ETV Bharat / opinion

వినియోగదారులకు పరిహారం అందితేనే న్యాయం

ప్రస్తుత కాలంలో ఏ ఆహారమైనా కల్తీతో కలుషితమవుతోంది. ప్రముఖ సంస్థల తేనె ఉత్పత్తుల్లోనూ కల్తీ జరుగుతున్నట్టు తెలిసింది. ఏటా రెండుసార్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా వినియోగదారుల దినోత్సవం నిర్వహిస్తోన్న క్రమంలో.. ఆహార నాణ్యతపై వినియోగదారుల హక్కులను చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1986 నాటి వినియోగదారుల రక్షణ చట్టం స్థానంలో.. ఈ ఏడాది నూతన చట్టం అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో వినియోగదారుల సాధికారతను కాపాడటంలో ఈ చట్టం ఓ మైలురాయి వంటిదని భావించాలి.

Complaints should be resolved promptly and appropriate compensation provided
నష్టపరిహారం అందితేనే న్యాయం
author img

By

Published : Dec 24, 2020, 7:39 AM IST

మనం తినే ప్రతి ఆహార పదార్థం కల్తీ వల్ల కలుషితం అవుతోంది. దేశంలో అమ్ముడయ్యే ప్రముఖ సంస్థల తేనె ఉత్పత్తుల్లో సైతం కల్తీ చోటు చేసుకుంటున్నట్లు ఇటీవలే వెల్లడైంది. 'విజ్ఞానశాస్త్ర, పర్యావరణ కేంద్రం (సీఎస్‌ఈ)' నిర్వహించిన నాణ్యతా పరీక్షల్లో ప్రముఖ బాండ్ల తేనె ఉత్పత్తులు ప్రమాణాలకు తగినట్లుగా లేవని తేలడం ఆందోళనకరం. ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 24వ తేదీని 'జాతీయ వినియోగదారుల దినోత్సవం', మార్చి 15వ తేదీని 'ప్రపంచ వినియోగదారుల దినోత్సవం'గా జరుపుకొంటున్న క్రమంలో- ఆహార నాణ్యతకు సంబంధించి వినియోగదారుల హక్కులపై చర్చించాల్సిన అవసరం ఉంది. దశాబ్దాల నాటి 'వినియోగదారుల రక్షణ చట్టం-1986' స్థానంలో 2020 జులై నుంచి కొత్త చట్టం విధివిధానాలు అమలులోకి వచ్చాయి.

వినియోగదారుల సాధికారత కోసం..

ఈ చట్టంలో వినియోగదారుల హక్కులను కాపాడటం, అనైతిక వ్యాపారాలను అరికట్టడం, సత్వర ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను రూపొందించడం వంటి అంశాలతోపాటు, ముఖ్యంగా ఆన్‌లైన్‌ క్రయవిక్రయాలను, విక్రయ సంస్థలను చేర్చి చట్ట పరిధిని పెంచారు. వినియోగదారుల సాధికారతను కాపాడటంలో ఈ చట్టం మైలురాయి వంటిదని భావించాలి. మన దేశంలో ఆహార నాణ్యత పర్యవేక్షణను 'భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ)' చేపడుతుంది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పర్యవేక్షణలో ఆహార నాణ్యతను పరీక్షించేందుకు అధునాతన సౌకర్యాలు కలిగిన ప్రయోగశాలలు అందుబాటులో లేవు. శిక్షణ పొందిన సిబ్బందికీ కొరత నెలకొంది. పరీక్షల ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా రూపొందించ లేదు. పర్యవేక్షణ లోపాలు సరేసరి.

కీలక మార్పులు...

వినియోగదారుల హక్కులను కాపాడటానికి, అనైతిక వ్యాపార కార్యకలాపాల నిరోధానికి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం కింద కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసింది. నిబంధనల ప్రకారం దీనికి సోదాలు, జప్తు చేసే అధికారం ఉంది. అనైతిక వ్యాపారం కొనసాగిస్తూ హక్కులకు భంగం కలిగిస్తున్నట్లు ఫిర్యాదు అందితే కలెక్టరు ద్వారా నివేదిక కోరవచ్చు. హక్కుల పరిరక్షణ కోసం మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయవచ్చు. కొత్త చట్టంలో జిల్లా కమిషన్‌ పరిధి కోటి రూపాయల వరకు, రాష్ట్ర కమిషన్‌ పరిధి కోటి నుంచి పది కోట్ల రూపాయలకు, జాతీయ కమిషన్‌ పది కోట్ల రూపాయలకు పైగా విలువ కలిగిన కేసులను చేపట్టేలా కీలక మార్పులు చేశారు. వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చేవారిని, అటువంటి ప్రకటనల్లో భాగస్వాములైన వ్యక్తులకు రూ.10 లక్షలదాకా జరిమానా విధించే అధికారం కేంద్ర ప్రాధికార సంస్థకు ఉంది. అదేవిధంగా మోసపూరిత ప్రకటనలో పాల్గొన్న ప్రముఖులపై ఇతర వాణిజ్య ప్రకటనల్లో నటించకుండా ఏడాది నుంచి మూడేళ్ల దాకా నిషేధం విధించవచ్చు.

