దేశంలో ఏ చలనచిత్రమైనా విడుదల కావాలంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) అనుమతి తప్పనిసరి. సీబీఎఫ్‌సీ ధ్రువీకరణ పొంది విడుదలైన సినిమాలపై ఏవైనా ఫిర్యాదులు అందితే మళ్లీ సెన్సార్ చేసే కొత్త నిబంధనను కేంద్రం తెరపైకి తీసుకొచ్చింది. ఈ మేరకు సినిమాటోగ్రాఫ్ (సవరణ) బిల్లు- 2021కు రూపకల్పన చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ గత నెల 27న కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు పలువురు నటులు, దర్శక నిర్మాతలు లేఖ రాశారు. భారతీయ సినీపరిశ్రమకు చెందిన మూడు వేల మంది దీనిపై సంతకాలు చేశారు.
'సుప్రీం' తీర్పునకు భిన్నంగా..
వాస్తవానికి చలనచిత్రాల విడుదలకు అనుమతి మంజూరు చేయడమే సీబీఎఫ్‌సీ విధి. అయితే, బ్రిటిష్ కాలం నుంచి సినిమాల్లో అభ్యంతరకర (తమకు నచ్చని) అంశాలను తొలగించే సెన్సార్ పనినీ ఆ బోర్డే చేస్తోంది. అలా సెన్సార్ అయిన సినిమాపై ఫిర్యాదులు వస్తే తిరిగి పరిశీలనకు పంపుతామన్నది సవరణ చట్టంలోని కీలకాంశం. ఇప్పటికే సెన్సార్ పేరిట తమ సృజనను దెబ్బతీస్తున్నారని, ఇక సూపర్ సెన్సార్ వస్తే తమ కష్టానికి ఫలితం ఉండదని దర్శక నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. అధికార పార్టీ తన రాజకీయ అజెండాను సినిమాలపై రుద్దుతోందని, అందుకు అనుగుణంగా లేని చిత్రాలపై సెన్సార్ బోర్డు ప్రతాపం చూపిస్తుందని ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం కొన్నేళ్ల క్రితం విమర్శించారు. మత్తుపదార్థాలకు బానిసలవుతున్న పంజాబ్ యువత ఇతివృత్తంగా ఇటీవల వచ్చిన 'ఉడ్తా పంజాబ్' సినిమాకు 94 చోట్ల కత్తెర వేయాలని సెన్సార్ బోర్డు సూచించింది. చిత్ర బృందం బాంబే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే.. ఒకే ఒక్క మాటను తొలగించి చిత్రాన్ని విడుదల చేసుకోవచ్చని తీర్పు వచ్చింది.
మరోవైపు, సెన్సార్ బోర్డు సూచనలపై అభ్యంతరాలుంటే దర్శక నిర్మాతలు ఇప్పటి వరకు ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రైబ్యునల్‌కు వెళ్లేవారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా దీన్ని రద్దు చేసింది. దీనితో సెన్సార్‌పై ఏమైనా అభ్యంతరాలుంటే- దర్శక నిర్మాతలు న్యాయస్థానాల మెట్లు ఎక్కాల్సిందే. కోర్టు తీర్పు ఇచ్చేవరకు చిత్రం విడుదల ఆలస్యమైతే భారీగా నష్టపోవాల్సి వస్తుందని నిర్మాతలు వాపోతున్నారు. వారు ఆర్థికంగా చితికిపోతే ఆ ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా సినీరంగంలోని కొన్ని వందల మందిపై పడుతుంది. ట్రైబ్యునల్ రద్దుతోనే సినీ పరిశ్రమ ఆవేదన చెందుతుంటే, ఇప్పుడు కొత్తగా సూపర్ సెన్సార్ విధానాన్ని ప్రభుత్వం తలకెత్తుకోవడం దర్శక నిర్మాతలకు మరింత ఇబ్బందికరంగా మారనుంది. సెన్సార్ బోర్డు ఒకసారి పరిశీలించి