ETV Bharat / opinion

బైడెన్​ ఐరోపా యాత్రతో చైనాకు చెక్​!

చైనా దూకుడుతో అగ్రరాజ్య హోదాకు ముప్పును గుర్తించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. దానికి కళ్లెం వేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఐరోపా సమాఖ్య సహకారం కీలకమైన నేపథ్యంలో ఆయా దేశాల్లో పర్యటిస్తూ బుజ్జగించే పనులను వేగవంతం చేశారు. మరి ఈ ప్రయత్నాలు ఫలించేనా?

china eu relations
బైడెన్ ఐరోపా యాత్ర
author img

By

Published : Jun 11, 2021, 7:36 AM IST

డ్రాగన్‌ దూకుడుకు కళ్లెం వేయకపోతే అగ్రరాజ్య హోదా చేజారిపోతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చాలా ముందుగానే పసిగట్టారు. ఈ క్రమంలో చైనా ఆర్థిక శక్తిని లక్ష్యంగా చేసుకొనేలా వ్యూహం పన్నారు. ఇందుకు ఐరోపా సమాఖ్య సహకారం అవసరమని గుర్తించారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ దురుసుతనం కారణంగా దూరమైన మిత్రులను బుజ్జగించే పనిని వేగవంతం చేశారు. బైడెన్‌ తీరు ఐరోపా సమాఖ్యలో మార్పును తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో బైడెన్‌ అమెరికా పాత మిత్రదేశాలకు భరోసానిచ్చేందుకు తాజాగా చేపట్టిన ఐరోపా యాత్ర విశేష ప్రాధాన్యం సంతరించుకుంది.

నోరు పారేసుకుంటున్న డ్రాగన్‌

డ్రాగన్‌కు వ్యతిరేకంగా బైడెన్‌ చేపట్టిన చర్యలతో చైనా-ఐరోపా సమాఖ్య మధ్య కుదిరిన సమగ్ర పెట్టుబడుల ఒప్పందం (సీఏఐ) నిలిచిపోయింది. ఈ పరిణామాలు చైనాకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఈ ఒప్పందం కోసం ఇరుపక్షాలు 2013 నుంచి ఏడేళ్లపాటు 35 విడతలకు పైగా చర్చలు జరిపాయి. బైడెన్‌ శ్వేతసౌధంలోకి అడుగుపెడితే ఇది ప్రమాదంలో పడుతుందని గ్రహించిన చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌ రంగంలోకి దిగారు. ఐరోపా సమాఖ్యకు తాయిలాలు ఇచ్చి ఒప్పందంపై చర్చలను కొలిక్కి తెచ్చారు. ఈ ఒప్పందం వల్ల వాహన, రసాయన, వైద్య, ఆర్థిక సేవల రంగాల్లోని కంపెనీలకు చైనా మార్కెట్లో లబ్ధి చేకూరుతుంది. వేగంగా వృద్ధి చెందుతున్న విద్యుత్తు వాహనాల మార్కెట్‌ జర్మనీకి చాలా కీలకం. దీంతో జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌- ఈ ఒప్పందం కోసం చొరవ చూపారు.

చిన్నచూపు..

చైనాతో సంబంధాలపై ఐరోపా సమాఖ్య 2019లో విడుదల చేసిన వ్యూహపత్రం మూడు అంశాలను తేటతెల్లం చేసింది. డ్రాగన్‌ను పర్యావరణం వంటి అంశాల్లో భాగస్వామిగా; వ్యాపారం వంటి ఆర్థిక అంశాల్లో వ్యూహాత్మక పోటీదారుగా; విలువ, పరిపాలన వ్యవస్థ వంటి విషయాల్లో విరోధిగా పరిగణిస్తోంది. 'మా దేశాల మార్కెట్‌లోకి ప్రవేశం కల్పిస్తున్నాం.. అంతమాత్రాన మానవ హక్కులను పట్టించుకోవాల్సిన అవసరం లేదనే తీరును ఉపేక్షించబోం..' అనే ఐరోపా సమాఖ్య వ్యవహార శైలిని అర్థం చేసుకోవడంలో చైనా బోల్తాపడింది. దాని దృష్టిలో ఐరోపా సమాఖ్య అంటే 'అమెరికా అనుచర బృందం' అనే చిన్నచూపు ఉంది.

