటేల్ మరణంతో ఈ కమిటీ పక్కకు వెళ్లిపోయింది. మాకెన్ సయోధ్యకు యత్నించినా గెహ్లోత్, సచిన్‌ల మధ్య వైరం మరింత ముదిరింది.
గతవారం సచిన్ విధేయుడు హేమారాం చౌధరి తన రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపడంతో పార్టీలో మళ్లీ కుంపటి రాజుకుంది. ఇంత జరుగుతున్నా గెహ్లోత్ పంతం వీడటం లేదు. సచిన్ వర్గానికి పార్టీలో, ప్రభుత్వంలో పదవులు ఇవ్వాలని ప్రియాంకాగాంధీ సూచించినా ఆయన లెక్కచేయడం లేదు. పైగా సచిన్ వర్గీయులు కొందరిని తనవైపు లాక్కోవడానికి యత్నిస్తున్నారు.
అప్పట్లోనే...
ఛత్తీస్‌గఢ్‌లోనూ విభేదాలు సాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వంలో రెండోస్థానంలో ఉన్న ఆరోగ్యమంత్రి టీఎస్ సింగ్‌దేవ్ ముఖ్యమంత్రి కుర్చీని ఆశిస్తున్నారు. 2018 డిసెంబరులో ఈ రాష్ట్రాన్ని భాజపా నుంచి కాంగ్రెస్ గెలుచుకుంది. అప్పట్లోనే భూపేశ్ బాఘెల్, సింగ్‌దేవ్ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడ్డారు. నాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి పదవిని బాఘెల్, సింగ్‌దేవ్ చెరి రెండున్నరేళ్లు పంచుకునేలా ఒప్పందం కుదిర్చారు.
బాఘెల్ సీఎం పదవి చేపట్టి రెండున్నరేళ్లు కావస్తోంది. ఆపైన ఆయన కుర్చీ ఖాళీచేసి తనకిస్తారని సింగ్‌దేవ్ ఆశిస్తున్నారు. ఇప్పుడు రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో లేరు కాబట్టి ఆయన కుదిర్చిన ఒప్పందం చెల్లదని బాఘెల్ భావిస్తున్నారు. దీంతో సింగ్‌దేవ్ వర్గం తిరుగుబాటుకు దిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష భాజపా ఆయనకు మద్దతునిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉంది. అధిష్ఠానం అసమ్మతి వర్గాన్ని శిక్షించి, పూర్తిగా తనకే మద్దతునివ్వాలని బాఘెల్, అమరీందర్, గెహ్లోత్ ఆశిస్తున్నారు.
బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ తరహాలో అసమ్మతి వర్గాన్ని సాగనంపాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పాలక కుటుంబం పరిస్థితి ఇదివరకటిలా లేదు. రాష్ట్రాల్లో కాంగ్రెస్ శాఖలపై ముఖ్యమంత్రులకు ఉన్న పట్టు, సోనియాకు కానీ, ఆమె సంతానానికి కానీ లేదు. అసమ్మతివాదులను సాగనంపాలని ఉబలాటపడుతున్న ముఖ్యమంత్రులను నివారించే శక్తిని అధిష్ఠానం కోల్పోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే అవుతుంది. ఒక పార్టీ పది కాలాలపాటు కొనసాగాలంటే పటిష్ఠ నాయకత్వం, క్రమశిక్షణ అవసరం. దాన్ని అనుసరించకపోతే అందరికీ ముప్పు తప్పదనే సత్యాన్ని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు గ్రహించడం లేదు.
- రాజీవ్ రాజన్
ఇదీ చదవండి:అక్కడ రెండు నెలల్లోనే 48 బాల్య వివాహాలు!