ఆహార పంపిణీ యాప్​లు..

జిల్లా స్థాయి కమిషన్‌లో కొత్తగా వివాదాల పరిష్కార కోసం మధ్యవర్తిత్వ కేంద్రాలు నెలకొల్పి సత్వర పరిష్కారాన్ని కల్పించే అవకాశాన్ని కొత్త చట్టం కల్పిస్తోంది. పరిష్కారం లభించని పక్షంలో జిల్లా స్థాయి కమిషన్‌ రాష్ట్ర, జాతీయ కమిషన్లకు నివేదిక పంపాల్సి ఉంటుంది. నూతన వినియోగదారు చట్టంలో ఆన్‌లైన్‌ ఫిర్యాదును స్వీకరించిన 48 గంటల్లో గుర్తించి నెలలోగా పరిష్కారాన్ని నిర్దేశిస్తూ, వ్యాపార ప్రకటనల ఒప్పందాలు, ఉత్పత్తి జవాబుదారీతనం వంటి అంశాలతో మార్పులు చేయడం వినియోగదారునికి మేలు కలిగించే పరిణామం. ఈ చట్టంలో వస్తువు నిర్వచనాన్ని సవరిస్తూ ఆహార పంపిణీ యాప్‌ సంస్థలనూ చేర్చారు. దీనివల్ల చట్టం పరిధి పెరగడంతోపాటు, వినియోగదారులకు రక్షణ కూడా ఇనుమడిస్తుందని చెప్పాలి. ఈ చట్టంలో వినియోగదారుల హక్కులు, వివాద పరిష్కార ప్రక్రియను స్పష్టంగా పేర్కొనడం, ఫిర్యాదులను ఫాస్ట్‌ట్రాక్‌ ప్రాతిపదికన పరిష్కరించే వీలు కల్పించడం స్వాగతించదగిన మార్పు. వస్తువులు, సేవల లోపంతో వినియోగదారుడి హక్కుల ఉల్లంఘన జరిగితే సంబంధిత సంస్థలు, అమ్మకందారులతో పాటు తయారీదారులూ బాధ్యత వహించేలా నిబంధనలు రూపొందించారు.

చేపట్టాల్సిన చర్యలిలా...

వినియోగదారుల ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరించేలా ఎక్కువ న్యాయ సలహా కేంద్రాలతోపాటు, న్యాయస్థానాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. అవగాహన సదస్సుల నిర్వహణ కోసం నిధుల కేటాయింపు జరగాలి. స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. జనాభాకు తగిన సంఖ్యలో సిబ్బందిని నియమించాలి. ఇంటర్‌నెట్‌, సెల్యులార్‌, డేటా సర్వీసులను ఈ చట్టం పరిధిలోకి తీసుకురాకపోవడం, జాతీయ, రాష్ట్ర కమిషన్లలో సిబ్బంది కొరత, రాజకీయ జోక్యం వంటివన్నీ ప్రతికూల అంశాలు. చిన్నారులకు సంబంధించిన హానికర ఆహార ఉత్పత్తుల వ్యాపార ప్రకటనలపై స్పష్టమైన నియంత్రణ నియమాలను నిర్దేశిస్తే ప్రయోజనకరంగా ఉండేదనే అభిప్రాయాలున్నాయి. నాణ్యతను నిర్ణయించేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రయోగశాలలను ఏర్పాటు చేసి, నిర్దేశిత ప్రమాణాలను పరిశీలించిన తరవాతే వస్తువులను మార్కెట్లోకి అనుమతించడం ద్వారా నకిలీలను అరికట్టగల వీలుంది. చట్టాలెన్ని ఉన్నా వాటి అమలుపై ప్రభుత్వాల నిబద్ధత, వినియోగదారుల భాగస్వామ్యం ముఖ్యం. ఫిర్యాదులకు సత్వర పరిష్కారం లభించి, తగిన పరిహారం అందితేనే 'వినియోగదారుడే రాజు' అనే భావన నిజమవుతుంది.

- డాక్టర్‌ ఎం.బుచ్చయ్య, రచయిత, వాణిజ్య శాస్త్ర విభాగంలో సహాయ ఆచార్యులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.