తాజాగా సమగ్ర పెట్టుబడుల ఒప్పందం మూలనపడటానికి వీఘర్ల అంశం కారణమైంది. షింజియాంగ్‌ ప్రాంతంలో వారితో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని మార్చిలో అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఐరోపా సమాఖ్య చైనా అధికారులపై ఆంక్షలు విధించాయి. 1989 తియనాన్మెన్‌ ఉదంతం తరవాత తొలిసారి ఐరోపా సమాఖ్య చైనాపై ఆంక్షలు విధించింది. ఇందుకు ప్రతిగా ఈయూకు చెందిన పది మందితో పాటు నాలుగు సంస్థలపై డ్రాగన్‌ ఆంక్షలు విధించింది. అంతేకాదు- జర్మన్లను నాజీలని, నమీబియన్ల హంతకులని నోరు పారేసుకొంది. ఈ పరిణామాలతో ఐరోపా సమాఖ్య పెట్టుబడుల ఒప్పందాన్ని 'ఆమోదించే ప్రక్రియ'ను నిలిపివేసింది.

బీఆర్‌ఐకి ప్రత్యామ్నాయం

దీంతో చైనా ఇప్పుడు పరిష్కారం కోసం ఫ్రాన్స్‌ తలుపు తట్టింది. కానీ, జర్మనీ, ఫ్రాన్స్‌లలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి సమయంలో పెట్టుబడులకు ఆశపడి డ్రాగన్‌ తరఫున ఫ్రాన్స్‌ వకాల్తా పుచ్చుకోవడం సాహసమే అవుతుంది. అదే సమయంలో చైనా నేతృత్వంలోని 17+1 బృందం నుంచి లిథువేనియా వైదొలగడం కారణంగా ముసలం పుట్టినట్లయింది. స్టీల్‌, అల్యూమినియం వ్యాపార విధానాలను ఉత్పాదక శక్తితో తనకు అనుకూలంగా మార్చుకొనేందుకు చైనా చేస్తున్న యత్నాలను అడ్డుకుంటామని అమెరికా-ఐరోపా సమాఖ్య మే మూడో వారంలో ప్రకటించాయి. ఈ క్రమంలో ఓ వ్యూహాన్ని సిద్ధం చేసేందుకు ఐరోపా సమాఖ్య ప్రతినిధి జోసెఫ్‌ బోరెల్‌, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకన్‌ గత నెలలో భేటీ అయ్యారు. తాజాగా అమెరికా-ఈయూ మధ్య వైమానిక రంగంలో ఉన్న టారిఫ్‌లను నాలుగు నెలలు సస్పెండ్‌ చేశారు. మరోవైపు అమెరికా వాణిజ్య విభాగం నిషేధిత జాబితాలో చైనా సంస్థల సంఖ్యను బైడెన్‌ 59కి పెంచారు. కరోనా పుట్టుకపై దర్యాప్తు అంశాన్ని అమెరికా నెత్తికెత్తుకొంది. దీన్ని ఒక్క చైనా తప్ప మరే దేశమూ వ్యతిరేకించదు. ఇక జూన్‌ 11 నుంచి 13 వరకు బ్రిటన్‌లో జరగనున్న జీ-7 దేశాల సమావేశంలో చైనా బీఆర్‌ఐ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంపై దృష్టిపెట్టనున్నారు. ఈ సమావేశానికి భారత్‌, ఆస్ట్రేలియా, దక్షిణకొరియా, దక్షిణాఫ్రికాలకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. భారత్‌తో ఐరోపా సమాఖ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు పునఃప్రారంభించింది.

మరింత దూకుడు

ఐరోపాలో తమపై ప్రజావ్యతిరేకత పెరిగిన విషయం షీ జిన్‌పింగ్‌ గ్రహించారు. ఇటీవల చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో మాట్లాడుతూ దేశానికి గౌరవప్రదమైన పేరు తీసుకురావాలని దౌత్యవేత్తలను ఆదేశించారు. మిత్రుల సంఖ్యను పెంచుకోవాలని సూచించారు. ఇదంతా అమెరికా మిత్రపక్షాల 'సమష్టి వ్యూహా'నికి చెక్‌ పెట్టడం కోసమే. కానీ, జిన్‌పింగ్‌ సూచనలు మాటలకే పరిమితం అయ్యాయి. ఆయన హితబోధ చేసిన కొన్ని రోజుల్లోనే గ్లోబల్‌టైమ్స్‌ ఎడిటర్‌ హు షీజిన్‌ అమెరికాకు అణు బెదిరింపులు చేస్తూ కథనం ప్రచురించారు. భవిష్యత్తులో 'షింజియాంగ్‌లో వీఘర్లు', 'కరోనా పుట్టుక' అంశాల్లో అమెరికా, ఐరోపా సమాఖ్యలు మరింత దూకుడుగా ఉండనున్నాయి. ఆ సమయంలో చైనా దౌత్యవేత్తలు సంయమనం పాటించడంపైనే ఆ దేశ భవిష్యత్తు సంబంధాలు ఆధారపడి ఉంటాయి.

- లక్ష్మీతులసి

ఇదీ చూడండి: భారత్-ఈయూ చర్చలు.. పాల్గొననున్న మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.