ETV Bharat / opinion

భారత్​కు వ్యతిరేకంగా నేపాల్​లో చైనా చిచ్చు!

భారత్‌-నేపాల్‌ మధ్య కాలాపానీ వివాదం ముదురుతోంది. నాటి ఆంగ్లేయ పాలకులు భారత్‌పై రుద్ది పోయిన అస్పష్టమైన సరిహద్దులతో ఏర్పడ్డ వివాదాల్లో ఇదీ ఒకటి. అయితే ఈ విషయంలో చైనా పరోక్షంగా జోక్యం చేసుకుంటోంది. కాలాపానీకి సమీపంలో చైనాకు అతి ముఖ్యమైన బురాంగ్‌ సైనిక స్థావరం ఉంది. ఈ ప్రాంతం నేపాల్‌కు వెళితే, చైనా దళాలు తేలిగ్గా ఉత్తరాఖండ్‌లోకి చొరబడే ప్రమాదం ఉంది. మరోవైపు చైనాతో భారత్‌ సరిహద్దు వివాదాలూ ఇదే సమయంలో తెరపైకి రావడం గమనార్హం.

China's hand in raising tensons between India-Nepal on Kalapani!
సరిహద్దుల్లో చైనా విపరీత బుద్ధి!
author img

By

Published : May 20, 2020, 7:03 AM IST

Updated : May 20, 2020, 8:54 AM IST

హిమాలయ రాజ్యం నేపాల్‌లో 2019 అక్టోబర్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పర్యటన ముగిసిన కొద్ది రోజుల్లోనే భారత్‌-నేపాల్‌ మధ్య కాలాపానీ వివాదం భగ్గుమంది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడం మొదలుపెట్టాయి. ఈ ఏడాది మే 8న మానససరోవర్‌ యాత్ర కోసం ఉత్తరాఖండ్‌ నుంచి లిపులేక్‌ పాస్‌ వరకు భారత్‌ నిర్మించిన రహదారిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించడంపై నేపాల్‌ అభ్యంతరాలు లేవనెత్తింది. 2015లో భారత్‌-చైనా లిపులేక్‌ మార్గం అభివృద్ధిపై ఒప్పందం చేసుకొన్నప్పుడూ నేపాల్‌ అలాగే స్పందించింది. 1816 నాటి 'సుగౌలీ ఒప్పందం' ప్రకారం ఆ ప్రదేశం తమకు చెందుతుందన్నది నేపాల్‌ వాదన. నాటి ఆంగ్లేయ పాలకులు భారత్‌పై రుద్ది పోయిన అస్పష్టమైన సరిహద్దులతో ఏర్పడ్డ వివాదాల్లో ఇదీ ఒకటి. కాళీ నది జన్మస్థలం... సరిహద్దులను గుర్తించకుండా చేసుకొన్న ఈ ఒప్పందం కారణంగా ఇప్పుడు భారత్‌ అధీనంలోని భూమీ తమదేనని నేపాల్‌ వాదిస్తోంది. తాజాగా లిపులేక్‌ పాస్‌ సమీపంలోకి నేపాల్‌ సైన్యాన్ని తరలించడంతో పరిస్థితి మరింత విషమించింది.

చైనా పరోక్ష జోక్యం

భారత్‌కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన కాలాపానీ ప్రాంతం తమదేనని నేపాల్‌ చెబుతోంది. భారత్‌కు ఈ ప్రదేశంలో సైనిక స్థావరం ఉండటం చాలా ముఖ్యం. 35 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న నిర్మానుష్యమైన కాలాపానీ ప్రాంతంలో 3,500 మీటర్ల నుంచి 6,000 మీటర్లకు పైగా ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. దీనికి సమీపంలో చైనాకు అతి ముఖ్యమైన బురాంగ్‌ సైనిక స్థావరం ఉంది. ఈ ప్రాంతం నేపాల్‌కు వెళితే, చైనా దళాలు తేలిగ్గా ఉత్తరాఖండ్‌లోకి చొరబడే ప్రమాదం ఉంది. ఇటీవల నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీలో విభేదాలు తలెత్తి ప్రధాని ఖడ్గప్రసాద్‌ ఓలీ రాజకీయంగా ఇబ్బందుల్లో పడ్డారు. ఆ సమస్య పరిష్కారానికి చైనా దౌత్యవేత్త హౌయాన్‌క్వీ నేరుగా రంగంలో దిగి పార్టీ నాయకులతో సుదీర్ఘ చర్చలు జరిపారు. అదే సమయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నేపాల్‌ అధ్యక్షురాలు బిద్యాదేవీ భాండారికి ఫోన్‌ చేసి మాట్లాడారు. ఓలీ సర్కారు బాగా పని చేస్తోందని కితాబినిచ్చారు. ఇది పరోక్షంగా ఓలీకి మద్దతు ప్రకటించడమే. ఇది జరిగిన కొన్నాళ్లకు చైనాలోని 'ఖొమోలాంగ్మా' శిఖరం అంటూ ఎవరెస్ట్‌ శిఖరాన్ని ఉద్దేశించి చైనా వార్తా సంస్థ సీజీటీఎన్‌ ట్వీట్‌ చేసింది. దీనిపై నేపాల్‌ విదేశాంగశాఖ నోరు మెదపకపోవడం చైనా పట్టును తెలియజేస్తోంది. 'నేపాల్‌ మరెవరి కోసమో సమస్యలు సృష్టిస్తోంది' అని భారత సైనికాధిపతి జనరల్‌ నరవణే చేసిన వ్యాఖ్యల వెనక అర్థమిదే.

