గత డిసెంబరు చలి కాలం, మంచు విపరీతంగా పడుతోంది. 82 ఏళ్ల ముసలావిడను ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఆమె నడవలేదు. పైగా రాత్రి. వాళ్లు బడ్డీ క్యాబ్స్‌ను సంప్రదించారు. వాళ్లు ఆమెను సురక్షితంగా ఆసుపత్రిలో చేర్చారు. క్యాబ్ సర్వీస్.. బుక్ చేసుకుంటే ఎవరైనా చేసేదే! దీనిలో కొత్తేముంది అనిపిస్తోందా? కానీ ఉంది. ఇది అంగవైకల్యం ఉన్నవారు, కదల్లేని వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాబ్ సర్వీస్.
వారికోసమే
గతేడాది కరోనా, లాక్‌డౌన్ కారణంగా ఆసుపత్రులకు, బయటకు వెళ్లడానికి ఎంతోమంది ఇబ్బందిపడ్డారు. ఇక అంగవైకల్యం ఉన్నవారు, వృద్ధుల సంగతి చెప్పనక్కర్లేదు. వీటికి సమాధానంగానే సర్‌తజ్ లంబా ‘బడ్డీ క్యాబ్’లను ప్రారంభించారు. చండీగఢ్‌కు చెందిన ఈమె తండ్రి ఏర్‌ఫోర్స్ ఆఫీసర్. భర్త ఆర్మీ ఆఫీసర్. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారు. ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఏడబ్ల్యూడబ్ల్యూఏ)లో చేరి, వాలంటరింగ్, నిధులు సేకరించడం వంటివి చేసేవారు. వాటిని పేదలకు, అవసరమైనవారికి అందజేసేవారు.
ఆర్మీ స్ఫూర్తితో
ఆడవాళ్లకు ఉపాధి అందించాలన్న ఉద్దేశంతో సర్‌తజ్ ఏజే ట్రావెల్స్‌ను ప్రారంభించారు. ఇది పర్యాటకం, రవాణా సేవల సంస్థ. ఓసారి తన మామగారికి పార్కిన్‌సన్ వ్యాధి సోకింది. చికిత్స కోసం తరచూ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చేది. చుట్టూ ఆర్మీ వాళ్లే అవడంతో ఎవరో ఒకరు అడగకుండానే సాయానికి వచ్చేవారు. అయినా ఒక్కోసారి ఇబ్బంది అవుతుండేది. ‘ఇంతమంది సాయానికి వస్తున్నా పరిస్థితి ఇలా ఉంటే.. అసలు ఆ అవకాశమే లేని వారి పరిస్థితేంట’న్న ఆలోచన సర్‌తజ్‌ను తొలిచివేసేది. దాని ఫలితమే బడ్డీ క్యాబ్స్. ఆర్మీ వాళ్లలో ‘అన్నదమ్ముల్లా కలిసి పోరాడటం’ అన్న స్ఫూర్తి ఆధారంగా తన వెంచర్‌కు ఆ పేరు పెట్టింది.
మెంబర్షిప్ కూడా
దీనిలో వీల్‌చైర్ ఆధారంగా వారిని తీసుకెళ్లే వీలుంటుంది. అందుకు తగ్గట్టుగా వాహనాల్లో మార్పులు చేయించింది. విశ్రాంత సైనికోద్యోగుల్ని సర్‌తజ్ నియమించుకున్నారు. డ్రైవింగ్‌తో పాటు భద్రతా ప్రమాణాలు, సాఫ్ట్‌స్కిల్స్‌లో వారికి శిక్షణనిస్తున్నారు. వైకల్యం ఉన్నవారు, వృద్ధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలనూ నేర్పిస్తారు. వీళ్లు కేవలం రవాణాకే పరిమితం కారు, అవసరమైన సాయాన్నీ అందిస్తారు. ఈ సేవలు ప్రస్తుతం ఉత్తర భారత దేశ రాష్ట్రాలన్నింటా లభిస్తున్నాయి. సేవలు అవసరమైన వారు యాప్‌లో సంప్రదిస్తే సరిపోతుంది. తరచూ ఆసుపత్రులకు వెళ్లే వారి కోసం మెంబర్‌షిప్‌నీ ప్రవేశపెట్టారు. ప్రతి క్యాబ్‌నూ రోజూ రోడ్డు మీదకు వెళ్లేముందు 20 రకాల పరీక్షలు చేస్తారు. అన్నీ సంతృప్తికరంగా ఉంటేనే అనుమతిస్తారు. చిన్న నుంచి పెద్దవాళ్ల అభిరుచికి తగ్గట్టుగా మ్యూజిక్ ఆల్బమ్స్‌ను క్యాబ్‌ల్లో సర్‌తజ్ సిద్ధం చేశారు.
‘ప్రస్తుతం తరచూ ప్రయాణ అవసరం ఉన్న 1500 - 2000 మంది మా సేవలను పొందుతున్నారు. క్రమశిక్షణతో కూడిన డ్రైవింగ్‌తోపాటు నిరంతరం అందుబాటులో ఉండటం మమ్మల్ని వారికి చేరువ చేస్తోంది. అంగవైకల్యం ఉన్నవారు, నిస్సహాయులు ఏదైనా విషయంలో ఇబ్బంది పడుతుంటే ‘అయ్యో’ అనడమో, వినడమో చేస్తుంటాం. కానీ వారికి కావాల్సింది అది కాదు, మరొకరిపై ఆధార పడకుండా ఉండే స్వతంత్రత. దాన్ని వాళ్లకి ఇలా అందించే ప్రయత్నం చేస్తున్నా’ అంటున్నారు సర్‌తజ్.
ఇదీ చదవండి: TPCC: టీపీసీసీ అధ్యక్ష వేడి.. ఎంపికపై వీడని ఉత్కంఠ