చిత్రప్రదర్శనకు అనుమతిచ్చాక, దాన్ని తిరగదోడే అధికారం ప్రభుత్వానికి లేదని న్యాయస్థానాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఆ మేరకు కన్నడ దర్శకుడు కేఎం శంకరప్ప గతంలో కర్ణాటక హైకోర్టులో కేసు వేస్తే, తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చింది. దాన్ని సుప్రీంకోర్టు సైతం సమర్థించింది. సినిమా సెన్సార్‌షిప్ మీద పంజాబ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జీడీ ఖోస్లా నేతృత్వంలో 1968లో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 20 మంది నిపుణులతో సెన్సార్ బోర్డును పటిష్ఠం చేయాలని, వారు ఒకసారి సినిమాను పరిశీలించి ధ్రువపత్రం ఇచ్చాక దాన్ని మళ్లీ సమీక్షించాల్సిన అవసరం ఉండకూడదని ఆ సంఘం సిఫార్సు చేసింది. రాజకీయ జోక్యానికి అవకాశం లేకుండా కచ్చితమైన నియమ నిబంధనలతో ఈ బోర్డు పనిచేయాలని స్పష్టీకరించింది. మరోవైపు దేశసమగ్రత, సార్వభౌమాధికారాలకు భంగం వాటిల్లుతుందనుకుంటే పౌరుల భావప్రకటనా స్వేచ్ఛకు కొన్ని పరిమితులు విధించవచ్చని రాజ్యాంగం స్పష్టంచేస్తోంది. ఆ పరిమితులే ఆధారంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టానికి పదునుపెడుతోంది.
పరిశ్రమ మనుగడకే ముప్పు
సినిమా అంటేనే సృజనాత్మక కళ. అందులోని ప్రతి చిన్న అంశాన్నీ భూతద్దంలో పెట్టి చూడటం భావ్యం కాదని సినీ దర్శక నిర్మాతలు, రచయితలు వాదిస్తున్నారు. మరోవైపు సినిమాలోని ఏదో ఒక సన్నివేశమో, సంభాషణో తమ మనోభావాలను గాయపరచిందంటూ వ్యక్తులు/ సంస్థలు అభ్యంతరపెట్టడం ఇటీవలి కాలంలో మామూలైపోయింది. ఈ పరిస్థితుల్లో సినిమాపై ఫిర్యాదు వస్తే మళ్లీ సెన్సార్ చేయబూనితే- తమ వ్యక్తిగత అభిరుచులకు భిన్నమైన సినిమాలపై ఎవరో ఒకరు ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే సినీ పరిశ్రమ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని ఆ రంగంలోని అనుభవజ్ఞులు ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క ఓటీటీల్లో జోరెత్తుతున్న అశ్లీల సంభాషణలు, అసభ్య దృశ్యాలను నియంత్రించడానికి మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం- లక్షల మందికి ఉపాధిని, కోట్ల మందికి వినోదాన్ని అందిస్తున్న సినీ పరిశ్రమపై సెన్సార్ కత్తిని వేలాడదీయడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. సహేతుకమైన సెన్సార్‌కు తాము సిద్ధమే కానీ, ఆ పేరు చెప్పి పరిశ్రమను పదేపదే ఇబ్బంది పెట్టకూడదంటున్న వారి సూచనలను ప్రభుత్వం సుహృద్భావంతో స్వీకరించాలి. చలనచిత్ర పరిశ్రమ ప్రతినిధి వర్గాలు, న్యాయ నిపుణులతో చర్చించి కొత్త బిల్లులోని వివాదాస్పద నిబంధనలను పునస్సమీక్షించాలి.
- శ్యాంప్రసాద్ ముఖర్జీ కొండవీటి
ఇదీ చదవండి:New IT Rules: 'ఆ పిటిషన్లు సుప్రీంకోర్టుకు బదిలీ!'