BJP organisational changes: నితిన్ గడ్కరీ.. భారతీయ జనతా పార్టీలో కీలక నేత. శివరాజ్ సింగ్ చౌహాన్.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి. వీరిద్దరినీ పార్టీ అత్యున్నత కమిటీ పార్లమెంటరీ బోర్డు నుంచి ఉద్వాసన పలకడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో పాటు వయసు నిబంధనను మినహాయింపును ఇస్తూ కర్టాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను కమిటీలోకి తీసుకుంది. వీటన్నింటినీ చూస్తే భాజపా నిర్ణయాల వెనుక ఏదైనా పెద్ద ప్లాన్ వేసిందా అనే అనుమానాలు తలెత్తున్నాయి.
2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ.. పార్టీ అత్యున్నత కమిటీ పార్లమెంటరీ బోర్డులో కీలక మార్పులు చేసింది. పార్టీ సంస్థాగత సమస్యలు, ఆయా రాష్ట్రాల్లో తలెత్తిన రాజకీయ సవాళ్లను పరిష్కరించే దిశగా మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే ప్రాంతీయ, సామాజిక ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పిస్తూ.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కమిటీ నుంచి తొలగించింది. అలాగే అగ్రవర్ణాల పార్టీగా పేరు తెచుకున్న భాజపా.. ఆ పేరును తొలగించేలా చర్యలు తీసుకుంది. పార్టీ అత్యున్నత కమిటీలో బలహీన, వెనుకబడిన వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో పార్టీ చరిత్రలోనే తొలిసారిగా అగ్రవర్ణాల కన్నా బలహీన వర్గాల వారు అధికంగా ఉన్నారు.
అంతకుముందే అనేక రాష్ట్రాలకు కొత్త నాయకత్వాన్ని నియమించిన పార్టీ అధినాయకత్వం.. తాజాగా మరిన్ని రాష్ట్రాల్లోను మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌లో కొత్త నాయకత్వాన్ని నియమించింది. కొన్ని వారాల కిందటే మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్‌కు రాష్ట్ర అధ్యక్షులను నియమించింది. అంతకుముందు ఉత్తర్‌ప్రదేశ్, తెలంగాణ, బంగాల్ అధ్యక్షులను మార్చింది. ఈ మార్పులతో భాజపా భారీగా లాభపడింది. 2019 లోక్‌సభ ఎన్నికలతో పాటు తెలంగాణ, బంగాల్లో పార్టీ ప్రభావం చూపింది.
అత్యున్నత కమిటీలోకి యడియూరప్ప: దక్షిణాదిలో పార్టీ బలంగా ఉన్న కర్ణాటకలోనూ నాయకత్వ మార్పు ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ బలంగా ఉందని.. దానిని ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై సరైన రీతిలో ఎదుర్కోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కాగా ఈ వార్తలను పార్టీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ఈ తరుణంలోనే వయసు నిబంధనను పక్కనపెట్టి రాష్ట్ర తాజా మాజీ ముఖ్యమంత్రి, లింగాయత్ నేత బీఎస్ యడియూరప్పను పార్లమెంటరీ బోర్డులోకి తీసుకుంది. ఈ నిర్ణయంతో ఆ వర్గానికి దగ్గర కావడం సహా దక్షిణాదికి ప్రాధాన్యం ఇచ్చామన్న సంకేతాన్ని పంపింది.
జాతీయ రాజకీయాల్లోకి బన్సల్: ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సునీల్ బన్సల్‌ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకువచ్చి తగిన ప్రాధాన్యం ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంపై మంచి పట్టున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడమే కాక.. బన్సల్ సామర్థ్యానికి తగిన గుర్తింపును ఇచ్చినట్లు అయిందని అధిష్ఠానం యోచిస్తోంది. దీంతో పాటు రాష్ట్రంలో వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలను తొలగిపోతాయని భావిస్తోంది.
