బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలు వెదజల్లే కాలుష్యంతో పర్యావరణానికి, మనుషులకు, జంతువులకు అందరికీ ముప్పు అనే సంగతి ఎంతోకాలంగా నిపుణులు హెచ్చరిస్తున్నదే. వీటికి ఊతమిస్తూ తాజా అధ్యయనం మరింత స్పష్టమైన హెచ్చరికలు చేసింది. మనదేశంలో ఇప్పటికే ప్రతిపాదనల్లో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నింటిలో ఉత్పత్తి ప్రారంభిస్తే- 2030 నాటికి ఉత్పత్తి సామర్థ్యం 300 గిగావాట్లకు చేరుతుందని అంచనా. అయితే, దీనికి మనం చెల్లించాల్సిన మూల్యం కూడా అంతకన్నా భారీగానే ఉండనుంది. ఇందుకోసం ఏకంగా 8.44 లక్షల ప్రాణాల్ని బలిపెట్టాల్సి ఉంటుందని అంతర్జాతీయ అధ్యయనం స్పష్టం చేస్తోంది. మేరీలాండ్ యూనివర్సిటీ, అర్బన్ ఎమిషన్స్ ఇన్ఫో, మసాచూసెట్స్ అమ్హెర్స్ట్ విశ్వవిద్యాలయం, టెక్సాస్ టెక్ విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయం స్పష్టమైంది. దక్షిణ భారత్‌తో పోలిస్తే, బొగ్గు విద్యుదుత్పత్తి కేంద్రాలు అధికంగా ఉండే గంగా మైదాన ప్రాంతాల్లో ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే ఉద్గారాల కారణంగా సంభవించే ముందస్తు మరణాలు 2030 నాటికి రెండుమూడు రెట్లు పెరుగుతాయని గతంలోనూ అర్బన్ ఎమిషన్స్ ఇన్‌ఫో, కన్జర్వేషన్ యాక్షన్ ట్రస్ట్‌ల అధ్యయనం వెల్లడించడం గమనార్హం.
లోపించిన నియంత్రణ
థర్మల్ కేంద్రాల ఉద్గారాల కాలుష్యం ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి క్యాన్సర్‌కు దారితీస్తుందని వివిధ అధ్యయనాల్లో తేలింది. సల్ఫర్ డైఆక్సైడ్ శ్వాసకోశ వ్యవస్థపై, నైట్రోజన్ ఆక్సైడ్ ఊపిరితిత్తులు, గుండెపై ప్రభావం చూపుతుంది. ఆస్థమా ముప్పూ తప్పదని గుర్తించారు. అమెరికా, చైనా, ఆస్ట్రేలియా, ఈయూ తరహాలో సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, మెర్క్యురీలకు సంబంధించి భారత్‌కు సరైన రీతిలో ఉద్గార ప్రమాణాలు లేవు. థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉద్గారాల్ని నియంత్రించే, కొలిచే వ్యవస్థలను ఏర్పాటు చేసి, నిర్వహించాల్సి ఉన్నా అమలు అంతంత మాత్రమేననే ఆరోపణలున్నాయి. చట్టబద్ధమైన అవసరాల మేరకే ఇలాంటి యంత్రాలను ఏర్పాటు చేస్తున్నాయని, వీటికి సంబంధించిన 90 శాతం సమాచారం కల్పితమేనని తెలుస్తోంది. పర్యావరణంపై థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రభావాన్ని 10 కి.మీ.పరిధిలోనే సంబంధిత మంత్రిత్వశాఖ అంచనా వేస్తుందని, వాస్తవానికి ఆ ప్రభావం 300 కి.మీ. దాకా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
వ్యవసాయ ఉత్పాదకతకూ ముప్పు..
