BJP Tough Seats In Chhattisgarh : ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి అందని ద్రాక్షగా ఉన్న 9 నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది కాషాయ దళం. ఆ స్థానాల్లో ఓడిపోతోందన్న సంప్రదాయాన్ని బద్దలుకొట్టి కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. ఇందుకోసం పక్కాగా ప్లాన్ చేసి ఆరు కొత్త ముఖాలను బరిలోకి దించుతోంది కమలం పార్టీ. ఇందులో సీతాపుర్, పాలి తానాఖర్, మార్వాహి, మోహలా మాన్పుర్, కోంటా స్థానాలు ఎస్టీ రిజర్వ్ కాగా.. ఖార్సియా, కోర్బా, కోటా, జైజైపుర్ జనరల్ నియోజకవర్గాలు.
BJP Plan for Chhattisgarh 2023 : 2000లో మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరిగిన 2003, 2008, 2013 వరుస ఎన్నికల్లో విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ. వరుసగా 50, 50, 49 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి 2018లో షాక్ ఇచ్చింది కాంగ్రెస్. 90 స్థానాల్లో 68 సీట్లను గెలుచుకుని.. వరుసగా మూడు సార్లు గెలిచిన రమణ్‌సింగ్ సర్కార్‌ను గద్దెదించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం 15 స్థానాలకే పరిమితమైంది.
"ఇప్పటివరకు విజయం సాధించని స్థానాలపై బీజేపీ దృష్టి సారించింది. ఎంపిక చేసిన అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వారికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది."
--సంతోష్ పాండే, బీజేపీ ఎంపీ, ప్రచార కమిటీ కన్వీనర్
కోంటా
రాష్ట్ర పరిశ్రమల మంత్రి కవాసి లఖ్మా.. గిరిజనులను ప్రభావితం చేసే కాంగ్రెస్ నేత. నక్సల్ ప్రభావిత బస్తర్ ప్రాంతంలోని కోంటా స్థానంలో 1998 నుంచి వరుసగా ఐదుసార్లు గెలుపొందారు. ఈయనపై కొత్త వ్యక్తి సోయం ముక్కాను బరిలోకి దించింది బీజేపీ. ఈయన మావోయిస్ట్ వ్యతిరేక సాల్వా జూడుంలో పనిచేశారు. అయితే, ఈ స్థానంలో కాంగ్రెస్, బీజేపీతో పాటు సీపీఐ కూడా బలంగా ఉండడం వల్ల త్రిముఖ పోరు కనిపిస్తోంది. 2018 ఎన్నికల్లో లఖ్మా 31,933 ఓట్లు సాధించగా.. బీజేపీ అభ్యర్థి 25,224, సీపీఐ 24,549 ఓట్లు సంపాదించింది.
సీతాపుర్
కాంగ్రెస్‌కు చెందిన మరో గిరిజన నేత అమర్జీత్ భగత్.. రాష్ట్రం ఏర్పడిన నుంచి సీతాపుర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈయన భూపేశ్ బఘేల్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. గిరిజనుల్లో బలమైన నేతగా పేరున్న భగత్‌పై.. ఇటీవలె సీఆర్పీఎఫ్కు రాజీనామా చేసి పార్టీలో చేరిన రామ్ కుమార్ టొప్పోను బరిలో నిలిపింది బీజేపీ.
"నేనేప్పుడూ రాజకీయ నాయకుడిని అవుతానని ఊహించలేదు. సీతాపుర్ ప్రజలు నన్ను పోటీ చేయాలని బలవంతం చేశారు. సుమారు 15,000 లేఖలు రాశారు. అందులో ఒకటి లైంగింక వేధింపులకు గురైన బాధితురాలు తన రక్తంతో రాసింది. దీంతో వారి విజ్ఞప్తిని కాదనలేకపోయాను. కాంగ్రెస్ అభ్యర్థిని నేను పోటీగా తీసుకోవడం లేదు."
--రామ్‌కుమార్ టొప్పో, బీజేపీ అభ్యర్థి, మాజీ సీఆర్పీఎఫ్ అధికారి
ఖార్సియా
కాంగ్రెస్ ప్రభుత్వంలోని మరో మంత్రి ఉమేశ్ పటేల్‌ను ఓడించాలనే లక్ష్యంతో ఖార్సియా స్థానంలో కొత్త అభ్యర్థిని బరిలో దింపుతోంది బీజేపీ. ముచ్చటగా మూడోసారి పోటీలో ఉన్న ఉమేశ్‌పై మహేశ్ సాహు అనే కొత్త అభ్యర్థిని ప్రకటించింది బీజేపీ. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే కాదు.. 1977 నుంచి ఖార్సియా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. 2013లో నక్సలైట్ల దాడిలో మరణించిన ఉమేశ్ పటేల్ తండ్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు నంద్‌కుమార్ పటేల్.. ఇక్కడి నుంచి ఐదుసార్లు గెలుపొందారు.