బన్సల్‌ను తెలంగాణ, బంగాల్ సహా ఐదు రాష్ట్రాలకు ఇంఛార్జ్‌గా నియమించింది భాజపా. ప్రాంతీయ పార్టీలు పాలిస్తున్న ఈ రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా ఈ నియామకాన్ని చేపట్టింది. మహారాష్ట్ర, బిహార్‌లో రాజకీయ శక్తుల పునర్వ్యవస్థీకరణ జరగడం వల్ల భాజపాకు మార్పులు అనివార్యమయ్యాయి. బిహార్‌లో జేడీయూ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది భాజపా. ఇటీవలే ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్న నీతీశ్ కుమార్ పార్టీ.. తెగదెంపులు చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వరుసగా 2014, 2019 ఎన్నికల్లో 40 లోక్‌సభ స్థానాలకు గాను 31, 39 సాధించిన ఎన్డీఏకు ఇది పెద్ద సవాల్‌గా మారింది.
యూపీ మంత్రిగా ఉన్న స్వతంత్ర దేవ్ సింగ్‌ను పార్టీ రాష్ట్ర అధ్యకుడిగా నియమించింది అధిష్ఠానం. ప్రాంతీయ, సామాజిక వర్గాల సమీకరణాలను దృష్టిలో పెట్టుకునే ఈ మార్పు చేసినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భాజపా రాష్ట్రంలో బలంగా ఉందని ఆ పార్టీ నాయకుడు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం, పార్టీకి బలమైన సమన్వయం కలిగి ఉండేలా జాతీయ నాయకత్వం కృషి చేసిందన్నారు. వీటి వల్లే ఎన్నికల్లో విజయం సాధించి భాజపా అధికారంలోకి వచ్చిందని తెలిపారు.
2021లో యూపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భాజపా భారీ మెజార్టీతో విజయం సాధించింది. 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది.
బిహార్‌లో 35 సీట్లు లక్ష్యంగా బరిలోకి: భాజపా సంప్రదాయ ఓటర్ వర్గమైన అగ్రవర్ణాలతో పాటు బలహీన, వెనుకబడిన వర్గాలను దగ్గరికి తీసుకునే పనిలో నిమగ్నమైంది. అందుకు సూచికగానే రాష్ట్ర అధ్యక్షుడు, శాసనసభ, మండలిలో నాయకులను మార్చింది. ఇటీవలే భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులతో సమావేశం జరిగింది. 2024 జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 35 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించింది అధినాయకత్వం.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లోనూ నాయకత్వాన్ని మార్చింది భాజపా. ఇటీవల జరిగిన స్థానిక, ఉపఎన్నికల్లో ఓటమిని చవిచూసిన భాజపా నాయకత్వాన్ని పునర్వ్యవస్థీకరించింది. పొరుగు రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో కీలకమైన స్థానాలను మార్పులు చేస్తుందని భావిస్తున్నారు. మహారాష్ట్రలో మహాకూటమి ప్రభుత్వాన్ని పడగొట్టిన భాజపా.. రాష్ట్ర అధ్యక్షుడిని మార్చింది. మరాఠా సామాజిక వర్గానికి చెందిన చంద్రకాంత్ పాటిల్ స్థానంలో.. సంప్రదాయ ఓట్ బ్యాంకు కలిగిన ఓబీసీ వర్గం నేత చంద్రశేఖర్ బవాన్‌కులేను నియమించింది. శివసేనను బలహీన పరిచినా.. ఎన్సీపీ, కాంగ్రెస్ కలయికతో బలమైన ప్రత్యర్థిగా మారవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
సంస్థాగతంగానూ మార్పులు : గతనెలలో పలు రాష్ట్రాలకు కీలకమైన సంస్థాగత నియామకాలను చేపట్టారు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. కర్ణాటక సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా అరుణ్ కుమార్ స్థానంలో ఆర్ఎస్ఎస్కు చెందిన రాజేశ్ జీవీని నియమించారు. ఈశాన్య రాష్ట్రాల సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్న అజయ్ జమ్వాల్‌ను మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఇంఛార్జ్గాను నియమించారు. ప్రస్తుతం తెలంగాణ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్న మంత్రి శ్రీనివాసులును పంజాబ్‌కు బదిలీ చేశారు.
ఇవీ చదవండి: భాజపా అనూహ్య నిర్ణయం, పార్లమెంటరీ బోర్డు నుంచి గడ్కరీ ఔట్
Sunil Bansal: తెలంగాణ భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా సునీల్ బన్సల్