రాజకీయం ముసుగులో రాక్షసంగా జనానికి కీడు చేసే క్షుద్ర యంత్రాంగం కోర సాచినప్పుడల్లా శాంతి భద్రతల పరిస్థితి ఉత్పన్నమవుతూనే ఉంది. సాంకేతిక పరిజ్ఞాన విప్లవం పుణ్యమా అని పుట్టుకొచ్చిన ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో వెర్రితలలు వేస్తున్న భావ ప్రకటన స్వేచ్ఛ- ఒక్కసారి దూదిగుట్టలో నిప్పునెరసులా మారి పెనుముప్పు తెచ్చిపెడుతోంది. మత ఘర్షణల చితి మంటలు ఎగదోసి దానినుంచి రాజకీయంగా చలికాగాలనుకొనే అరాచక ధోరణి నాలుగు రోజుల క్రితం బెంగళూరును అట్టుడికించింది. ప్రగతి కోసం శాంతి, శాంతికోసం భద్రత అత్యవసరమని ఎవరెంతగా మొత్తుకొన్నా పెడచెవిన పెట్టి స్వార్థపర రాజకీయం బుసకొడితే ఎంతటి భయోత్పాత పరిస్థితులు నెలకొంటాయో బెంగళూరు అనుభవం రుజువు చేస్తోంది. ఆ వైనం చిత్తగించండి!
నెత్తురు చిందించే రాజకీయం యుద్ధమైతే, రక్తరహిత సమరమే రాజకీయమని మావో జెడాంగ్ ఏనాడో సూత్రీకరించారు. ప్రజల భావోద్వేగాల్ని రెచ్చగొట్టి, వాళ్లలో వాళ్లు కొట్టుకు చచ్చే పరిస్థితి కల్పించి ఆ భయోద్విగ్నతలే సోపానాలుగా రాజకీయ పీఠాలు అధిష్ఠించే నికృష్ట ధోరణులు లోతుగా పాతుకుపోతున్నాయిప్పుడు! బెంగళూరులో స్థానిక ఎమ్మెల్యే మేనల్లుడు ఫేస్‌బుక్‌లో పెట్టిన ఒక పోస్టుపై రేగిన వివాదం చినికి చినికి గాలివానై పోలీసు కాల్పులకు, ముగ్గురు ఆందోళనకారుల మృతికి, ప్రభావిత ప్రాంతాల్లో కర్ఫ్యూకు కారణమైంది. దాదాపు 80మంది పోలీసులు గాయపడి, భారీయెత్తున ఆస్తి నష్టానికి కారణమైన అల్లర్లకు అసలు మూలాలు ఏమిటో ఆరాతీస్తున్న పోలీసులు వెల్లడిస్తున్న వివరాలు దిగ్భ్రాంతపరుస్తున్నాయి. బెంగళూరు మహానగర పాలిక ఎన్నికలు ఈ ఏడాదే జరగాల్సి ఉంది. 2013లో పురుడు పోసుకొన్న సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) స్థానిక వర్గ బలిమితో గట్టిగా కాలూనుకోవడానికి విఫలయత్నం చేస్తోంది. నిరుడు అక్కడ జరిగిన కార్పొరేటర్ ఉప ఎన్నికల్లోనూ విజయం స్థానిక పులకేశి నగర్ ఎమ్మెల్యే నిలబెట్టిన అభ్యర్థినే వరించడం ఎస్‌డీపీఐ నేతలకు కంటగింపుగా మారింది. ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి తన నియోజకవర్గ పరిధిలోని స్థానాలన్నింటినీ ఎస్‌సీ స్థానాలుగా రిజర్వ్ చేయించే పనిలో ఉన్నారన్న సమాచారం వారిని మరింతగా కుపితుల్ని చేసింది. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ అసంతృప్తి జ్వాలలకు శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్ కుమార్ పెట్టిన ఫేస్‌బుక్ పోస్టు ఆజ్యమైంది. అభ్యంతరకరమైన వ్యాఖ్యపై పోలీసులకు ఫిర్యాదు చెయ్యడానికి వెళ్ళిన ఎస్‌డీపీఐ పెద్దలు- నవీన్‌ను తమకు అప్పగించాలంటూ మంకుపట్టుపట్టి, భారీ సంఖ్యలో జన సమీకరణకు సమకట్టి పొద్దుపోయాక హింసనచణ- ధ్వంస రచనకు తెగబడిన తీరు దిగ్భ్రాంతకరం! గెరిల్లా తరహా దాడులతో రెండు పోలీస్ స్టేషన్లకు నిప్పుపెట్టిన విధ్వంసకారులు సమీప ప్రాంతాల ఇళ్లమీదా విరుచుకుపడి సృష్టించిన అరాచకం ఒక్కముక్కలో చెప్పాలంటే- భయానకం!
మూడు దశాబ్దాలుగా..
