ETV Bharat / opinion

'పకడ్బందీ వ్యూహంతో కులగణన సుసాధ్యమే' - కులగణన ఎవరు చేపడుతారు?

కులాలవారీ జనగణన.. దేశంలో ఎప్పటినుంచో వినిపిస్తున్న డిమాండ్‌లలో ఒకటి. సమగ్ర అభివృద్ధి పథకాలను రూపొందించేందుకు కులాలవారీ జనాభా లెక్కలు అత్యావశ్యకమని.. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని అనేక విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ అధికారికంగా గణించేందుకు గుర్తించేందుకు, వెల్లడించేందుకు ప్రభుత్వాలు తర్జనభర్జనలు పడుతుండటం విస్మయం కలిగిస్తోంది.

caste census
కులగణన
author img

By

Published : Oct 22, 2021, 5:21 AM IST

భారతీయ సమాజంలో కులం- విస్మరించలేని చేదునిజం! తరాల తరబడి కొనసాగుతున్న దుర్విచక్షణ, జనాభాలో కొన్ని వర్గాలను వెనకబాటులోకి నెట్టిందన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. స్వతంత్ర భారతి తొలివేకువ వేళే దాన్ని గుర్తించిన జాతినేతలు- అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం రిజర్వేషన్లతో నిర్దిష్ట ఆలంబనలను అందించారు. రాజ్యాంగబద్ధమైన ఆ ఏర్పాట్లు లక్షిత వర్గాలకు సక్రమంగా చేరుతున్నాయో లేదో నిర్ధారించడమన్నది, సహేతుక గణాంక ఆధారాలతోనే సాధ్యం!

దేశవ్యాప్తంగా ఏయే కులాలవారు ఎంతమంది ఉన్నారు, వారి ఆర్థిక సామాజిక రాజకీయ స్థితిగతులేమిటనేది అధికారికంగా గణించేందుకు గుర్తించేందుకు వెల్లడించేందుకు ప్రభుత్వాలు తర్జనభర్జనలు పడుతుండటమే విస్మయకరం! ఆంగ్లేయుల ఏలుబడిలో 1931లో సేకరించిన కులాల సమాచారమే దేశీయంగా దశాబ్దాల పాటు అనేక అంశాలకు ప్రాతిపదికగా నిలిచింది. భారత సమాజ సమైక్యతకు కులభావన విఘాతకరమవుతుందన్న భావనలో స్వాతంత్య్రానంతర కాలంలో దేశ నాయకత్వం కులగణనను పక్కనపెట్టింది. వెనకబడిన తరగతుల వారి వివరాలను 1951 జనాభా లెక్కల్లో భాగంగా సేకరించినా- ఆ సమాచారాన్ని క్రోడీకరించి ప్రచురించలేదు.

ఆరు దశాబ్దాల తరవాత గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో సామాజిక ఆర్థిక కుల గణన (ఎస్‌ఈసీసీ) చేపట్టినా- అందులోని వివరాలను బహిరంగపరచలేదు. సామాజిక వర్గాలవారీగా జనసంఖ్యను నిగ్గుతేల్చాలన్న వాదన రాజకీయ త్రాసులో పైకీ కిందికీ ఊగిసలాడుతూ వస్తోంది. ఇటీవల అన్ని పార్టీలూ కలిసి 127వ రాజ్యాంగ సవరణ బిల్లును గట్టెక్కించడంతో ఓబీసీ జాబితాలను రూపొందించే అధికారం రాష్ట్రాలకు తిరిగి దఖలుపడింది. తదనంతర పరిణామాలతో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలంటున్న గళాలకు కొత్త శక్తి ఒనగూడింది!

కులాలవారీగా లెక్కలు వెలుగుచూస్తే రాజకీయాలపై పెను ప్రభావం పడుతుందేమోనన్న సంశయం పాలకులను పీడిస్తోంది. 2011 ఎస్‌ఈసీసీలో అశాస్త్రీయ విధానాలు అవలంబించారని, అందులో సాంకేతిక, న్యాయపరమైన సమస్యలెన్నో ఉన్నాయన్నది అధికారపక్షం అభ్యంతరంగా విదితమవుతోంది. వ్యక్తుల కుల, మత వివరాలకు సంబంధించి ఆనాటి సామాజిక ఆర్థిక కులగణన నూటికి 99పాళ్లు వాస్తవాలకే అద్దంపడుతోందని అయిదేళ్ల క్రితం పార్లమెంటరీ స్థాయీసంఘం ఎదుట భారత రిజిస్ట్రార్‌ జనరల్‌, సెన్సస్‌ కమిషనర్‌ ధ్రువీకరించారు. కేంద్రప్రభుత్వం మాత్రం ఆ గణనను తప్పులతడకగా అభివర్ణిస్తూ, దాన్ని బయటపెట్టలేమని సర్వోన్నత న్యాయస్థానానికి ఇటీవల నివేదించింది!

ఎస్‌ఈసీసీలో లోపాలు నిజమైతే- తాజాగా కులగణన చేపట్టి, సరైన సమాచారాన్ని క్రోడీకరించి వెల్లడించడానికి అభ్యంతరమేమిటి? 35శాతం మంత్రి పదవులతో ఓబీసీ వర్గానికి తాము సమధిక ప్రాధాన్యమే కల్పిస్తున్నట్లు ఎన్‌డీఏ సర్కారు చెబుతున్నా- కులాలవారీ జనగణనకు విపక్షంతోపాటు స్వపక్షం నుంచీ ప్రభుత్వంపై ఒత్తిళ్లు అధికమవుతున్నాయి. దేశంలోని అన్ని కులాల ఆర్థిక, సామాజిక స్థితిగతులు వెలుగులోకి వస్తే- ప్రగతి ప్రస్థానంలో వెనకంజలో ఉన్నవారిని పై అంచెకు చేర్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలను పట్టాలెక్కించడానికి మార్గం సుగమమవుతుంది. సామాజిక సమతులాభివృద్ధికి దోహదపడే విధానాల రూపకల్పనకు కులాల సమాచారం దారిదీపం కావాలి కానీ, ప్రజల మధ్య కొత్త చీలికలకు అది కారణభూతం కాకూడదు.

సమాజాభ్యున్నతి గతిరీతుల సూత్రీకరణలకు మౌలిక ఆధారమైన జనగణనను శాస్త్రీయ పద్ధతిలో సవ్యంగా చేపడితే- వెనకబడిన వర్గాల సముద్ధరణకు పకడ్బందీ పథక రచన, పటుతర కార్యాచరణ సుసాధ్యమవుతాయి. విద్యారంగాన్ని సంస్కరణల బాటపట్టించి మేలిమి ప్రమాణాలకు పట్టంకడితే- జాతీయ విజ్ఞాన సంఘం లోగడ ఉద్బోధించినట్లు, రిజర్వేషన్ల ఆసరా లేకుండానే అన్ని వర్గాలూ అభివృద్ధి పథంలో ముందడుగేస్తాయి!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.