మార్వాహి
కాంగ్రెస్ కంచుకోటలైన మార్వాహి, కోటా నియోజకవర్గాలను 2018 ఎన్నికల్లో జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ కైవసం చేసుకుంది. ఛత్తీస్‌గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగి.. 2001లో మార్వాహికి జరిగిన ఉపఎన్నికల్లో గెలుపొందారు. ఆ తర్వాత 2003, 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. 2013లో ఆయన కుమారుడు అమిత్ జోగి గెలుపొందారు. 2018లో తాను కొత్తగా స్థాపించిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ పార్టీ నుంచి విజయం సాధించారు అజిత్ జోగి. కానీ, 2020లో అజిత్ జోగి మరణంతో అనివార్యమైన ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ స్థానాన్ని చేజిక్కించుకుంది. ఈ స్థానంలో ఆర్మీలో పనిచేసిన ప్రణవ్ కుమార్ అనే కొత్త అభ్యర్థినిలో బరిలో నిలిపింది బీజేపీ. ప్రస్తుత ఎమ్మెల్యే కేకే ధ్రువ్‌కు టికెట్ కేటాయించింది కాంగ్రెస్.
కోటా
కాంగ్రెస్ ఎమ్మెల్యే మరణంతో 2006లో జరిగిన కోటా ఉపఎన్నికల్లో అజిత్ జోగి భార్య కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. ఆ తర్వాత 2008, 2013లోనూ కాంగ్రెస్ తరఫున గెలవగా.. 2018లో జేసీసీ అభ్యర్థిగా విజయం సాధించారు. కాగా, ప్రస్తుతం బీజేపీ ముఖ్యనేత దిలీప్ సింగ్ కుమారుడు, బీజేవైఎం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు ప్రబల్ సింగ్ జుదేవ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది కమలదళం. మరోవైపు, ఛత్తీస్‌గఢ్ టూరిజం బోర్డు ఛైర్మన్ శ్రీవాస్తవను కోటా నుంచి బరిలో నిలిపింది.
పాలి తానాఖర్
పాలి తానాఖర్ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. 2019 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి పార్టీలోకి వచ్చిన రామ్ దయాళ్ను అభ్యర్థిగా నిలిపింది బీజేపీ. 1998లో మార్వాహి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన దయాళ్.. అప్పటి ముఖ్యమంత్రి అజిత్ జోగి కోసం రాజీనామా చేసి తన సీటును త్యాగం చేశారు. ఆ తర్వాత పాలి తనాఖర్ స్థానం నుంచి 2003, 2008, 2013 ఎన్నికల్లో గెలుపొందారు. 2018 ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. మరోవైపు కాంగ్రెస్ సైతం సిట్టింగ్ ఎమ్మెల్యే మోహిత్ రామ్‌ను కాదని దులేశ్వరి సిదర్ అనే మహిళకు టికెట్ కేటాయించింది.
కోర్బా
భూపేశ్ బఘేల్ ప్రభుత్వంలోని మరో మంత్రి జైసింగ్ అగర్వాల్.. 2008లో కోర్బా నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. ఈయనను ఓడించేందుకు మాజీ ఎమ్మెల్యే లఖన్‌లాల్ దేవగన్‌ను బరిలో నిలిపింది బీజేపీ.
జైజైపుర్
బీఎస్పీకి చెందిన కేశవ్ చంద్ర.. జైజైపుర్ స్థానం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయనపై యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బాలేశ్వర్ సాహు కాంగ్రెస్ బరిలోకి దింపగా.. బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ కృష్ణకాంత్ చంద్రకు టికెట్ ఇచ్చింది బీజేపీ.
మోహలా మాన్పుర్
బీజేపీ ఇప్పటి వరకు గెలవని మోహలా మాన్పుర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంద్రాశ్ మాండ్వికే మరోసారి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్. మాజీ ఎమ్మెల్యే సంజీవ్ షాకు టికెట్ కేటాయించింది బీజేపీ.
ఆ మూడు స్థానాల్లో బోణీ కొట్టని కాంగ్రెస్
మరోవైపు బీజేపీలాగే.. రాష్ట్రంలోని ఓ మూడు స్థానాల్లో ఇప్పటివరకు విజయం సాధించలేదు కాంగ్రెస్. రాయ్‌పుర్ సిటీ సౌత్, వైశాలి నగర్, బెల్తరా నియోజకవర్గాల్లో హస్తం పార్టీ ఇంకా బోణీ కొట్టలేదు.
రాయ్‌పుర్ సిటీ సౌత్
పట్టణ నియోజకవర్గమైన రాయ్‌పుర్ సిటీ సౌత్‌లో పూర్తిగా బీజేపీ ప్రాబల్యం ఉంటుంది. ఈ స్థానంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి బ్రిజ్మోహన్ అగర్వాల్ ప్రస్తుతం శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈయనపై మాజీ ఎమ్మెల్యే మహంత్‌ను బరిలో నిలిపింది కాంగ్రెస్.
వైశాలి నగర్
బీజేపీ ఎమ్మెల్యే విద్యారతన్ భాసిన్ మరణంతో ఖాళీగా ఉన్న ఈ స్థానంలో రెండు పార్టీలు కొత్త అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ రికేశ్ సేన్‌ను బరిలో దించగా.. ముకేశ్ చంద్రకార్కు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్.
బెల్తరా
సిట్టింగ్ ఎమ్మెల్యే రజనీశ్ సింగ్‌కు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది బీజేపీ. ఆయన స్థానంలో కొత్త అభ్యర్థి సుశాంత్ శుక్లాను బరిలో దింపింది కమలం పార్టీ. మరోవైపు బిలాస్‌పుర్ అధ్యక్షుడు విజయ్ కేస్రవానీని అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్.
Chhattisgarh Election 2018 : 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 90 స్థానాలకు గాను 68 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ 15 సీట్లతో ప్రతిపక్షానికే పరిమితమైంది. జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ 5 సీట్లు, బీఎస్పీ 2 స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ 75 స్థానాలు సాధించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కాగా, ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7, 17న రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.