భిన్నమతావలంబకుల కదంబమైన ఇండియాలో సౌభ్రాతృత్వ భావనే దండలో దారం. మతసామరస్యమే భారత రాజ్యాంగసారం. ఆయా సందర్భాల్లో క్షణికావేశాలతో జరిగే పొరపాట్లకు సామాజికంగా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిన దుర్ఘటనలు బెంగళూరు నగరంలోనే గత మూడున్నర దశాబ్దాల్లో ఎన్నో నమోదయ్యాయి. 1986 డిసెంబరులో దక్కన్ హెరాల్డ్ పత్రిక ప్రచురించిన మలయాళీ రచయిత పికెఎన్ నంబూద్రి కథ ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ రేగిన ఆందోళన- 16 నిండు ప్రాణాల్ని బలిగొంది. పిమ్మట అయిదేళ్లకు నీరే నిప్పును రాజేసినట్లుగా ప్రజ్వరిల్లిన కావేరీ జల వివాదం- తీవ్ర ఘర్షణలకు దారితీసి 20 మంది అభాగ్యుల ఉసురుతీసింది. 1994లో గాంధీజయంతినాడు దూరదర్శన్‌లో కన్నడ వార్తల వెన్నంటి పది నిమిషాలు ఉర్దూ వార్తా ప్రసారం సాగడం; రానున్న ఎన్నికల దృష్ట్యా ఓ వర్గం ఓట్లకు వలవేసే లక్ష్యంతో నాటి ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీయే ఆ పాచిక వేశారన్న అభిప్రాయం బలపడటం నిరసనలకు మత ఘర్షణలకు దారితీసింది. పాతిక మందిని బలిగొన్న రాక్షసకాండ అది. అంతెందుకు? 2006లో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కాలధర్మం చెందినప్పుడు ఆయన కడచూపు దక్కలేదన్న ఆక్రోశం ఘర్షణలుగా రూపాంతరం చెంది విచ్చలవిడిగా ఆస్తుల విధ్వంసానికి, ఎనిమిదిమంది నిస్సహాయంగా బలైపోవడానికీ కారణమైంది. 2007లో కాంగ్రెస్‌నుంచి వేరుకుంపటి పెట్టిన జాఫర్ షరీఫ్- సద్దాం హుస్సేన్ ఉరితీత నేపథ్యంలో అమెరికా వ్యతిరేక ర్యాలీకి సమకట్టడమూ తీవ్ర ఉద్రిక్తతలకు ఊపిరులూదింది. ఆ తరహా సంకుచిత రాజకీయమే ఇప్పుడూ బెంగళూరును బెంగటిల్లజేస్తోంది!
బిక్కుబిక్కుమంటూ...
అరాచక మూకలు చెలరేగి పోయినప్పుడల్లా పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన జీవన హక్కే కొడిగట్టిపోతోంది. బెంగళూరు విధ్వంసకాండ సందర్భంగా ఓ కుటుంబం మూడు గంటలపాటు స్నానాల గదిలో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. తీవ్ర స్థాయిలో ఆస్తినష్టం జరిగినా ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియని దుస్థితి! పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ నిరుడు డిసెంబరులో యూపీలో రేగిన అలజడులు భారీగా ఆస్తి ప్రాణ నష్టాలకు కారణమయ్యాయి. అయిదు వేలమందికిపైగా విధ్వంసకారుల్ని నిర్బంధించిన ఆదిత్యనాథ్ ప్రభుత్వం- ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులకు వాటిల్లిన నష్టాల్ని వారినుంచే వసూలు చేసేందుకు సిద్ధమవుతోంది. బెంగళూరు దుర్ఘటనల్లోనూ కుట్ర కోణాలు మరింత లోతుగా ఉన్నాయంటున్న యెడ్యూరప్ప సర్కారు- ఆర్థిక నష్టాల మొత్తాల్ని విధ్వంసకారులనుంచే వసూలు చెయ్యాలనుకొంటోంది. పబ్లిక్ ఆస్తుల విధ్వంస నిరోధక చట్టాన్ని 1984లోనే చేసినా అది కాగితాలకే పరిమితమైపోగా, సుప్రీంకోర్టే చొరవచూపి రెండు కమిటీల్ని ఏర్పాటు చేసింది. జస్టిస్ కేటీ థామస్, న్యాయ కోవిదుడు ఫాలీ నారిమన్‌ల కమిటీలు చేసిన సూచనల్ని ఆమోదిస్తూ- చట్టాన్ని నవీకరించాల్సి ఉందని న్యాయపాలిక అభిప్రాయపడింది. కట్టుదిట్టంగా చట్టాలు చెయ్యడమే కాదు, వాటి అమలు సక్రమంగా ఉండేలా చూసి, మేర మీరిన వాళ్లెవరైనా సరే- ఉపేక్షించేది లేదన్న సందేశం స్ఫుటంగా అందించడం ప్రభుత్వాల విధి. విధ్వంస శక్తుల తోక కోసి సున్నం పెట్టినప్పుడే- ఎక్కడైనా, ఎప్పుడైనా శాంతి భద్రంగా ఉంటుంది, ఏమంటారు?
- పర్వతం మూర్తి