చైనాతో భారత్‌ సరిహద్దు వివాదాలూ ఇదే సమయంలో తెరపైకి రావడం గమనార్హం. 'నాకులా' వద్ద ఇరుదేశాల సైనికులు బాహాబాహీ తలపడ్డారు. ఆ తరవాత చైనా హెలికాప్టర్లు అక్కడ చక్కర్లు కొట్టడం మొదలుపెట్టడంతో భారత్‌ సుఖోయ్‌ యుద్ధవిమానాలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. మరోపక్క అదే సమయంలో భారత్‌ కొన్ని దశాబ్దాలుగా వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ గిల్గిట్‌- బాల్టిస్థాన్‌లో 'డయమెర్‌ బాషా' ప్రాజెక్టు నిర్మాణానికి డ్రాగన్‌ సై అంది. చైనా ప్రభుత్వ రంగానికి చెందిన 'పవర్‌ చైనా', పాక్‌ సైన్యానికి చెందిన ఫ్రాంటియర్‌ వర్క్స్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఓడబ్ల్యూ) ఇందుకు ఒప్పందం కుదుర్చుకొన్నాయి. 4,300 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో చైనా కంపెనీకి 70శాతం వాటా, ఎఫ్‌ఓడబ్ల్యూకు 30శాతం వాటా లభించనుంది. దీంతో భారత్‌ అభ్యంతరాలను చైనా ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విషయం తేలిపోయింది. తాజాగా చైనా ఆక్సాయ్‌చిన్‌ వద్ద గాల్వన్‌లోయలోకి బలగాలను తరలించింది. అంతిమంగా నేపాల్‌, చైనా, పాక్‌ సరిహద్దుల్లో 8,500 కిలోమీటర్ల మేర ఉద్రిక్తతలు కొనసాగే పక్షంలో భారత్‌లోకి వచ్చే పెట్టుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. తమ దేశం నుంచి కంపెనీలు ఏయే దేశాలకు వలస వెళతాయన్న అనుమానం ఉందో.. ఆయా చోట్ల డ్రాగన్‌ దూకుడు ప్రదర్శిస్తోంది. జపాన్‌తో 'షెంకాకు' ద్వీపం సమీపంలో, వియత్నామ్‌తో పరాసల్‌ ద్వీపం వద్ద, ఇండొనేసియాతో 'నటునా' ద్వీపం వద్ద ఘర్షణ పూరితంగా వ్యవహరిస్తోంది.

ఆచితూచి వ్యవహరిస్తున్న ఇండియా

ఇంత జరిగినా కరోనా వైరస్‌ పుట్టుకపై, ప్రపంచ ఆరోగ్య సంస్థ వైఖరిపై భారత్‌ ఆచితూచి స్పందిస్తోంది. ఇప్పటికే 'క్వాడ్‌' బృందంలోని జపాన్‌, అమెరికా, ఆస్ట్రేలియాలు డ్రాగన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాయి. వైరస్‌ పుట్టుక, వ్యాప్తిపై దర్యాప్తు కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్‌ ఒక్కటే సహప్రాయోజక కర్తగా వ్యవహరించింది. ఈ తీర్మానానికి నేపాల్‌, పాకిస్థాన్‌ దూరంగా ఉండిపోవడమే వాటి బంధాన్ని సూచిస్తోంది. ఈ దర్యాప్తు వల్ల చైనాకు వచ్చే నష్టమేమీ కనిపించడం లేదు. తాజా పరిణామాలతో చైనా వైఖరిని దృష్టిలో పెట్టుకొని భారత్‌ కూడా తైవాన్‌ విషయంలో కొంత దూకుడుగా ఉండాల్సిన అవసరం ఉంది. 'వరల్డ్ హెల్త్ అసెంబ్లీ'లో తైవాన్‌కు పరిశీలకుడి హోదా ఇచ్చే అంశంపై భారత్‌ గళం విప్పితే భవిష్యత్తులో చైనా పీఓకే విషయంలో తన దూకుడు తగ్గించుకొనే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా, డ్రాగన్‌కు నొప్పి తెలిసేలా భారత్‌ నిర్ణయాలు ఉంటేనే చైనా దారికి వస్తుంది.

--- పెద్దింటి ఫణికిరణ్​

Last Updated : May 20, 2020, 8:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.