భారత్‌లో థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటైన ప్రాంతాల్లో బూడిద, సల్ఫర్ ఉద్గారాలతో వాతావరణం కలుషితమైనట్లు తేలింది. నిల్వకేంద్రాల నుంచి గాలికి కొట్టుకుపోయే బూడిద కారణంగా ప్రాణ నష్టంతోపాటు, వ్యవసాయ ఉత్పాదకతా తగ్గుతోంది. బూడిదను వందశాతం వినియోగించుకోవాలనే నిబంధనను పాటించడంలో చాలా కేంద్రాలు విఫలమయ్యాయి. 2019-20 తొలి అర్ధభాగానికి థర్మల్ విద్యుత్ కేంద్రాలు తాము ఉత్పత్తి చేసిన బూడిదలో 78.19 శాతం మాత్రమే వినియోగించినట్లు కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) నివేదిక స్పష్టం చేసింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు అలాంటి విద్యుత్ కేంద్రాలకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు జారీ చేసినా చాలాకేంద్రాలు విభిన్న కారణాలను చూపుతూ జరిమానాలు చెల్లించేందుకు నిరాకరించడం గమనార్హం. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, సీపీసీబీ ఆదేశాల మేరకు అన్ని థర్మల్ కేంద్రాలు కొత్త ఉద్గార ప్రమాణాల్ని 2022 నాటికి పరిపూర్తి చేయాల్సి ఉంది. ఐరోపా దేశాల్లోని థర్మల్ కేంద్రాలు సగటున విడుదల చేసే సీఓ2 (కార్బన్‌డయాక్సైడ్) కన్నా భారత్ కేంద్రాలు 120 శాతం అధికంగా ఉద్గారాలు వదులుతాయని వెల్లడైంది. 300పైగా కేంద్రాలు ఉద్గార ప్రమాణాల్ని ఉల్లంఘిస్తున్నట్లు ‘గ్రీన్‌పీస్’ గతంలోనే వెల్లడించింది.
మరేం చేయాలి?
మన దేశంలో థర్మల్ విద్యుదుత్పత్తి వైపే ఎక్కువగా మొగ్గు చూపడానికి ఇతరత్రా కారణాలెలా ఉన్నా, అత్యంత చవకైన మార్గం కావడం వల్లే దీనికి అధిక ఆదరణ లభిస్తోందనడంలో సందేహం లేదు. అయితే, దీనివల్ల సంభవించే పర్యావరణ, ఆరోగ్య సంబంధ నష్టాలను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే ఇది చవకగా అనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ నష్టానికి సంబంధించిన వ్యయాల్ని సరిగ్గా లెక్కించి, కాలుష్య కారక కంపెనీల నుంచి జరిమానాలు వసూలు చేస్తే, అప్పుడు భారత్ బొగ్గుపై ఆధారపడటం తగ్గిపోతుందనే అభిప్రాయాలున్నాయి. పర్యావరణ నిబంధనలన్నింటినీ పాటిస్తూ, లాభసాటిగా విద్యుదుత్పత్తి చేయడం కష్టతరమవ్వడంతో పక్కదారి పడుతున్నారనే విమర్శలూ లేకపోలేదు. వాతావరణ మార్పులపై పారిస్ ఒప్పందం మేరకు దేశంలోని థర్మల్ కేంద్రాల ఆధునికీకరణ ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉంది. మానవ ఆరోగ్యమే ప్రాథమిక సూచీగా థర్మల్ కేంద్రాల ప్రభావ మదింపు పద్ధతుల ప్రమాణాల్ని మెరుగుపరచాలి. పాతగా మారిన థర్మల్ కేంద్రాలను కాలుష్య నిబంధనలకు అనుగుణంగా ఆధునికీకరించే బదులుగా, పునరుత్పాదక విద్యుత్ కేంద్రాలుగా మార్చడం మేలని అధ్యయనాలు సూచిస్తున్నాయి. బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి నుంచి ఉద్గారరహిత పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మరలాలి. ఇది ప్రపంచ వాతావరణ పరిస్థితుల మెరుగుదలకే కాకుండా, భారత వృద్ధికీ ఊతమిస్తుంది.
- శ్రీనివాస్ దరెగోని, రచయిత
ఇదీ చదవండి: 9.15 సెకన్లలో 100 మీటర్ల 'కంబళ' పరుగు