ప్రపంచం నలుమూలలా కరోనా మహమ్మారి వీర విజృంభణ అడ్డూఆపూ లేకుండా కొనసాగుతోంది. విశ్వవ్యాప్తంగా కోటీ 21లక్షలకు పైబడిన కొవిడ్ కేసులలో నాలుగోవంతు ఒక్క అమెరికాలోనే నమోదయ్యాయి. 17లక్షలకు మించి కరోనా బాధితులు వెలుగుచూసిన బ్రెజిల్ తరవాత మూడోస్థానాన నిలిచిన భారత్‌లో మొత్తం కేసులు ఎనిమిది లక్షలకు చేరువయ్యాయి. రాష్ట్రాలవారీగా కొవిడ్ పీడితులు రికార్డు స్థాయిలో నిర్ధారణ కావడం పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతోంది. ప్రధాని మోదీ వ్యాఖ్యానించినట్లు- 'కరోనాపై పోరాటం ఇప్పట్లో ముగిసేది కాదు'! శతాబ్దకాలంలో కనీవినీ ఎరుగనంతటి ఆరోగ్య సంక్షోభాన్ని అధిగమించడంలో ప్రజలపరంగా 'సన్నద్ధత' తీరుతెన్నులు విస్మయపరుస్తున్నాయి. గట్టిగా తుమ్మితే, దగ్గితే వచ్చే పెద్దతుంపర్లతోనే కరోనా వైరస్ ఇతరులకు సోకుతుందని ఇప్పటిదాకా చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ బాణీ తాజాగా మారింది.
గాలి ద్వారా..
మాట్లాడినప్పుడు వచ్చే సూక్ష్మతుంపర్లతోనూ ముప్పు తప్పదంటున్న డబ్ల్యూహెచ్‌ఓ గాలిద్వారానూ వైరస్ వ్యాపించే ప్రమాదాన్ని సరికొత్తగా గుర్తించింది! దగ్గు, తుమ్ములద్వారా ఒకరినుంచి మరొకరికి కరోనా వ్యాపించకుండా కట్టడిచేసే లక్ష్యంతోనే లాక్‌డౌన్ విధించడం తెలిసిందే. ప్రార్థనా మందిరాలు, థియేటర్లు, మ్యూజియాలు, వ్యాయామశాలలు తదితరాల్ని మూసేసిన ప్రధాన కారణమదే. ఆ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ కొన్నాళ్లుగా జనసామాన్యంలో నిబంధనల ఉల్లంఘన పెచ్చరిల్లుతోంది. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయవద్దని నిపుణులు పదేపదే చెబుతున్నా- పెడచెవిన పెడుతున్నవారి సంఖ్య భారీగానే ఉండటం తీవ్ర ఆందోళనకరం. కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారిలోనూ కొంతమంది రోడ్లపై తిరుగుతున్నారని, అటువంటివారూ మాస్కులు ధరించకపోవడం వైరస్ విస్తరణ వేగం పెరగడానికి ముఖ్యకారణమన్న విశ్లేషణలు- పోనుపోను పరిస్థితి చేజారుతున్నట్లు స్పష్టీకరిస్తున్నాయి. స్వీయ రక్షణ, సామాజిక భద్రత పరస్పర ఆశ్రితాలని గుర్తించి సకల జాగ్రత్త చర్యలకు జాగృత ప్రజానీకం సిద్ధం కావాలి!
నిర్లక్ష్యమే కారణం..
కరోనాపై మహా సంగ్రామంలో ప్రజలే నిర్ణయాత్మక శక్తులని ప్రధాని సరిగ్గానే సూత్రీకరించినా- 'నా ఒక్కడివల్ల ఏమవుతుందిలే!' అన్న ఉదాసీనత, పర్యవసానాలను పట్టించుకోని నిర్లక్ష్యం క్షేత్రస్థాయిలో ప్రస్ఫుటమవుతున్నాయి. ముఖానికి మాస్కు ధరించకుండా పట్టుబడినవారి నుంచి జరిమానాల రూపేణా ఒడిశా పోలీసుల వసూళ్లు కోటీ పాతిక లక్షల రూపాయలకు మించిపోయాయి. దేశ రాజధానిలోనూ కొవిడ్ నిబంధనల ఉల్లంఘనులనుంచి దిల్లీ పోలీసులు కోటి రూపాయలకుపైగా రాబట్టారు. కచ్చితంగా భౌతికదూరం నిబంధన పాటించకపోతే 14 రోజుల లాక్‌డౌన్ విధిస్తామని ఆగ్రా జిల్లా యంత్రాంగం హెచ్చరించగా- అటు కేరళ కొత్తశిక్షలు ప్రకటించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, విధిగా మాస్కులు ధరించకపోయినా- పదివేల రూపాయల జరిమానాతోపాటు రెండేళ్ల జైలుశిక్షా తథ్యమని పినరయి విజయన్ సర్కారు కొరడా ఝళిపిస్తోంది.
బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తేనే..
పోలీసులు నడిరోడ్డుపై ఆపి చలానాలు విధించే అవమానకర పరిస్థితి ఏ రాష్ట్ర వాసులకైనా గౌరవం కాదు. ఎవరో నియంత్రిస్తేనే తప్ప ప్రజలు సామాజిక బాధ్యతలు గుర్తెరగకపోవడం, ఏరికోరి పెనుముప్పు కొనితెచ్చుకోవడమే. కేంద్ర రాష్ట్రప్రభుత్వాల శక్తిసామర్థ్యాలకు గల పరిమితుల్ని గ్రహించి పౌరసమాజం బాధ్యతాయుత పాత్రపోషణకు సమాయత్తమైతేనే, కరోనాపై ఉమ్మడి పోరు అర్థవంతమవుతుంది. ప్రజల కీలక భాగస్వామ్యం లేనిదే మహమ్మారిమీద పైచేయి సాధించడం వీలుపడదు. ప్రస్తుత సంక్షిష్ట సంక్షోభ సమయంలో ప్రతి పౌరుడూ సుశిక్షిత సైనికుడిగా నిర్ణాయక భూమికకు సిద్ధపడాలి. ముఖానికి మాస్కు, చేతుల పరిశుభ్రత, భౌతిక దూరం తదితర నిబంధనల్ని కచ్చితంగా పాటించడంలో- తోటివారిలో సదవగాహన కలిగించి పల్లెలు, పట్టణాల్లో బలమైన సామాజికోద్యమం నిర్మించాలి!
ఇదీ చదవండి: కరోనా కట్టడి కోసం పుణెలో పూర్తిస్థాయి లాక్‌డౌన్