కేంద్రం ముందడుగేస్తేనే- రైతాంగానికి జీవన భద్రత - ఆహార శుద్ధి పథకం
రానున్న ఆరేళ్లలో ఆహార శుద్ధి రంగంలో ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు రూ.10900 కోట్లతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. నూతన పథకం వల్ల ప్రపంచ స్థాయి ఆహార తయారీ సంస్థల ఆవిర్భావానికి, అంతర్జాతీయ విపణిలో భారతీయ ఆహారోత్పత్తి బ్రాండ్లను ప్రోత్సహించడానికి దోహదపడుతుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
ఆధునిక సాంకేతికత, శుద్ధి, ప్యాకేజింగ్ పరిజ్ఞానాలతో సంప్రదాయ భారతీయ ఆహార రుచులు ఇతర దేశాల్ని మురిపించి మెప్పించగలవని దాదాపు మూడున్నరేళ్ల క్రితం 'వరల్డ్ ఫుడ్ ఇండియా' వేదికపై ప్రధాని మోదీ ప్రసంగం ఆశావహ దృశ్యాన్ని ఆవిష్కరించింది. ఆహార శుద్ధి రంగాన పెట్టుబడిదారులకు ఇక్కడ అవకాశాల స్వర్గం నెలకొని ఉందనీ అప్పట్లో ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ ప్రకటన ఘనంగా చాటింది. ఆ బాణీకి కొనసాగింపుగా, వచ్చే ఆరేళ్లపాటు ఆహార శుద్ధి విభాగాల్లో సమధిక పెట్టుబడుల్ని రాబట్టి, రెండున్నర లక్షల ఉపాధి అవకాశాలు సృష్టించగలదంటూ కేంద్రం రూ.10900 కోట్లతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని తాజాగా ప్రకటించింది. ఈ చొరవ ప్రపంచ స్థాయి ఆహార తయారీ సంస్థల ఆవిర్భావానికి, అంతర్జాతీయ విపణిలో భారతీయ ఆహారోత్పత్తి బ్రాండ్లను ప్రోత్సహించడానికి దోహదపడగలదన్న దిలాసా కేంద్ర వాణిజ్య శాఖామాత్యులు పీయూష్ గోయల్ మాటల్లో ఉట్టిపడుతోంది. నూతన పథకం దన్నుతో సుమారు రూ.33 వేల కోట్ల విలువైన శుద్ధీకరించిన ఆహారోత్పత్తి సాధించగల వీలుందన్నది అధికారిక అంచనా. దేశంలో ఉత్పత్తయ్యే ఆహారంలో ప్రాసెసింగ్ ప్రక్రియకు నోచుకుంటున్నది 10శాతం లోపేనని, తగినన్ని నిల్వ సదుపాయాలు కొరవడి ఏటా రూ.90 వేల కోట్ల మేర నష్టపోతున్నామని ఆమధ్య 'నీతి ఆయోగ్' లెక్కకట్టింది. అంత భారీయెత్తున వృథాను నివారించడానికి కేవలం రూ.1800 కోట్ల మేర వార్షిక వ్యయంతో ఆరేళ్ల పథకం ఏ మేరకు అక్కరకొస్తుంది? యావత్ దేశంలో విస్తృత సేద్య అవకాశాలు, వివిధ రకాల నేలలు, భిన్న వాతావరణాలు, దేశీయ అవసరాలు, ఎగుమతులపై సమగ్ర జాతీయ ప్రణాళికలో ఆహార శుద్ధి అంతర్భాగమయ్యేలా పటుతర కార్యాచరణ వ్యూహం నేడు అత్యావశ్యకం.
రికార్డులకు ఎక్కని నష్టాల తీవ్రత
తరతమ భేదాలతో దేశంలో ఎక్కడైనా ఏదైనా పంట దిగుబడి పెరిగితే రైతన్న బతుకుబండి అమాంతం కుంగిపోవడం చూస్తున్నాం. ఏ కారణంగా సరఫరాలు తగ్గినా, పాత నిల్వల్నీ బిగపట్టి ధరలకు కృత్రిమ రెక్కలు మొలిపించి అందినకాడికి ఎడాపెడా దండుకోవడంలో దళారులు, వ్యాపారుల ప్రావీణ్యం అపారం. కోత ఖర్చులు సైతం రాబట్టుకోలేని నిస్సహాయ స్థితిలో రైతులు పొలాల్లోనే టొమాటోలు, ఉల్లిగడ్డలు, బంగాళాదుంపలు తదితరాల్ని వదిలేస్తున్న ఉదంతాలు లెక్కకు మిక్కిలి. అత్యంత భారీ ఫుడ్ పార్కుల నిర్మాణం ద్వారా అటువంటి దురవస్థ పునరావృతం కాకుండా కాచుకుంటామన్న మునుపటి విధాన ప్రకటన దస్త్రాల్లోనే నీరోడుతోంది. ఇప్పటికీ పుట్టగొడుగులు టొమాటోలు 12శాతం, ఆలుగడ్డలు తొమ్మిది శాతం, ఉల్లిపాయలు 7.5శాతం దాకా వృథాగా పోతున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రికార్డులకు ఎక్కని నష్టాల తీవ్రత ఎంతటిదో ఎవరికెరుక? ఒకవైపు రైతుల ఏటికి ఎదురీత, పెద్దయెత్తున ఆహార వృథా, మరోపక్క- కోట్లమంది అన్నార్తుల ఆకలి కేకలు పునరావృతం కాకుండా.. విధానాల శుద్ధి కీలకం.
దేశంలో భిన్న వాతావరణ జోన్లకు వర్తించేలా సత్వరం సమగ్ర వ్యవసాయ ప్రణాళిక పట్టాలకు ఎక్కాలి. తక్కువ సమయంలో పాడయ్యే పళ్లు, టొమాటో తదితరాలతో నిల్వ ఉండే ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తే సాగుదారులకు, దేశార్థికానికి అది ఉభయతారకమవుతుంది. కార్పొరేట్ సేద్యం అమెరికా గ్రామీణార్థికాన్ని దీనావస్థకు దిగజార్చిందన్న 'నాసా' మాజీ శాస్త్రవేత్త బేదబ్రత పైన్ ప్రభృతుల నిశిత అధ్యయనాంశాల్ని పట్టించుకోకుండా, దేశీయంగా ఎలాంటి సంప్రతింపులకూ తావివ్వకుండా- వండివార్చిన చట్టాలు రైతుల గుండెల్ని మండిస్తున్నాయి.
ఆ వివాదాస్పద శాసనాల్ని ఉపసంహరించుకుని, అడుగడుగునా సుడిగుండాల పెనుముప్పు బారినుంచి అన్నదాతల్ని సంరక్షించేలా కేంద్రం ముందడుగేస్తేనే- జాతికి ఆహార స్వావలంబన, రైతాంగానికి జీవన భద్రత ఒనగూడేది!
ఇదీ చదవండి: ఆహార శుద్ధి పరిశ్రమలకు రూ.10,900 కోట్లు